భీమవరం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలకు సంబంధించి అనుమతులు ఇవ్వడానికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాయలంలోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో చేపల చెరువులకు అనుమతులు, సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే చేపల చెరువులకు అనుమతులు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. చేపల చెరువుల అనుమతుల్లో పారదర్శకతను పెంచి అవినీతిని తగ్గించాలన్నారు. వ్యవసాయ భూములను చెరువులుగా మార్చరాదని, కొల్లేరును పరిరక్షించాలని, అదే సమయంలో చిన్న రైతులను ఇబ్బందులకు గురిచేయకూడదని పేర్కొన్నారు. చెరువులు తవ్వేటప్పుడు సన్న,
చిన్నకారు రైతుల అభిప్రాయాలను, సాగునీటి కాలువలు, మంచినీటి వనరులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మండల స్థాయి కమిటీల నుంచి చేపల చెరువుల అనుమతుల ప్రతిపాదనలను డివిజన్‌స్థాయి కమిటీ పరిశీలించాలన్నారు. అనంతరం జిల్లాస్థాయి కమిటీ ద్వారా అనుమతులు పొందాలన్నారు. ఇరిగేషన్, ఏపీ ట్రాన్స్‌కో, అటవీ శాఖ, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన అనుమతులు పొందినదీ లేనిదీ సమీక్షించి ఈ నెల 29న నిర్వహించే జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో మత్స్య శాఖ డెప్యూటీ డెరైక్టర్ వీవీ కృష్ణమూర్తి, ఏడీ షేక్ లాల్ మహ్మద్, వ్యవసాయశాఖ జేడీ కృపాదాస్, బీసీ కార్పొరేషన్ ఈడీ, వికలాంగుల సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జి ఏడీ జి.పెంటోజీరావు పాల్గొన్నారు.
చెరువుల అనుమతికి ప్రత్యేక సెల్
Published Thu, Jan 9 2014 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement