అప్పుల ఊబి! | Quicksand of debt! | Sakshi
Sakshi News home page

అప్పుల ఊబి!

Published Fri, Dec 26 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

Quicksand of debt!

సాక్షి, కర్నూలు : నేలను నమ్ముకొని పంటలు సాగు చేస్తున్న రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారు. ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పంటను పండించే అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పెట్టిన పెట్టుబడులకు పొంతన లేని మద్దతు ధరలు రైతులకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. ఏటా పంట సాగులో ఖర్చులు పెరుగుతున్నాయి.
 
 అంతర్జాతీయ మార్కెట్లు, ఎగుమతులు, దిగుమతుల గురించి తెలియని రైతులు స్థానిక మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా చితికిపోతున్నారు. వ్యవసాయాన్ని వీడి పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి.. వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలతో ముడిపడి ఉంది. అయితే ఆ దిశగా సరైన ప్రోత్సహం లేదు. పెట్టుబడులకు అనుగుణంగా రుణాలు అందాలి. సాగునీటి సౌకర్యం మెరుగుపడాలి. బీళ్లుగా మారిన భూములు సస్యశ్యామలమైతేనే రైతుల స్థితిగతులు మెరుగుపడి బంగారు కలలు సాకారమయ్యే అవకాశం ఉంది.
 
 జిల్లాలో 6.50 లక్షల మంది రైతులు పది లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉన్నారు. ఇందులో ఏటా 6.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. రైతుల అవసరాల మేరకు రుణ ప్రణాళిక ఉండడం లేదు. గతేడాది రుణ ప్రణాళికను భారీగా పెంచినా రుణమాఫీ తదితర కారణాలతో సకాలంలో రుణాలు అందని పరిస్థితి నెలకొంది. పంట రుణాలు రూ. 2,400 కోట్లు. వ్యవసాయ అనుబంధ రంగాలైన చిన్ననీటిపారుదల, ఉద్యానం, పాడి, యాంత్రీకరణ, సెరికల్చర్, మత్స్య తదితరాలకు రూ. 1,400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. గత రెండేళ్లలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం భారీగా పెరిగింది. 2013 కంటే ముందు రూ.1,700 కోట్లు ఉండగా అలాంటిది గతేడాది ఒక్కసారిగా రూ. 1,950 కోట్లు చేశారు. ఈ ఏడాది గత రుణ లక్ష్యం కంటే 2,400 కోట్లు (25 శాతం) పెంచేయడంతో భారీగా రుణాలు అందుతాయని రైతులు సంబరపడ్డారు. అయితే ఖరీఫ్ పూర్తయి రబీ మొదలైనా రుణాలను రెన్యువల్ చేశారే తప్ప కొత్తగా రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. రైతులు వ్యాపారుల వద్ద చేసిన అప్పు రూ. వేయి కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా.
 
 లక్ష్యం భారీగా పెట్టుకున్న రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్ల వెనుకంజ వేస్తున్నారు. గత రెండేళ్లుగా నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వలేకపోయారు. ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది రుణ ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు రూ. 435 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇది రైతు చేతికి అందిందా అంటే అదీ లేదు. కేవలం కాగితాల్లో గత రుణాలను రెన్యువల్ చేసి పెట్టారు. ఫలితంగా రైతులు పంట పెట్టుబడులకు వ్యాపారుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది.
 
 జిల్లాలో ఏటా 6.50 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వచ్చే అవకాశముంది. అయితే 3.55 లక్షల ెహ క్టార్ల భూమికి మాత్రమే సాగునీరందుతోంది. రూ. కోట్ల వ్యయంతో అనేక ప్రాజెక్టులు నిర్మించినా అవి పూర్తిస్థాయిలో నీరందించలేపోతున్నాయి. ఫలితంగా 80 శాతం మంది రైతులు వర్షాధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. అధికారుల నివేదిక ప్రకారం జిల్లాలో కాల్వల ద్వారా..  రిజర్వాయర్ల ద్వారా.. బావులు, బోర్లు తదితర ఇతర సౌకర్యాల ద్వారా 66 వేల హెక్టార్ల భూమికి సాగు నీరందుతోంది. ఫలితంగా వర్షాధారంగా పంటలు సాగు చేసిన రైతులు వర్షాభావంతో ఏటా నష్టపోవాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement