కోడుమూరు : దిగుబడి బాగా వచ్చింది. అయితేనేం ధర పడిపోయింది. రైతుకు నిరాశే మిగిలింది. నెల రోజుల కిందట ఎండు మిర్చి ధర క్వింటా రూ.9,500 ఉండేది. ఈ ధర పంట దిగుబడి చేతికొచ్చేదాకా ఉంటుందని రైతులు ఆశించారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా ధర రూ.4,500 నుంచి రూ.6 వేలు పలుకుతోంది. ఈ ఏడాది రైతులు బోరు బావుల కింద కోడుమూరు, గూడూరు, సి. బెళగల్, కర్నూలు రూరల్ మండలాల పరిధిలో 8570 ఎకరాలలో మిరప పంటను సాగు చేశారు.
ఎకరాకు దాదాపు రూ.లక్ష వరకు ఖర్చు వచ్చిందని ప్యాలకుర్తి గ్రామానికి చెందిన రైతు గణేష్ తెలిపాడు. కోత కూలీల రేట్లు పెరగడంతో ప్రస్తుతం రైతుకు గిట్టుబాటు కావడం లేదు. క్వింటా రూ.4,500 నుంచి రూ.6 వేలు పలుకుతుండడంతో కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మిరప పంట ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చింది. అయితే పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర లేకుండాపోయింది. కూరగాయల సాగులో లాభాలు వస్తాయని ఆశపడిన రైతులకు ఈ ఏడాది నిరాశే మిగిలింది.
వర్కూరు గ్రామానికి చెందిన చిన్నమోషన్న అనే రైతు ఆరు ఎకరాలలో మిరప పంట సాగు చేశాడు. మార్కెట్లో ధర పడిపోవడంతో కోసిన పంటనంతటిని పొలంలోనే నిల్వ ఉంచుకున్నాడు. క్వింటా మిర్చి రూ.10 వేలకు అమ్ముడుపోతే తప్ప నష్టాల నుంచి బయట పడే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బాడిగ రకం ఎండు మిర్చి క్వింటా ధర రూ.6,500 నుంచి రూ.7,500 వరకు పలుకుతోంది. గతంలో బాడిగ మిర్చి రకం రూ.11 వేల వరకు అమ్ముడుపోయినట్లు రైతులు తెలియజేస్తున్నారు.
మిర్చి రైతుకు ధరాఘాతం
Published Sat, Feb 7 2015 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM
Advertisement
Advertisement