సాక్షి, హైదరాబాద్ : సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు తొలి దశ (స్టేజ్–1) అటవీ అనుమతులు లభించాయి. ప్రాజెక్టు పరిధిలో 1,531 హెక్టార్ల (3,827.5 ఎకరాలు) అటవీ భూముల సేకరణకు సంబంధించిన అనుమతులను కేంద్ర అటవీ శాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయం మంజూరు చేసింది. శుక్రవారం చెన్నైలో జరిగిన అటవీ, పర్యావరణ సాధికార కమిటీ సమావేశంలో సీతారామ ప్రాజెక్టు ప్రతిపాదనలపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డాక్టర్ ఎం.ఆర్.జి.రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీ.. సీతారామ ప్రాజెక్టు ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలించి కేంద్రానికి సానుకూలంగా సిఫారసు చేసింది.
దీంతో అటవీ భూములను ఇరిగేషన్ శాఖకు బదిలీ చేయడానికి లైన్ క్లియర్ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం అటవీ డివిజన్లలోని 1,201 హెక్టార్లు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం అటవీ డివిజన్లలోని 330 హెక్టార్ల అటవీ భూమిని ఇరిగేషన్ శాఖకు బదలాయించేందుకు కేంద్రానికి అటవీ, పర్యావరణ ప్రాంతీయ కార్యాలయం సిఫార్సు చేస్తుంది. ప్రాజెక్టులోని పైపులైన్లు, గ్రావిటీ కాల్వలు, వాటిపై నిర్మాణాలు, విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూటరీలు, టన్నెళ్లు నిర్మించడానికి ఈ అటవీ భూములు అవసరమవు తున్నాయి.
175 ఎకరాలు తగ్గింపు..
సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధా న్యత ప్రాజెక్టుగా పరిగణి స్తోంది. ఈ కాలువ నిర్మాణం కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో 114 కిలోమీటర్ల మేర అటవీ భూముల నుంచి వెళ్తోంది. ఇందుకోసం 1,602 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టుకు బదలాయిం చాలని సాగునీటి పారుదల శాఖ తొలుత కోరింది. దీనిపై అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి శోభతో పాటు అధికారుల బృందం ఇటీవల వారంపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించింది. 9 అటవీ డివిజన్ల పరిధిలో భూములు, ప్రాజెక్టు కాలువ అలైన్‌మెంట్, వన్య ప్రాణు లు సంచరించే ప్రాంతాలు, అటవీ సంపదపై ప్రభావాల్ని పరిశీలించింది. అలైన్‌మెంట్, టన్నెళ్ల ప్రకారం లెక్కలు వేసిన అధికారులు బదలాయించే అటవీ భూమిని 1,531 హెక్టార్లుగా నిర్ధారించారు. ఫలితంగా బదలాయించే అటవీ భూమి 71 హెక్టార్లు (175 ఎకరాలు) తగ్గింది.
పనులు వేగిరం: హరీశ్
సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు లభించడంపై ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. రెండో దశ అనుమ తుల ప్రక్రియకు కృషి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎకో సెన్సి టివ్ జోన్‌లోని 275 హెక్టార్లకు (688 ఎకరాలు) కేంద్ర వన్యప్రాణి బోర్డు అనుమ తి కోసం కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు చెందిన భూసేకరణ, అటవీ, పర్యావరణ, వన్యప్రా ణి అనుమతులు, పంప్ హౌజ్‌లు, కెనాల్స్, ఇతర పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు ఇంకా వేగంగా జరగాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా 4,050 ఎకరాలను కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో గుర్తించామని, ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. ప్రత్యామ్నాయ అటవీ భూముల్లో అడవులు పెంచేందుకు అవసరమయ్యే నిధులను అంచనా వేసి ఇరిగేషన్ శాఖకు వెంటనే సమర్పించాలని అటవీ శాఖను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment