ఇక సమర భేరి..
సాక్షి, కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు సిద్ధమయ్యారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నీరుగారుస్తున్న వైనంపై ఉద్యమించేందుకు సమాయత్తమవుతున్నారు. వీరికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరిస్తూ ఈనెల 5వ తేదీన భారీ ధర్నా నిర్వహించడానికి ముందుకువచ్చింది. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజావాణిని వినిపించేందుకు 5న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద భారీ ధర్నాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో శనివారం ధర్నాకు పార్టీ శ్రేణలు సమాయత్తమవుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను పూర్తిగా విస్మరించారన్నారు.
రైతు రుణమాఫీకి రూ. 87 వేల కోట్లు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ కోసం రూ. 14 వేల కోట్లు అవసరం ఉందన్నారు. ఇంత వరకూ ఒక్కపైసా కూడా మాఫీ చేయలేదన్నారు. ఈ జాప్యంతో రైతులు, డ్వాక్రా సంఘాలపై రూ. 25 వేల కోట్లు వడ్దీ కట్టాల్సిన భారం పడిందన్నారు. జిల్లాలోనూ రైతులపై రూ. 300 కోట్లు, డ్వాక్రా సంఘాలపై దాదాపు రూ. 60 కోట్లు భారం పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో రుణమాఫీ కోసం కేవలం రూ. 500 కోట్లు మాత్రమే కేటాయించిన చంద్రబాబు తన సహజ నైజమైన వంచనను ప్రదర్శించారన్నారు.
అదే విధంగా ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు ప్రతినెలా రూ. 2 వేలు భృతి అంటూ మేనిఫెస్టోలో ప్రదర్శించిన చంద్రబాబు ఇంత వరకూ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 10 లక్షల మందికిపైగా పింఛన్లు రద్దు చేశారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో, సభల్లో మొత్తం 250కి పైగా వాగ్దానాలు చేసిన ఆయన ఇంత వరకూ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని స్పష్టం చేశారు. బాబు హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రైతులు, మహిళలు, చేనేత కార్మికులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరారు.