క్రెడిట్ కార్డ్ రీచార్జ్‌లపై పేటీఎం వాత
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం చార్జీల బాదుడుకు తెరతీసింది. క్రెడిట్ కార్డు ద్వారా వాలెట్ రీఛార్జింగ్ కోసం చేసే లావాదేవీలపై వాత పెట్టేందుకు నిర్ణయంచింది. వీటిపై 2శాతం ఫీజును వసూలు చేస్తోంది. దీనిపై పేటీఎం తన అధికారిక బ్లాగ్‌లో వివరణ ఇచ్చింది. వాలెట్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. క్రెడిట్ కార్డులు ఉపయోగించి వాలెట్ రీఛార్జ్ , బ్యాంకులకు డబ్బు తిరిగి బదిలీలలో చోటు చేసుకుంటున్న అక్రమాలని ఆపడానికి ఈ చార్జీలను విధిస్తున్నట్టు తెలిపింది.
ఈ నిర్ణయం మార్చి 8 నుంచి అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే షాపింగ్, బిల్లుల చెల్లింపులకు ఈ ఫీజు పెంపు వర్తించదని స్పష్టం చేసింది. కేవలం రీచార్జ్‌లపై మాత్రమే 2 శాతం చార్జీ వసూలు చేయనున్నట్టు తెలిపింది. అయితే డెబిట్ కార్డు చెల్లింపులు, నెట్‌బ్యాంకింగ్‌పై ఎలాంటి రుసుముం ఉండదని బ్లాగ్‌లో వివరణ ఇచ్చింది. అలాగే క్రెడిట్ కార్డు ద్వారా వాలెట్ టాప్ ఆప్ లపై అదే మొత్తంలో క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తునట్టు పేర్కొంది.
ఇ-కామర్స్, ఇతర ఆన్‌లైన్ వాణిజ్య సంస్థలకు యూజర్ల డిజిటల్ చెల్లింపుల కోసం కార్డ్ నెట్ వర్క్ సంస్థలకు లేదా బ్యాంకులకు తము అధిక ఫీజులు చెల్లిస్తున్నామని కంపెనీ సీఈవో విజయ్‌శేఖర్ శర్మ తెలిపారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు ద్వారా యూజర్లు కేవలం వాలెట్ లో మనీ యాడింగ్ చేసుకుంటూ పోతే తమకు వచ్చే లాభమేమీ ఉండదనీ, ఇలాంటి సేవల వల్ల తాము నష్టపోతున్నామన్నారు.
కాగా గతంలో మొబైల్ రీచార్జ్‌లు, కరెంట్ బిల్లు చెల్లింపులు, బస్ టికెట్లు వంటి వాటికే పరిమితమైన డీమానిటైజేషన్ నేపథ్యంలో మొబైల్ వాలెట్ చెల్లింపులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.