One Nation
-
బంగారం ఎక్కడ కొన్నా ఒకే రేటు..
దేశ వ్యాప్తంగా ఒకే బంగారం ధర లక్ష్యంతో ‘వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్’ విధానం అమలుకు కృషి చేస్తున్నట్లు అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) ప్రకటించింది. ‘‘మేము ఒకే ధర వద్ద బంగారం దిగుమతి చేసుకుంటాము, కానీ దేశీయ రిటైల్ ధరలు ఒక నగరం నుండి మరొక నగరానికి భిన్నంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఒకే రేటు కొనసాగాలని మేము కోరుకుంటున్నాము’’ అని జీజేసీ సెక్రటరీ మితేష్ ధోర్డా పేర్కొన్నారు.మండలి సభ్యులతో ఇప్పటికే ఈ విషయంపై 50కుపైగా సమావేశాలను నిర్వహించడం జరిగిందని, తమ ప్రతిపాదనకు ఇప్పటికే దాదాపు 8,000 జ్యూవెలర్స్ సూత్రప్రాయ ఆమోదం తెలిపారని వివరించారు. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్న వార్షిక గోల్డ్ ఫెస్టివల్ ‘లక్కీ లక్ష్మీ’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.ఈ లక్కీ లక్ష్మీ ఉత్సవంలో 1,500 మంది రిటైలర్లు అలాగే 9 వరకూ చైన్ స్టోర్స్ పాల్గొననున్నాయి. కొనుగోళ్లకు సంబంధించి రూ. 10 కోట్ల విలువైన బహుమతులను అందజేయడం జరుగుతుంది. బంగారంపై రూ. 25,000 కంటే ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్లు పండుగ కాలంలో ఖచ్చితమైన బహుమతులు అందుకుంటారు. బాలీవుడ్ నటి ముగ్దా గాడ్సే సీనియర్ జీజేసీ సభ్యులతో కలిసి ఈ ఉత్సమ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. -
కేంద్రంపై ‘సుప్రీం’ ఆగ్రహం.. రూ.2లక్షల జరిమానా..!
ఢిల్లీ : పెన్షన్ల జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలు చేయకపోవడపై కేంద్రంపై సీరియస్ అయ్యింది.భారత సైన్యంలో రీటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు చెల్లించే కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వన్‌ర్యాంక్ వన్ పెన్షన్ చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రక్రియలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని మండిపడింది.ఈ క్రమంలో కేంద్రానికి రెండు లక్షలు జరిమానా విధించింది. ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చిన సుప్రీం కోర్టు నవంబర్ 14లోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. లేదంటే పెన్షన్ పెంపుపై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది సుప్రీం కోర్టు. పెన్షన్ విషయంలో దాఖలైన పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. -
అయిననూ.. కట్టవలే..!
సాక్షి, విశాఖపట్నం: ఒకే దేశం.. ఒకే రిజిస్ట్రేషన్ (వన్ నేషన్.. వన్ రిజిస్ట్రేషన్) విధానంతో కేంద్ర ప్రభుత్వం గతంలో బీహెచ్ రిజిస్ట్రేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీహెచ్ (భారత్) సిరీస్‌తో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వాహనాలు దేశంలో ఎక్కడైనా తిరగొచ్చన్న భావన పలువురిలో ఏర్పడింది. కేవలం కేంద్ర ప్రభుత్వం/ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు/నాలుగు అంతకు మించి ఎక్కువ రాష్ట్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేటు కంపెనీల ఉద్యోగుల వాహనాలకు మాత్రమే బీహెచ్ రిజిస్ట్రేషన్ వెసులుబాటు కల్పించారు. వీరు తాము పనిచేసే ప్రదేశం ఉన్న రాష్ట్రంలో లేదా శాశ్వత చిరునామా కలిగిన రాష్ట్రం, ఈ రెండింటిలో ఏ ప్రదేశంలో వాహనాన్ని ఉపయోగించాలనుకుంటారో ఆ రాష్ట్రంలో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని, సంబంధిత రాష్ట్ర మోటారు వాహన పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులు ఈ బీహెచ్ రిజిస్ట్రేషన్ సిరీస్‌కు అర్హులు కాదు. అయితే కొంతమంది వ్యాపారులు, ఇతర ఉద్యోగులు స్థానికంగా ఉంటూ ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నట్టు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి తమ వాహనాలకు బీహెచ్ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన మోటారు వాహనాల పన్ను ఎగవేయవచ్చన్న ఉద్దేశంతో వీరు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. కొంతమంది వాహన డీలర్లు ఇలా అడ్డదారుల్లో బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడంలో కీలకపాత్ర పోషించారు. నిబంధనల ప్రకారం ఈ సిరీస్ రిజిస్ట్రేషను నంబరు కలిగిన వాహనాలు ఆ రాష్ట్రంలోనే తిరిగేందుకు అనుమతి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో తిరగాలంటే సంబంధిత రాష్ట్రానికి పన్ను చెల్లించాలి. కానీ కొంతమంది వాహనదారులు అరుణాచల్‌ప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో బీహెచ్ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఆంధ్రప్రదేశ్‌కు పన్ను చెల్లించకుండా మన రాష్ట్రంలోనూ తిరుగుతున్నట్టు రవాణా శాఖ అధికారులు కొన్నాళ్ల క్రితం గుర్తించారు. