
యాక్సిస్ బ్యాంక్ విదేశీ వాటా ఇక 74 శాతానికి..!
యాక్సిస్ బ్యాంక్ విదేశీ వాటా పెంపు ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. యాక్సిస్ బ్యాంక్‌లో విదేశీ వాటాను ప్రస్తుతమున్న 62 శాతం
♦ పరిమితి పెంచేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
♦ రూ.12,973 కోట్ల విదేశీ నిధులు వస్తాయి
♦ మూడేళ్లలో 7,000 వరకూ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంక్ విదేశీ వాటా పెంపు ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. యాక్సిస్ బ్యాంక్‌లో విదేశీ వాటాను ప్రస్తుతమున్న 62 శాతం నుంచి 74 శాతానికి పెంచుకోవాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం లభించిందని టెలికం మంత్రి రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్-సీసీఈఏ) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలి పిందని వివరించారు. ఈ ఆమోదం కారణంగా భారత్‌లోకి రూ.12,973 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాయని, మూడేళ్లలో 7,000 వరకూ కొత్త ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు/విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు/ప్రవాస భారతీయులు.. ఈ విదేశీ పెట్టుబడులను పెట్టవచ్చని వివరించారు.
విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలపై నిర్ణయాన్ని సాధారణంగా ఎఫ్‌ఐపీబీ (ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్) తీసుకుంటుంది. అయితే రూ.5,000 కోట్లకు మించిన ప్రతిపాదనలను సీసీఈఏకు నివేదిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ ప్రతిపాదన రూ.5,000 కోట్లను మించడంతో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన గల ఎఫ్‌ఐపీబీ ఈ ప్రతిపాదనను సీసీఈఏ పరిశీలనకు పంపింది. తాజాగా సీసీఈఏ విదేశీ వాటా పెంపు నిర్ణయాన్ని ఆమోదించింది. యాక్సిస్ బ్యాంక్ 1994 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ బ్యాంక్‌ను యూటీఐ, ఎల్‌ఐసీ, జీఐసీ, వీటి అనుబంధ సంస్థలు ప్రమోట్ చేస్తున్నాయి. కాగా మంగళవారం యాక్సిస్ బ్యాంక్ షేర్ బీఎస్‌ఈలో 0.8% క్షీణించి రూ.540 వద్ద ముగిసింది.