ఆశ నిరాశేనా? | corn crop dried the cause of no rains | Sakshi
Sakshi News home page

ఆశ నిరాశేనా?

Published Mon, Oct 6 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

corn crop dried  the cause of no rains

సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో మొక్కజొన్న రైతు పరిస్థితి దయనీయంగా తయారైంది.  వర్షాభావం కారణంగా మొక్కజొన్న పంట ఎండిపోతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికి  అందివస్తుందనుకున్న మొక్కజొన్న పంట పశువులకు దాణాగా మారుతోంది. పంట ఎండిపోతుండడంతో చేసేదేమి లేక రైతులు మొక్కజొన్న పొలాల్లో పశువులను మేపుతున్నారు.

ఖరీఫ్‌లో మొక్కజొన్న 1,10,662 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం ఉండగా రైతులు 1,07,521 హెక్టార్లలో మొక్కజొన్న పంటలను సాగు చేశారు. వర్షాభావం కారణంగా జిల్లాలో మొక్కజొన్నసాగు విస్తీర్ణం తగ్గింది. తాజాగా సకాలంలో వర్షాలు కురియక మొక్కజొన్న పంట ఎండిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రస్తుతం మొక్కజొన్న పంట విత్తు ఎదిగే దశలో ఉంది.

ఈ దశలో మొక్కజొన్న పంటలకు వర్షం చాలా అవసరం. అయితే గత 20 రోజులుగా వర్షాలు కురవడంలేదు. వర్షాభావం కారణంగా జిల్లాలో సుమారు 15వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు అంచనా. మరోవారం రోజులపాటు వర్షాలు కురవకపోతే మొక్కజొన్నపంట మరింత దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావంతో మొక్కజొన్నపంట ఎండిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయశాఖ అధికారులు మొక్కజొన్న పంట నష్టం వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
 వర్షాభావమే శాపంగా మారింది.

 జిల్లాలో ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు కురవక పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా మొక్కజొన్న పంటపై వర్షాభావం పరిస్థితి ఎక్కువగా ఉంది. ఖరీఫ్‌లో వర్షాలు లేకపోవడంతో రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపారు. అయితే పంట ఎదిగే దశలో, కంకిపట్టే దశలో, విత్తు ఎదిగే దశల్లో వర్షాలు కురవలేదు. దీంతో మొక్కజొన్నపంట దెబ్బతింది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, మెదక్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో వర్షాభావం కారణంగా మొక్కజొన్నపంట ఎండిపోతోంది. మెదక్, దుబ్బాక నియోజకవర్గాల్లో రైతులు మొక్కజొన్న ఎండిపోవడంతో పొలాల్లో పశువులను మేపుతున్నారు. వర్షాభావంతో 40 శాతం మేర మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement