కార్డుతో చెల్లింపులపై సర్చార్జీలు రద్దు
డిజిటల్ పేమెంట్లకు ఊతమిచ్చే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారాను, ఇంటర్నెట్ ద్వారాను జరిపే చెల్లింపులపై ఇకపై సర్‌చార్జీలు, సర్వీస్ చార్జీలు, కన్వీనియన్స్ ఫీజుల బాదరబందీ తొలగిపోనుంది. అలాగే నిర్దిష్ట పరిమితికి మించిన మొత్తాలను కార్డు లేదా డిజిటల్ మాధ్యమంలోనే చెల్లించడం తప్పనిసరి కానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. ఆర్థిక లావాదేవీల్లో నగదు చెల్లింపుల ప్రమేయాన్ని తగ్గించేందుకు, డిజిటల్ కార్డుల ద్వారా లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. పన్నుల ఎగవేత ఉదంతాలను తగ్గిం చేందుకు, ఆదాయాలు.. చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం నగదురహిత విధానానికి మళ్లేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. మరోవైపు, 2016- 17 సీజన్‌కు సంబంధించి జనుము మద్దతు ధరను 18.5 శాతం పెంచి క్వింటాలుకు రూ. 3,200కి చేర్చే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసిం ది. ప్రస్తుతం ఇది రూ. 2,700గా ఉంది. వాస్తవానికి దీన్ని రూ. 3,650కి పెంచాలని జౌళి శాఖ కోరింది.