రాజారామేశ్వర్‌రావు సరళాసాగర్ ప్రాజెక్టు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం
పది గ్రామాల సాగునీటి కోసం..అప్పట్లోనే రూ.35 లక్షల వ్యయం
1947లో పనులు ప్రారంభం.. 1959లో వినియోగంలోకి..
పది గ్రామాల్లో పంట సిరుల కోసం సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలనుకున్నారు. అనుకున్నదే తడవు అమెరికాకు చెందినఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. స్వాతం్రత్యానికి ముందు మొదలై.. స్వాతం్రత్యానంతరం ప్రారంభమైన ఆ సాగునీటి ప్రాజెక్టు వయసు ఏడున్నర దశాబ్దాలు.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలో సంస్థానాదీశుల కాలంలో అప్పట్లో రూ.35 లక్షలతో నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టు విశేషాలివి. – వనపర్తి
వనపర్తి సంస్థానాదీశుడి ఆలోచనే..
స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన.. అప్పటి వనపర్తి సంస్థానా«దీశుడు రాజారామేశ్వర్‌రావుకు వచ్చింది. తన తల్లి సరళాదేవి పేరుపై ప్రత్యేకంగా నిర్మించేందుకు ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు.
అనధికారికంగా 1947 జూలై 10న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. స్వాతం్రత్యానంతరం అప్పటి మిలిటరీ గవర్నర్ జేఎన్ చౌదరి 1949 సెపె్టంబర్ 15న తిరిగి శంకుస్థాపన చేశారు. పదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అప్పట్లో రూ.35 లక్షలతో దీన్ని పూర్తి చేశారు. 1959 జూలై 26న అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి జేవీ రంగారావు ప్రాజెక్టును ప్రారంభించారు.
ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అంటే..
ప్రాజెక్టులోని నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోగానే సైఫన్లు వాటంతటవే తెరుచుకుంటాయి. అప్పట్లో ఈ పరిజ్ఞానంతో ఆసియాలోనే నిర్మించిన మొదటి ప్రాజెక్టు కాగా.. ప్రపంచంలో రెండోది కావడం విశేషం. 17 వుడ్ సైఫన్లు, 4 ప్రీమింగ్ సైఫన్లతో 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్‌ను నిర్మించారు.
ఒక్కొక్క సైఫన్ నుంచి 520 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. మట్టికట్ట పొడవు 3,537 అడుగులు, రాతికట్ట పొడవు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 అడుగులు. నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడికాల్వ 8 కిలోమీటర్లు, ఎడమ కాల్వ 20 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి. ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న కట్ట ఇప్పటికి రెండుసార్లు తెగిపోయింది. 1964లో మొదటిసారి, 2019 డిసెంబర్ 31వ తేదీన రెండోసారి కట్టకు గండిపడింది.
ముంపు సమస్య పరిష్కారానికే..
వర్షం నీరు ఊకచెట్టు వాగులో నుంచి వృథాగా కృష్ణానదిలో కలిసిపోవటం.. ఈ వాగు సమీపంలోని గ్రామాలు తరచూ వరద ముంపునకు గురయ్యేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు సరళాసాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వనపర్తి సంస్థానం అధీనంలోని పది గ్రామాల్లోని సుమారు 4,182 ఎకరాలకు సాగునీరందించేలా 0.5 టీఎంసీ సామర్థ్యంతో సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించారు.
ఈ ప్రాజెక్టు సాగునీరందే గ్రామాలు ప్రస్తుతం మదనాపురం మండల పరిధిలో ఉన్నాయి. ఎడమ కాల్వ పరిధిలో శంకరంపేట, దంతనూరు, మదనాపురం, తిరుమలాయపల్లి, వడ్డెవాట, చర్లపల్లి, రామన్‌పాడు, అజ్జకోలు, కుడికాల్వ పరిధిలో నెల్విడి నర్సింగాపూర్ గ్రామాలున్నాయి. కాగా.. సరళాసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది.
కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇటీవల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి సరళాసాగర్‌ను సందర్శించినా.. ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడం గమనార్హం.
మరమ్మతులకు ప్రతిపాదనలు
ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టుకు అక్కడక్కడా ఏర్పడిన నెర్రెలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇందుకోసం నిపుణులైన ఇంజనీర్లను రప్పించి.. ఆధునిక పద్ధతిలో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూపరింటెండింగ్ ఇంజనీరు ఆదేశించారు. ఈ మేరకు సరళాసాగర్‌ను సందర్శించనున్నాం. – రనీల్‌రెడ్డి, ఇంజనీర్, నీటి పారుదలశాఖ
Comments
Please login to add a commentAdd a comment