కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: మొక్కజొన్న రైతులను వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. జిల్లాలోని ఆత్మకూరు, నందికొట్కూరు, కొత్తపల్లి, పగిడ్యాల, జూపాడుబంగ్లా తదితర మండలాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో మొక్కజొన్నను అధికంగా సాగు చేశారు. ముందస్తు సాగుతో నెల రోజుల నుంచి కోతలు ముమ్మరమయ్యాయి. అయితే వారం రోజులుగా ఈ ప్రాంతాల్లో కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలతో కోత కోసి పొలాల్లో ఆరబెట్టిన పంటకు భారీ నష్టం వాటిల్లింది.
మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా.. తడిసిన దిగుబడులను తక్కువ ధరకు అడుగుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ ఏడాది దాదాపు 30వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగయింది. వర్షాల బారిన 10వేల హెక్టార్లకు పైగా దెబ్బతినడంతో రైతులకు పెట్టుబడి కూడా లభించే పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వం మద్దతు ధర రూ.1310లుగా నిర్ణయించినా.. తడిసిన మొక్కజొన్నను వ్యాపారులు రూ.800 నుంచి రూ.900లకే అడుగుతుండటం గమనార్హం. ఇదిలాఉండగా మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు చర్యలు చేపట్టారు. మూడు, నాలుగు రోజుల్లో మొక్కజొన్న పండించే మండలాల్లో రెండు, మూడు గ్రామాలకు ఒకటి చొప్పున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు శనివారం ఆయన ప్రకటించారు. ఐకేపీ ఆధ్వర్యంలో గ్రామైక్య సంఘాలు మొక్కజొన్నను కొనుగోలు చేసి మార్క్‌ఫెడ్‌కు సరఫరా చేస్తామని తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలంటే మొక్కజొన్నలో తేమ లేకుండా ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు.
మొక్కజొన్న రైతుకు న్యాయం
చేయండి: మాజీ ఎమ్మెల్యే గఫూర్
వర్షాల వల్ల తడిసి దెబ్బతిన్న మొక్కజొన్నను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్ జేసీని కోరారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ప్రతినిధులు, ఆత్మకూరు ప్రాంత రైతులతో కలసి జేసీని ఆయన చాంబర్‌లో కలసి వినతిపత్రం సమర్పించారు. జేసీని కలిసిన వారిలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.రాజశేఖర్, ఆత్మకూరు రైతు సంఘం అధ్యక్షుడు నాగేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.