దారుణం! | Brutally! | Sakshi
Sakshi News home page

దారుణం!

Published Sun, Dec 7 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

Brutally!

కర్నూలు(అగ్రికల్చర్) : వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలులో బ్యాంకులు కీలకపాత్ర వహిస్తున్నాయి. అనేక పథకాల అమలులో బ్యాంకులు సహకరిస్తేనే ప్రగతి సాధ్యమవుతుంది. రైతులు, మహిళల అభ్యున్నతికి, నిరుద్యోగుల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి, ఇలా అన్నిటికీ నేడు బ్యాంకుల చేయూత అత్యవసరం అయింది. మరి బ్యాంకులు సహకరిస్తున్నాయా అంటే సర్వత్రా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకుల సహకారం లోపించడం వల్ల రైతులు, మహిళా సంక్షేమం పడకేసింది. స్వయం ఉపాధి పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 8 నెలలు గడిచిపోయాయి.
 
 మామూలుగా అయితే వార్షిక రుణ ప్రణాళికలో 60 నుంచి 70 శాతం మేర లక్ష్యాలను సాధించాలి. కానీ వివిధ శాఖల్లో ఇంతవరకు పథకాల అమలే లేదంటే ఇందులో అధికారుల అలసత్వం, బ్యాంకర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. జిల్లాలో లీడ్ బ్యాంకుగా సిండికేట్ బ్యాంకు వ్యవహరిస్తోంది. పథకాల అమలులో ఈ బ్యాంకు సహకారం ఆదర్శంగా ఉండాలి. కానీ లీడ్ బ్యాంకు సహకారం కూడా లోపించడం గమనార్హం. ఖరీఫ్ సీజన్  సెప్టెంబర్ నెలతో ముగిసింది. అక్టోబర్ నుంచి రబీ మొదలైంది. రైతులకు అవసరమైన పంట రుణాలు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు.
 
 బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడానికి ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ ప్రధాన కారణమనే వాదన ఉంది. ఖరీఫ్‌లో రూ.2,074 కోట్లు పంట రుణాలుగా పంపిణీ చేయాల్సి ఉన్నా, కేవలం 61,159 మందికి రూ.435 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఇవి కూడా పాత రుణాలను కొత్త రుణాలుగా రెన్యువల్ చేసినవే. కొత్త రైతులకు ఒక్కరికి కూడా బ్యాంకు పంట రుణాలు ఇచ్చిన పరిస్థితి లేదు. రబీలో రూ.814 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా ఇంతవరకు రుణాల పంపిణీ మొదలే కాలేదు.
 
 వ్యవసాయ టర్మ్ లోన్లు, ఇతర కార్యక్రమాలకు రూ.480 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం. టర్మ్ లోన్లు అంటే వ్యవసాయ అభివృద్ధికి వివిధ రూపాలలో రుణాలు ఇస్తారు. ఇంతవరకు కేవలం రూ.199.4 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. నాన్ ప్రియారిటీ సెక్టారు కింద రూ.434 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 5,011 మందికి రూ.110 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు.
 
 ఇతర ప్రాధాన్యత సెక్టారు కింద స్వయం సహాయక సంఘాలకు రూ.825 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. దీనిని నెలవారీ టార్గెట్లుగా విభజించి బ్యాంకుల వారీగా లక్ష్యాలను ఇచ్చారు.  కానీ రుణాల పంపిణీలో ప్రగతి నామమాత్రంగా ఉంది. 8 నెలలు గడిచిపోయాయంటే లక్ష్యంలో కనీసం 50 శాతం ప్రగతి ఉండాలి. 30 శాతం కూడా ప్రగతి లేదు. నవంబర్ నెల వరకు కేవలం రూ.144 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు.
 
 స్వయం ఉపాధి పథకాల కింద బీసీ కార్పొరేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 8,193 మంది రుణ సదుపాయం కల్పించాల్సి ఉంది. రూ.4500.72 లక్షలు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం. ఇందులో ప్రభుత్వం సబ్సిడీ రూ.2250.36 లక్షలు, బ్యాంకు లోను రూ.2250.36 లక్షలు ఉంది. బ్యాంకులు సహకరిస్తేనే సబ్సిడీ విడుదల అవుతుంది. ఇంతవరకు ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు.
 
