జగిత్యాల అగ్రికల్చర్: ‘నేను రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించిన.. ఏం లాభం.. ఏ మాత్రం గిట్టుబాటు కాలేదు’ అని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల మార్కెట్ యార్డులో బుధవారం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది రెండెకరాల్లో మొక్కజొన్న వేసిన.. ఒక్కో మొక్కజొన్న బస్తాను వెయ్యి రూపాయలు పెట్టి కొన్న. ఇక, భూమిలో తేమ లేక విత్తనాల నుంచి మొలక బాగా రాలేదు.. భూమిలో ఉన్న విత్తనాలను ఉడుతలు ఎలుకలు తిన్నయ్. కలుపు తీయించినా. ఇక పంట బాగా పండుతున్నదనుకున్న సమయంలో మొక్కజొన్న పీచుకు రాగానే రామచిలుకలు మోపైనయ్.
తోటంతా తిరుగుతూ ఇనుప డబ్బాల మీద కొట్టుడు, పాత చీరలు తోటంతా కట్టించిన. గింజ గట్టి పడుతుందనుకుంటున్న సమయంలో కోతులు ఎగబడ్డాయ్. ఇవి చాలదన్నంటూ పందులు దాడులు చేసినయ్. వీటన్నింటిని ఎదుర్కొని మొక్కజొన్నను కోసి, కంకి విరిసి, బూరు తీసి, ఆరబెట్టిన. కంకి పట్టించినా.. ఇంత కష్టపడుతున్నా రెండు ఎకరాల మొక్కజొన్నకు నేను పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు’అని వాపోయారు. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో మొక్కజొన్నకు ప్రస్తుతమున్న రూ.1,425 గిట్టుబాటు కాదని, రూ.2 వేలు ఉంటేనే రైతులు మొక్కజొన్న పండించే అవకాశం ఉందని, లేదంటే ఇతర పంటల వైపు మళ్లుతారని జీవన్‌రెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment