సాక్షి, ఖమ్మం: సుంకిశాల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కేటీఆర్‌కు కౌంటరిచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్ట్‌లు కూలిపోతే మా ప్రభుత్వానికి ఎలా బాధ్యత అవుతుందని భట్టి ప్రశ్నించారు.
కాగా, తాజాగా భట్టి విక్రమార్క ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాళేశ్వరం, సుంకిశాల కట్టింది బీఆర్‌ఎస్ పార్టీనే. ప్రాజెక్ట్‌లు మీరే కట్టారు కాబట్టి.. అవి కూలితే మీదే బాధ్యత. మా ప్రభుత్వంలో కట్టడాలపై మాది బాధ్యత అవుతుంది. సాగర్‌లోకి నీళ్లు రాకుండా ఉంటాయా?. మేము ఎందుకు దాచిపెడతాము. మేడిగడ్డ కరెక్ట్ కాదిన మేము ముందే చెప్పాం. మీరు కట్టిన ప్రాజెక్ట్‌లు క్వాలిటీ లేకుండా అవినీతితో కట్టారు. రాష్ట్రంలో మిగతా ప్రాజెక్ట్‌లు కూడా చెక్ చేయాల్సి అవసరం ఉంది. ప్రాజెక్ట్‌ల విషయంలో జరిగిన తప్పులను కేటీఆర్, బీఆర్‌ఎస్ ఒప్పుకుని ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రాజెక్ట్‌లో ఇంజినీర్లు చేయాల్సిన పని మీరు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.
ఇక, సుంకిశాల విషయంలో అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు గోడకూలిపోవడం హైదరాబాద్ నగర ప్రజలకు విషాద వార్త. ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు ఘటన జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా లేక విషయం కప్పిపెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ తెలియకపోతే ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. త్వరత్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. సుంకిశాలలో ప్రభుత్వ నిర్వహణ లోపంతో గోడ కూలింది. హైదరాబాద్‌కు తాగునీరు ఇవ్వాలని సుంకిశాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ప్రారంభించాం. గత దశాబ్దంగా హైదరాబాద్ విస్తరించింది. సాగు నీటికి ఇబ్బంది లేదని రైతుల్లో విశ్వాసం కల్పించిన తర్వాతే సుంకిశాల ప్రారంభించాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాం. రాబోయే 50 ఏళ్లలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా శరవేగంగా నిర్మాణం చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి విషయం లేదు. మున్సిపల్ శాఖలో పాలన పడకేసింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment