
సాక్షి, అమరావతి: తెలంగాణ శాసనసభకు డిసెంబర్ 7వ తేదీన జరగనున్న పోలింగ్‌లో ఓటు వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఆ రోజును ప్రత్యేక సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ సచివాలయంలోనూ, శాఖాధిపతుల కార్యాలయాల్లో 15 వేల మంది వరకు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలు హైదరాబాద్‌లోనే నివసిస్తున్నాయి.
అక్కడ వారికి ఓటు ఉన్నందున ఏపీ ప్రభుత్వం 7వ తేదీన తెలంగాణ శాసనసభకు జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించింది. అయితే తెలంగాణలో ఓటు హక్కు ఉన్నట్లు ఓటర్ గుర్తింపు కార్డు చూపించాలని షరతు విధించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు.