corn farmer
-
నేనూ మొక్కజొన్న రైతునే
జగిత్యాల అగ్రికల్చర్: ‘నేను రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించిన.. ఏం లాభం.. ఏ మాత్రం గిట్టుబాటు కాలేదు’ అని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల మార్కెట్ యార్డులో బుధవారం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది రెండెకరాల్లో మొక్కజొన్న వేసిన.. ఒక్కో మొక్కజొన్న బస్తాను వెయ్యి రూపాయలు పెట్టి కొన్న. ఇక, భూమిలో తేమ లేక విత్తనాల నుంచి మొలక బాగా రాలేదు.. భూమిలో ఉన్న విత్తనాలను ఉడుతలు ఎలుకలు తిన్నయ్. కలుపు తీయించినా. ఇక పంట బాగా పండుతున్నదనుకున్న సమయంలో మొక్కజొన్న పీచుకు రాగానే రామచిలుకలు మోపైనయ్. తోటంతా తిరుగుతూ ఇనుప డబ్బాల మీద కొట్టుడు, పాత చీరలు తోటంతా కట్టించిన. గింజ గట్టి పడుతుందనుకుంటున్న సమయంలో కోతులు ఎగబడ్డాయ్. ఇవి చాలదన్నంటూ పందులు దాడులు చేసినయ్. వీటన్నింటిని ఎదుర్కొని మొక్కజొన్నను కోసి, కంకి విరిసి, బూరు తీసి, ఆరబెట్టిన. కంకి పట్టించినా.. ఇంత కష్టపడుతున్నా రెండు ఎకరాల మొక్కజొన్నకు నేను పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు’అని వాపోయారు. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో మొక్కజొన్నకు ప్రస్తుతమున్న రూ.1,425 గిట్టుబాటు కాదని, రూ.2 వేలు ఉంటేనే రైతులు మొక్కజొన్న పండించే అవకాశం ఉందని, లేదంటే ఇతర పంటల వైపు మళ్లుతారని జీవన్‌రెడ్డి వివరించారు. -
ఆశ నిరాశేనా?
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో మొక్కజొన్న రైతు పరిస్థితి దయనీయంగా తయారైంది. వర్షాభావం కారణంగా మొక్కజొన్న పంట ఎండిపోతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికి అందివస్తుందనుకున్న మొక్కజొన్న పంట పశువులకు దాణాగా మారుతోంది. పంట ఎండిపోతుండడంతో చేసేదేమి లేక రైతులు మొక్కజొన్న పొలాల్లో పశువులను మేపుతున్నారు. ఖరీఫ్‌లో మొక్కజొన్న 1,10,662 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం ఉండగా రైతులు 1,07,521 హెక్టార్లలో మొక్కజొన్న పంటలను సాగు చేశారు. వర్షాభావం కారణంగా జిల్లాలో మొక్కజొన్నసాగు విస్తీర్ణం తగ్గింది. తాజాగా సకాలంలో వర్షాలు కురియక మొక్కజొన్న పంట ఎండిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రస్తుతం మొక్కజొన్న పంట విత్తు ఎదిగే దశలో ఉంది. ఈ దశలో మొక్కజొన్న పంటలకు వర్షం చాలా అవసరం. అయితే గత 20 రోజులుగా వర్షాలు కురవడంలేదు. వర్షాభావం కారణంగా జిల్లాలో సుమారు 15వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు అంచనా. మరోవారం రోజులపాటు వర్షాలు కురవకపోతే మొక్కజొన్నపంట మరింత దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావంతో మొక్కజొన్నపంట ఎండిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయశాఖ అధికారులు మొక్కజొన్న పంట నష్టం వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వర్షాభావమే శాపంగా మారింది. జిల్లాలో ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు కురవక పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా మొక్కజొన్న పంటపై వర్షాభావం పరిస్థితి ఎక్కువగా ఉంది. ఖరీఫ్‌లో వర్షాలు లేకపోవడంతో రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపారు. అయితే పంట ఎదిగే దశలో, కంకిపట్టే దశలో, విత్తు ఎదిగే దశల్లో వర్షాలు కురవలేదు. దీంతో మొక్కజొన్నపంట దెబ్బతింది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, మెదక్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో వర్షాభావం కారణంగా మొక్కజొన్నపంట ఎండిపోతోంది. మెదక్, దుబ్బాక నియోజకవర్గాల్లో రైతులు మొక్కజొన్న ఎండిపోవడంతో పొలాల్లో పశువులను మేపుతున్నారు. వర్షాభావంతో 40 శాతం మేర మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. -
మొక్కజొన్న రైతుకు అపార నష్టం
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: మొక్కజొన్న రైతులను వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. జిల్లాలోని ఆత్మకూరు, నందికొట్కూరు, కొత్తపల్లి, పగిడ్యాల, జూపాడుబంగ్లా తదితర మండలాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో మొక్కజొన్నను అధికంగా సాగు చేశారు. ముందస్తు సాగుతో నెల రోజుల నుంచి కోతలు ముమ్మరమయ్యాయి. అయితే వారం రోజులుగా ఈ ప్రాంతాల్లో కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలతో కోత కోసి పొలాల్లో ఆరబెట్టిన పంటకు భారీ నష్టం వాటిల్లింది. మార్కెట్లో డిమాండ్ ఉన్నా.. తడిసిన దిగుబడులను తక్కువ ధరకు అడుగుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ ఏడాది దాదాపు 30వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగయింది. వర్షాల బారిన 10వేల హెక్టార్లకు పైగా దెబ్బతినడంతో రైతులకు పెట్టుబడి కూడా లభించే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మద్దతు ధర రూ.1310లుగా నిర్ణయించినా.. తడిసిన మొక్కజొన్నను వ్యాపారులు రూ.800 నుంచి రూ.900లకే అడుగుతుండటం గమనార్హం. ఇదిలాఉండగా మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు చర్యలు చేపట్టారు. మూడు, నాలుగు రోజుల్లో మొక్కజొన్న పండించే మండలాల్లో రెండు, మూడు గ్రామాలకు ఒకటి చొప్పున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు శనివారం ఆయన ప్రకటించారు. ఐకేపీ ఆధ్వర్యంలో గ్రామైక్య సంఘాలు మొక్కజొన్నను కొనుగోలు చేసి మార్క్‌ఫెడ్‌కు సరఫరా చేస్తామని తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలంటే మొక్కజొన్నలో తేమ లేకుండా ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు. మొక్కజొన్న రైతుకు న్యాయం చేయండి: మాజీ ఎమ్మెల్యే గఫూర్ వర్షాల వల్ల తడిసి దెబ్బతిన్న మొక్కజొన్నను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్ జేసీని కోరారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ప్రతినిధులు, ఆత్మకూరు ప్రాంత రైతులతో కలసి జేసీని ఆయన చాంబర్లో కలసి వినతిపత్రం సమర్పించారు. జేసీని కలిసిన వారిలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.రాజశేఖర్, ఆత్మకూరు రైతు సంఘం అధ్యక్షుడు నాగేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.