 బీసీ అభ్యుదయ యోజన కింద అర్బన్ ప్రాంతాల్లో 1,211 మందికి వ్యక్తిగతంగా రుణాలు ఇవ్వాల్సి ఉంది. 665 లక్షలు రుణాలుగా ఇవ్వాలనేది లక్ష్యం. ఇందులో 50 శాతం ప్రభుత్వ సబ్సిడీ, 50 శాతం బ్యాంకులు లోన్లు ఇవ్వాల్సి ఉంది. బ్యాంకుల సహకారం లోపించడం వల్ల రుణాల పంపిణీ మొదలే కాలేదు.
 
 రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, బోయ, ఉప్పర, బట్రాజు, కృష్ణబలిజ, కుమ్మర, విశ్వబ్రాహ్మణ, మేదర సొసైటీలలో 946 గ్రూపులకు(14190 మంది) రూ.70.95 కోట్లు రుణాలుగా పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో 50 శాతం సబ్సిడీ, 50 శాతం బ్యాంకు లోన్‌లు ఉంటుంది. కానీ ఇంతవరకు రుణాల పంపిణీ అతీగతీ లేకుండాపోయింది.
 
 మైనర్ ఇరిగేషన్ సెక్టార్ కింద 388 మందికి 271 యూనిట్లు మంజూరు చేసి 518 ఎకరాలకు నీరు ఇవ్వాలనేది లక్ష్యం. ఇందులో బ్యాంకులోను రూ.31.42 లక్షలు ఉంటుంది. కానీ ఇంతవరకు రుణాలను పంపిణీ చేయలేదు. పట్టు పరిశ్రమ శాఖలో 95 యూనిట్లకు రూ.142.50 లక్షలు వ్యయం చేయాలనేది లక్ష్యం. ఇందులో కూడా బ్యాంకు సహకారం లేదు.
 
 చేనేత జౌళి శాఖలో వీవర్ క్రెడిట్ కార్డుల కింద 3,026 మందికి ఆర్థిక సహాయం అందజేయాల్సి ఉంది. ఇందులో ఎటువంటి హామీ లేకుండా రూ.50 వేల వరకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. కానీ 36 వీవర్స్ క్రెడిట్ కార్డులకు రూ.15 లక్షలు మాత్రమే పంపిణీ చేశారు.
 
 పశుసంవర్థక శాఖలో నార్మల్ స్టేట్ ప్లాన్, ఎస్‌సీఎస్‌పీ, ఆర్‌కేవీవై కింద గొర్రెల పెంపకానికి రుణాలు ఇవ్వాల్సి ఉంది. ఎన్‌ఎస్‌పీ, ఎస్‌ఎస్‌ఎస్‌పీ కింద యూనిట్ కాస్ట్ రూ.లక్ష ఉండగా, ఇందులో 50 శాతం సబ్సిడీ ఉండగా, 50 శాతం బ్యాంకులోను ఉంటుంది. ఆర్‌కేవీవైలో యూనిట్ కాస్ట్ రూ.1.60 లక్షలు కాగా, బ్యాంకు లోను రూ.1.20 లక్షలు ఉండగా, సబ్సిడీ రూ.40 వేలు ఉంటుంది. ఇంతవరకు ఒక్క బ్యాంకు కూడా రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ట్రైబల్ యాక్షన్ ప్లాన్ ప్రకారం రూ.559 యూనిట్లు పంపిణీకి రూ.365.25 లక్షలు వ్యయం చేయాల్సి ఉంది. ఇందులో సబ్సిడీ రూ.219.15 లక్షలు ఉండగా, బ్యాంకు రూ.134.90 లక్షలు రుణాలు ఇవ్వాలి. కానీ ఒక్క యూనిట్ కూడా గ్రౌండ్ కాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement