రియల్టీ, ఇన్‌ఫ్రాల్లో లక్ష కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(ఆర్‌ఈఐటీ), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(ఇన్విట్)ల ద్వారా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు లభించే అవకాశముందని నిపుణులు, పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్‌ఈఐటీ, ఇన్విట్‌ల ఏర్పాటుకు వీలుకల్పిస్తూ రూపొందించిన కొత్త మార్గదర్శకాలకు సెబీ బోర్డు ఆదివారం ఆమోదముద్ర వేసింది. దీంతో యూఎస్, యూకే, జపాన్, హాంకాంగ్, సింగపూర్ తదితర అభివృద్ధి చెందిన మార్కెట్లను పోలి దేశీయంగానూ కొత్త పెట్టుబడి అవకాశాలకు తెరలేవనుంది.
కొత్త నిబంధనల వల్ల ఆర్‌ఈఐటీ, ఇన్విట్ యూనిట్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ చేసేందుకు అవకాశం లభిస్తుంది. సెబీ బోర్డు సమావేశానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. గత నెలలో జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రియల్టీ, మౌలిక రంగాలకు కొత్త పెట్టుబడులను తీసుకువచ్చే ప్రతిపాదనలను ప్రకటించిన సంగతి తెలిసిందే. జైట్లీ హాజరైన తాజా సమావేశంలో సెబీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ద్వారా వీటికి మరింత ఊపునివ్వనుంది. కాగా, బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ వీటికి పన్ను ప్రయోజనాలను కల్పించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతానికి చిన్న ఇన్వెస్టర్లకు నో
ఆర్‌ఈఐటీ, ఇన్విట్‌లలో పెట్టుబడి పెట్టేందుకు చిన్న(రిటైల్) ఇన్వెస్టర్లు మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంది. వీటిని రూపొందించడంలో ఉన్న క్లిష్టత, రిస్క్‌లు వంటి అంశాల కారణంగా ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు అనుమతించడంలేదు. ఆర్‌ఈఐటీలలో కనీస పెట్టుబడి మొత్తం రూ. 2 లక్షలు కాగా, ఇన్విట్‌లలో కనీసం రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. బోర్డు సమావేశం అనంతరం సెబీ చైర్మన్ యూకే సిన్హా విలేకరులకు ఈ విషయాలను వెల్లడించారు.
దేశీయంగా రియల్టీ, ఇన్‌ఫ్రా రంగాల వృద్ధికి ఈ ట్రస్ట్‌లు దోహదపడనున్నట్లు సిన్హా పేర్కొన్నారు. వీటి ద్వారా కొత్త పెట్టుబడులకు వీలు చిక్కడంతో బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. దేశ, విదేశీ ఇన్వెస్టర్లు, ప్రవాస భారతీయులు, సంస్థల నుంచి దీర్ఘకాలిక నిధులు లభిస్తాయని వివరించారు. ఎఫ్‌ఐఐలు, పెన్షన్ ఫండ్స్, బీమా కంపెనీలు తదితర సంస్థలకు వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
ప్రస్తుత 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా మౌలిక సదుపాయాల(ఇన్‌ఫ్రా) రంగానికి రూ. 65 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరపడతాయని గతంలోనే ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకు వీలు కల్పించే బాటలో ప్రభుత్వం బడ్జెట్‌లో ఇన్విట్స్‌కు తెరలేపింది. ఇదే విధంగా రియల్టీ రంగానికి ప్రధానంగా అందరికీ అందుబాటులో గృహాలు, పట్టణాల అభివృద్ధి వంటి ప్రభుత్వ ప్రతిపాదనల అమలుకు ఆర్‌ఈఐటీలు సహకరించనున్నాయి.
బ్రోకర్లకు ఒకే రిజిస్ట్రేషన్
వివిధ స్టాక్ ఎక్స్ఛేంజీలలో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు స్టాక్ బ్రోకర్లు ఇకపై పలుమార్లు రిజిస్ట్రేషన్లు చేసుకోవలసిన అవసరం ఉండబోదు. ఇందుకు సరళీకరించిన నిబంధనలకు సెబీ బోర్డు అనుమతించింది. దీంతో సెబీ వద్ద ఒకసారి రిజిస్టర్‌కావడం ద్వారా బ్రోకర్లు వివిధ ఎక్స్ఛేంజీలలో కార్యకలాపాలను చేపట్టేందుకు వీలు ఏర్పడుతుంది.
ఆహ్వానించదగ్గ పరిణామం
న్యూఢిల్లీ: ఆర్‌ఈఐటీ, ఇన్విట్‌ల కొత్త మార్గదర్శకాలకు సెబీ బోర్డు ఆమోదముద్ర వేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా దేశ, విదేశాల నుంచి ఈ రెండు రంగాలకూ 15-20 బిలియన్ డాలర్ల(రూ.1.2 లక్షల కోట్లు) వరకూ పెట్టుబడులు లభించే అవకాశముందని పలువురు అధికారులు, నిపుణులు అంచనా వేశారు. మార్కెట్ల నుంచి నిధులను సమీకరించేందుకు ఈ రెండు రంగాలకు ట్రస్ట్‌ల ద్వారా వీలు చిక్కనుందని అభిప్రాయపడ్డారు.
క్రెడాయ్, జోన్స్ లాంగ్ లాసాఎల్లే ఇండియా, కేపీఎంజీ ఇండియా, వాకర్ చండియాక్ అండ్ కంపెనీ, నారెడ్కో తదితర సంస్థల ప్రతినిధులు రానున్న ఐదేళ్లలో అటు రియల్టీ, ఇటు ఇన్‌ఫ్రా రంగాలకు అవసరమైన నిధులు సమకూరతాయని వ్యాఖ్యానించారు. రియల్టీ రంగానికి 10 బిలి యన్ డాలర్లు, ఇన్‌ఫ్రా రంగానికి మరో 10 బిలియన్ డాలర్ల చొప్పున నిధులు లభించే అవకాశముందని చెప్పారు.
మార్కెట్ ఉల్లంఘనలపై కన్ను సెబీకి జైట్లీ సూచన
మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంపైన, వారి ఇక్కట్ల తొలగింపుపైన దృష్టిపెట్టాలని సెబీని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. మార్కెట్లలో జరగడానికి అవకాశమున్న ఉల్లంఘనలపై కన్నేయాలని సూచించారు. ఆదివారం ఇక్కడ జరిగిన సెబీ బోర్డు సమావేశంలో ఆయన ప్రసంగించారు. క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రకటనల అమలు గురించి, దేశంలో పెట్టుబడుల వాతావరణం గురించి కూడా ఆయన చర్చించారని సెబీ చైర్మన్ యు.కె.సిన్హా సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు.