న్యూఢిల్లీ: రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అధీకృత వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా.. దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పించే ‘ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్, 2020’కి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్(వన్ నేషన్..వన్ అగ్రి మార్కెట్)’ దిశగా వేసిన ముందడుగుగా ఈ నిర్ణయాన్ని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. మార్కెట్లకు వెలుపల తమ దిగుబడులను అమ్మితే రైతులపై రాష్ట్రాలు ఎలాంటి పన్ను విధించవద్దు.
రైతులు తాము కోరుకున్న ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ విషయంలో తలెత్తిన వివాదాలను సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, కలెక్టర్ నెల రోజుల్లోగా పరిష్కరించాలి. ఈ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి రావు. ప్రస్తుతం రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ– ఏపీఎంసీ)ల్లోనే తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఈ మార్కెట్లకు వెలుపల అమ్మాలనుకుంటే వారిపై పలు ఆంక్షలు ఉంటాయి.
కేబినెట్ నిర్ణయాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడిస్తూ.. ఏపీఎంసీలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రాల ఏపీఎంసీ చట్టాలు కూడా కొనసాగుతాయన్నారు. మండీలకు వెలుపల కూడా రైతులు తమ ఉత్పత్తులను అమ్మే అవకాశం కల్పించి, వారికి అదనపు ఆదాయం అందించాలన్నదే ఈ ఆర్డినెన్స్ ఉద్దేశమన్నారు. ‘ఈ ఆర్డినెన్స్ ద్వారా రైతులు నేరుగా తమ ఇళ్ల నుంచే ఆహార సంస్థలకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, రైతు సహకార సంస్థలకు తాము కోరుకున్న ధరకు తమ పంటలను అమ్మవచ్చు’ అని వివరించారు. దీనిపై ఎలాంటి నియంత్రణలు ఉండబోవన్నారు. ‘ఈ – ట్రేడింగ్’కు కూడా అవకాశం ఉందన్నారు.
వీటిపై నియంత్రణ ఉండదు
65 ఏళ్ల నాటి నిత్యావసర వస్తువుల(ఎసెన్షియల్ కమాడిటీస్– ఈసీ) చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ చట్ట నియంత్రణ పరిధిలో నుంచి నిత్యావసరాలైన పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, వంట నూనెలు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలను తప్పించేందుకు ఆ సవరణను ప్రతిపాదించారు. ప్రతిపాదిత చట్ట సవరణ ప్రకారం.. యుద్ధం, జాతీయ విపత్తు, కరువు, ధరల్లో అనూహ్య పెరుగుదల వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆయా ఆహార పదార్థాలు ఈసీ చట్ట నియంత్రణలో ఉంటాయి.
మిగతా సమయాల్లో వాటి ఉత్పత్తి, నిల్వ, సరఫరాలపై ఎలాంటి నియంత్రణ ఉండదు. అలాగే, ప్రాసెసింగ్ చేసేవారు, సరఫరా వ్యవస్థలో ఉన్నవారిపై ఆయా ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి నిల్వ పరిమితి ఉండదు. రైతుల ఆదాయ పెంపు నిర్ణయాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆహార ఉత్పత్తులను దిగుబడి చేసుకునే, నిలువ చేసుకునే, పంపిణీ చేసుకునే హక్కు లభించడంతో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రైవేట్ సంస్థలకు ఆసక్తి పెరిగే అవకాశముందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా వస్తాయని పేర్కొంది.
కోల్‌కతా పోర్ట్ ఇక శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయం
కోల్‌కతా నౌకాశ్రయం పేరును శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలో కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. కోల్‌కతా నౌకాశ్రయానికి జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ పేరు పెడ్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఫిబ్రవరి 25న భేటీ అయి పేరు మార్పును ప్రతిపాదిస్తూ ఒక తీర్మనాన్ని ఆమోదించారు. కోల్‌కతా పోర్ట్ భారత్‌లోని ఏకైక నదీముఖ నౌకాశ్రయం. 1870 నుంచి కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది.
రైతులకు మేలు: మోదీ
వ్యవసాయ సంస్కరణలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు గ్రామీణ భారతం, ముఖ్యంగా రైతులపై గణనీయ సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ఆంక్షలను తొలగించాలని రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారని, ఆ డిమాండ్‌ను తాము నెరవేర్చామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment