
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే విషయంపై భారీ ఆసక్తి నెలకొంది. ఎపుడెపుడా అని ప్రజలంతా ఎదురు చూస్తున్న సమయంలో సీరంకు యూకే డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదం కీలకంగా మారనుంది. యూకే, బ్రెజిల్ దేశాల్లోని కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్, ఆమోదం లాంటి అంశాలను భారత ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న సీరంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఇండియాలో కూడా అత్యవసర వినియోగానికి అనుమతి పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రిస్‌మస్‌కు ముందే దేశీయంగా కూడా అనుమతి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. (కోవిడ్-19 వ్యాక్సిన్ల రవాణాకు స్పైస్‌జెట్)
తాజా నివేదికల ప్రకారం మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఎ)ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫలితాలను, సామర్ధ్యాన్ని, మోతాదులను అంచనా వేస్తోంది. దీంతో క్రిస్‌మస్‌కు ముందే ఎంహెచ్‌ఆర్‌ఎ ఆమోదం వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత వెంటనే దేశీయంగా కూడా అనుమతి లభించనుందని రెగ్యులేటరీ వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. భారతదేశంలో అత్యవసర వినియోగ అధికారానికి సంబంధించిన సీరం అభ్యర్థనను ఆమోదించేందుకు యూఏ రెగ్యులేటరీ ఆమోదం చాలా కీలకమని ఒక అధికారి తెలిపారు. యూకే బ్రెజిల్‌లో జరుగుతున్న ట్రయల్స్ ఆధారంగా ప్రతిపాదన ఉంటుందనీ, అంతేకాకుండా, టీకా ఇంకా ఏ దేశంలోనూ ఆమోదించబడలేదు. ఇది సున్నితమైన విషయమన్నారు. టీకా భద్రత, సమర్థత ,రోగనిరోధక శక్తిపై తమకు ఖచ్చితంగా తెలిస్తేనే, అనుమతి ఇవ్వగలమని అధికారి పేర్కొన్నారు. మరోవైపు కరోనావైరస్ వ్యాక్సిన్లను పరిశీలించే ప్రభుత్వ ప్యానెల్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్‌ఇసి) దేశంలో 2, 3 దశల మానవ క్లినికల్ ట్రయల్స్ అప్‌డేటెడ్ సేఫ్టీ డేటాతో పాటు యుకెలో ట్రయల్ ఇమ్యూనోజెనిసిటీ డేటాను కూడా సమర్పించాలని సీరంను కోరింది. భారతదేశంలో అత్యవసర వినియోగ ప్రామాణీకరణ ఆమోదం పొందాలంటే ఎంహెచ్‌ఆర్‌ఎ ఆమోదానికి సంబంధించిన వివరాలను సీరం సంస్థ తప్పనిసరిగా అందించాలని ప్యానెల్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment