![XI Jinping Vision 2035 approved by Chinese Communist Party - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/31/30101203.jpg.webp?itok=5_8tEIuO)
బీజింగ్: చైనాలో అధ్యక్షు డు జిన్‌పింగ్ రూపొందిం చిన 14వ పంచవర్ష ప్రణా ళిక విజన్ 2035కి అధికార కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ఆమోద ముద్ర వేసింది. నాలుగు రోజుల పాటు జరిగిన పార్టీ ప్లీనరీ సదస్సు గురువారం ముగిసింది. చివరి రోజు విజన్ 2035కి పార్టీ ఆమోదముద్ర వేయడంతో జిన్‌పింగ్ పదవికి మరో పదిహేనేళ్లు ఢోకా లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీనిని ఆమోదించడం ద్వారా మరో 15 ఏళ్ల పాటు జిన్‌పింగ్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారని సీపీసీ సంకేతాలు పంపినట్టయిందని భావిస్తున్నారు. సీపీసీ సెంట్రల్ కమిటీకి చెందిన 198 మంది సభ్యులు, మరో 166 మంది ప్రత్యామ్నాయ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
2021–2035 సంవత్సరాల్లో దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం రూపొందించిన ఈ దీర్ఘకాలిక ప్రణాళిక విజన్ 2035పై విస్తృతంగా చర్చలు జరిపాక దానిని ఆమోదించారు. చైనా పూర్తి స్థాయి స్వయం సమృద్ధిని సాధించడానికి, దిగుమతుల్ని పూర్తిగా నిషేధించి, స్వదేశీ మార్కెట్‌ని ప్రోత్సహించేలా దీనిని రూపొందించారు. కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో తర్వాత 67 ఏళ్ల వయసున్న జిన్‌పింగ్ పార్టీలో అత్యంత శక్తి్తమంతమైన నాయకుడిగా ఎదిగారు. దేశాధ్యక్షుడిగా రెండు సార్లు మించి పదవి చేపట్టకూడదన్న నిబంధనల్ని రాజ్యాంగ సవరణ ద్వారా 2018లో సవరించి తానే జీవిత కాలం అధ్యక్షుడిగా కొనసాగుతానని ప్రకటించుకున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ పదవీ కాలం 2022తో ముగియనుంది. ఇప్పుడిక తాను రూపొందించిన విజన్ 2035కి ఆమోద ముద్ర పడడంతో మరో పదిహేనేళ్ల పాటు ఆయన పదవికి ఢోకా ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment