బ్యాంకుల చుట్టూ రైతన్నలు..రైతుబంధు సాయానికి కొర్రీలు.! | Farmers Around Banks For Raithu Bandhu Scheme Funds | Sakshi
Sakshi News home page

బ్యాంకుల చుట్టూ రైతన్నలు..రైతుబంధు సాయానికి కొర్రీలు.!

Published Mon, Dec 10 2018 11:24 AM | Last Updated on Mon, Dec 10 2018 11:24 AM

 Farmers Around Banks For Raithu Bandhu Scheme Funds - Sakshi

సాక్షి, కమాన్‌పూర్‌: రైతులకు పంట పెట్టుబడి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రబీ సాగుకోసం ఎకరాకు రూ. 4 వేలు చెల్లిస్తుంది. ఖరీఫ్‌ సాగుకు మొదటి విడతలో రైతులకు ప్రభుత్వం నేరుగా చెక్కుల రూపంలో అందజేసింది. రబీసాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అంత సిద్ధం చేసింది కాని ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో పెట్టుబడి సాయం రైతులకు నేరుగా ఇవ్వరాదని, నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేయాలని ఎన్నికల కమిషన్‌ అదేశాలు జారీ చేసింది. పెట్టుబడి సహయాన్ని బ్యాంకు అధికారులు రైతులను ఏలాంటి ఇబ్బందులు పెట్టకుండా నేరుగా రైతులకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇటీవల పంట పెట్టుబడి సహయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. డబ్బులు తీసుకునేందుకు బ్యాంకు వెళ్లిన రైతులకు బ్యాంకు సిబ్బంది లేని పోని కొర్రీలు పెడుతున్నారు. రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలు రెన్యువల్‌ చేసుకోలేదని డబ్బులు తీసుకోకుండా ఖాతాలోని డబ్బులను హోల్డ్‌( తాత్కాలికంగా నిలిపివేత)లో పెట్టడంతో రైతుల చేతికి డబ్బులు రాకపోవడంతో బ్యాంకు చుట్టు తిరుగుతున్నారు. రబీసాగు ప్రారంభం కావడంతో పెట్టుబడి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో పది రెవెన్యూ గ్రామాల పరిధిలో 4048 మంది రైతులకు పంట పెట్టుబడి సహాయం కోసం రైతులు వ్యవసాయాధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందించారు. వ్యవసాయశాఖ అధికారులు దరఖాస్తులను ఆన్‌లైన్‌ చే యడంతో రైతులకు నేరుగా డబ్బులను మండల కేంద్రంలోని ఎస్‌బీఐ. కేడీసీసీలతో పాటు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

డబ్బులు జమ కావడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ డబ్బులు తీసుకోవడానికి కమాన్‌పూర్‌ ఎస్‌బీఐ బ్యాంకు వెళ్లి విత్‌ డ్రా చేద్దామనుకుంటే డబ్బులు  హోల్డ్‌ చేశామని చెప్పడంతో ఇందేందని బ్యాంకులోని ఫీల్డ్‌ ఆఫీసర్‌ వద్దకు వెళ్లీ వివరాలు అడిగితే పంట రుణాలను రెన్యూవల్‌ చేసుకోలేదు అందుకు ఖాతాలోని డబ్బులను హోల్డ్‌ చేశామని అనడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. గిదేంది ప్రభుత్వం రైతులు నేరుగా బ్యాంకులకు వెళ్లీ పెట్టుబడి సహయాన్ని తీసుకోండి అని అంటుంటే మీరు ఇలా అంటున్నారేంటి అంటే సదురు బ్యాంకు అధికారులు రైతులకు సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రబీసాగు మొదలైంది. నారుమడి దున్ని నారుపోసుకునేందుకు డబ్బులు తీసుకునేందుకు వస్తే బ్యాంకు అధికారుల తీరుతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విషయంపై బ్యాంకు మేనేజర్‌ను వివరణ కోరగా రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలను రెన్యూవల్‌ చేసుకోకపోవడంతో ఆటోమేటిక్‌గా రైతుల ఖాతాలోని డబ్బులు హోల్డ్‌ చేస్తున్నారని వివరణ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement