రుణమాఫీతో రుణం తీరేనా? | Article On Loan Waiver To Farmers | Sakshi
Sakshi News home page

రుణమాఫీతో రుణం తీరేనా?

Published Sat, Feb 9 2019 1:01 AM | Last Updated on Sat, Feb 9 2019 1:01 AM

Article On Loan Waiver To Farmers - Sakshi

ఎన్నికల సమయంలో వాగ్దానాలను చూస్తుంటే ఎన్నికలకు రైతులకు అవినాభావ సంబంధం ఉందా అనిపిస్తుంది. నేడు ఏ రాష్టంలో ఎన్నికలు జరిగినా అక్కడి రాజకీయ పార్టీలు చేసే ముఖ్యమైన వాగ్దానం ‘ రైతుల రుణమాఫీ‘. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా, ఇంకా వ్యవసాయ రంగం అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రంగం మీద ఆధార పడిన 61.5 శాతం రైతుల బతుకులు మారలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతాంగానికి మేలుచేసి, వారి అభివృద్ధికి దోహదం చేసే ఎన్నికల వాగ్దానాలు అవసరమే! అయితే అవి దీర్ఘకాలంలో రైతులకు ప్రయోజనం చేకూరేవిగా, వారి సంపదను పెంచేవిగా ఉండాలి. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీలు రైతుల ‘వ్యవసాయ రుణమాఫీ’కే పెద్దపీట వేస్తున్నాయి. ఈ వాగ్దానం ఆశ చూపి రైతుల ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిసారి ఎన్నికల వేళ  ‘రుణ మాఫీ’ ప్రకటనతో రైతులకు చేకూరే ప్రయోజనం కంటే దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు చేకూరే ముప్పే ఎక్కువ అన్న విషయం మననేతలకు తెలియదా? నిజానికి, రైతుల అభివృద్ధి ‘రుణ మాఫీ’తో సాధ్యం కాదు అనే విషయం తేటతెల్లం. 

రాజకీయ నాయకులు ‘రుణమాఫీ’ కాకుండా రైతులకు ‘పెట్టుబడి సాయం’ రూపంలో నగదు బది లీపై ఆలోచించాలి. నిజానికి 2008 లోనే నాటి సీఎం వైఎస్‌. రాజశేఖరరెడ్డి రైతులకు పెట్టుబడి సాయం రూపంలో నగదు బదిలీ గురించి ఆలోచించారు కానీ ఆయన అకాల మరణంతో అది కార్యరూపం దాల్చ లేక పోయింది. రైతుకు నేరుగా పెట్టుబడి కింద నగదును బదిలీ చేయడం ద్వారా రైతుకు బ్యాంకుల మీద లేదా వడ్డీవ్యాపారస్తులమీద ఆధార పడాల్సిన అవసరం ఉండదు. వడ్డీల భారం ఉండదు, రైతు తన సాగు ఎటువంటి ఒత్తిడి లేకుండా చేసుకునే అవకాశముంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి  ‘రైతుబంధు’ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరాకు 8 వేల రూపాయలు ఇవ్వడం ఒక విధంగా ‘రైతుల రుణమాఫీ’కి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కేసీఆర్‌ పథకాలను ఇప్పుడు తెలంగాణ మోడల్‌ గా చెప్పుకుంటున్నారు.

రైతుల ఈ దుస్థితికి కారణం వారు పండించే పంటకు సరైన ‘మార్కెటింగ్‌ విధానం’ లేకపోవడమే అని చెప్పక తప్పదు. మనదేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికి, లోపభూయిష్టమైన వ్యవసాయ ఉత్పతుల మార్కెటింగ్‌ విధానం స్థూల సమస్యగా చెప్పవచ్చు. ఇప్పటికీ, రైతు పండించిన పంట అమ్మడానికి స్థానిక వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీల మీద ఆధార పడుతున్నాడు. దీనితో విస్తృతమైన మార్కెటింగ్‌ అవకాశాలను కోల్పోతున్నాడు.

ఇక ప్రభుత్వాలు ప్రకటించే ‘కనీస మద్దతు ధర’ కాగితాలకే పరిమితం అవుతుంది తప్ప క్షేత్ర స్థాయికి చేరుకోవడంలేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ విధానం‘ (ఈ– నామ్‌) కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయింది. వీటికి తోడూ సాగునీరు, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత  మొదలగు సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. ఇలాంటి సమస్యల పరి ష్కారాన్నే పార్టీలు తమ ప్రధాన వాగ్దానాలుగా ప్రకటించగలిగిననాడు కేవలం రైతుల జీవితాల్లో నిజ మైన మార్పు రాగలదు.

-డాక్టర్‌ రామకృష్ణ బండారు, మార్కెటింగ్‌ పరిశోధకుడు, ఓయూ
మొబైల్‌ : 80191 69658 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement