
ఇన్ఫోసిస్ బైబ్యాక్ ఆఫర్@ రూ.1,150
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బోర్డు రూ. 13,000 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.
11.3 కోట్ల షేర్ల కొనుగోలు ప్రతిపాదన
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బోర్డు రూ. 13,000 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. షేరుకి రూ. 1,150 చొప్పున ధర నిర్ణయించింది. శుక్రవారం షేరు ముగింపు ధర రూ. 923.10తో పోలిస్తే ఇది సుమారు 25 శాతం అధికం. ప్రతిపాదన ప్రకారం 11.3 కోట్ల షేర్లను ఇన్ఫోసిస్ తిరిగి కొనుగోలు చేయనుంది. ఇన్ఫీ బైబ్యాక్ ప్రకటించడం ఇదే ప్రథమం.
పోటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఏప్రిల్‌లో రూ. 16,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇన్ఫోసిస్ షేర్ బైబ్యాక్ రెండోది కానుంది. మొత్తం పెయిడప్ ఈక్విటీ క్యాపిటల్‌లో దీని పరిమాణం 4.9 శాతం మేర ఉంటుంది. బైబ్యాక్ ఆఫర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఇన్ఫోసిస్ 7 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో కో–చైర్మన్ వెంకటేశన్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సిక్కా, తాత్కాలిక సీఈవో యూబీ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామా తదితర పరిణామాల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌పై అమెరికాలోని న్యాయవాద సంస్థలు దృష్టి సారించాయి.కంపెనీ డైరెక్టర్లు, అధికారులు.. అమెరికా చట్టాలను ఉల్లంఘించడం వల్ల స్థానిక ఇన్వెస్టర్లకు నష్టం జరిగిందా అన్న కోణంలో విచారణ ప్రారంభించాయి. ఇన్వెస్టర్లకు నష్టం జరిగి ఉంటే వారి తరఫున కంపెనీపై దావా వేసేందుకు సిద్ధమవుతున్నాయి. బ్రోన్‌స్టెయిన్, గెవిట్జ్ అండ్ గ్రాస్‌మాన్, రోజెన్ లా ఫర్మ్, పొమెరాంట్జ్ లా ఫర్మ్, గోల్డ్‌బర్గ్ లా పీసీ సంస్థలు ఇందులో ఉన్నాయి.