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 400 వరకు ఇలాంటి వాహనాలున్నట్టు అంచనాకొచ్చారు. వీటిలో 80 శాతం నేవీ, 10 శాతం కేంద్ర ప్రభుత్వం/ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వాహనాలు కాగా 10 శాతం వాహనాలు అడ్డదారుల్లో బీహెచ్ రిజిస్ట్రేషన్లు చేయించినవి ఉన్నాయి. రాష్ట్రానికి మోటారు వాహన పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనదారులకు రవాణా శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇలా ఇప్పటివరకు వీరిలో 35 మంది రూ.కోటి వరకు పన్ను చెల్లించారు.లేదంటే ఏపీ రిజిస్ట్రేషనే..ఇతర రాష్ట్రాల్లో బీహెచ్ రిజిస్ట్రేషన్లు చేయించుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వాహన పన్ను చెల్లించకుండా విశాఖలో తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేస్తామని రవాణా శాఖ ఉప కమిషనర్ జీసీ రాజారత్నం ‘సాక్షి’కి తెలిపారు. అంతేకాదు.. అలాంటి వాహనాలను సీజ్ చేసి వారి నుంచి పన్ను రికవరీకి చర్యలు చేపడతామన్నారు. లేనిపక్షంలో ఆ వాహనదారులు బీహెచ్ రిజిస్ట్రేషన్‌కు బదులు ఏపీ రిజిస్ట్రేషన్ మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా అడ్డదారుల్లో బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్లు చేయించిన 14 మంది వాహన డీలర్ల ఆథరైజేషన్‌ను సస్పెండ్ చేశామని చెప్పారు. -
ఒకే దేశం ఒకే వేదిక
ముంబై/న్యూఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభల ప్రొసీడింగ్స్‌ను ఒకే వేదిక మీదకు తెచ్చే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతు న్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ముంబైలో శనివారం 84వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభల కార్యకలాపాలను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం త్వరలో సఫలమవనుంది. వన్ నేషన్ వన్ లెజిస్లేటివ్ ప్లాట్‌ఫామ్‌కు ఇది బాటలు వేస్తోంది’’ అని చెప్పారు. శాసనసభ్యుల ప్రవర్తన బట్టే ఆ శాసనసభ ప్రతిష్ట ఇనుమడిస్తుందని మోదీ అన్నారు. ‘‘గతంలో సభాహక్కులను ఉల్లంఘించే సభ్యులను సీనియర్ సభ్యులు మందలించేవారు. ఇప్పుడా పరిస్థితే లేదు. తమ సభ్యులు ఎంతటి ఉల్లంఘనలకు పాల్పడినా పార్టీలు వెనకేసుకొస్తున్నాయి. ఈ సంస్కృతి మంచిది కాదు’’ అన్నారు. ‘‘ గతంలో సభ్యునిపై అవినీతి ఆరోపణలు వస్తే సమా జంలో ఆ సభ్యుడు బహిష్కరణకు గురైనట్లే. ఆ సంస్కృతిని ఇప్పుడు గాలికొదిలేశారు. అవినీతి సభ్యులకు పాపులారిటీ పెరుగుతోంది’’ అన్నారు. యువత చేతుల్లోనే అభివృద్ధి చెందిన భారత్ రూపుదిద్దుకోనుందని మోదీ అన్నారు. శనివారం ఢిల్లీలో ఎన్సీసీ–పీఎం ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘‘అమ్మాయిలను సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేసేవారు. వారికి అన్ని మేం రంగాల్లో ద్వారాలు తెరవడంతో తమదైన ముద్ర వేస్తున్నారు. గణతంత్ర వేడుకల్లో నారీశక్తి ప్రస్ఫుటంగా కనిపించింది’’ అన్నారు. -
‘వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్’ నినాదంతో ముందుకు..
శామీర్‌పేట్: వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా, శామీర్‌పేటలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి కిసాన్ సంవృద్ధి కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని, రైతులతో కలిసి పీఎం నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... రైతుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రధాని గురువారం దేశవ్యాప్తంగా 1.25 లక్షల పీఎంకేఎస్కే (ప్రధాన మంత్రి కిసాన్ సంవృద్ది కేంద్రం) లను జాతికి అంకితం చేశారన్నారు. ఈ కేంద్రాల్లో వ్యవసాయానికి అవసరమైన ప్రతీ పనిముట్టు, విత్తనాలు, భూసార పరీక్షలు, ఎరువులు లభ్యమవుతాయని, అద్దెకు డ్రోన్ స్ప్రేలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పీఎంకేఎస్కే సిబ్బందికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలతో శిక్షణ ఇప్పించి, తద్వారా రైతులకు అవగాహన కల్పిస్తామని ఆయన వెల్లడించారు. గ్రోమోర్ ప్రవేశపెట్టిన డీఏపీ నానో ఒక లీటర్ బాటిల్.. ఒక బస్తా డీఏపీతో సమానమని, దీన్ని రైతులు సది్వనియోగం చేసుకోవాలని సూచించారు. బీమా ఉంటే పరిహారం అందేది... తెలంగాణలో అధికారంలోకి రాగానే ప్రగతిభవన్ ను ప్రజాప్రగతి భవన్‌గా మారుస్తామని కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారని, రాష్ట్రంలో బీమా పథకం అమల్లో ఉండి ఉంటే రైతులకు పరిహారం అందేదని చెప్పారు. ఫామ్‌హౌజ్‌లో, ప్రగతి భవన్లో పాలన సాగించే ముఖ్యమంత్రికి రైతుల గోసలు ఎలా తెలుస్తాయని, ప్రధానమంత్రి పంట బీమా పథకాన్ని రా ష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీ శా రు. ధరణి పోర్టల్ ద్వారా లేని సమస్యలను సృష్టించి, రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని, కల్వకుంట్ల కుటుంబం అంటేనే తడి గుడ్డ తో గొంతుకోసే వారని తీవ్ర అసహనం వ్యక్తం చేశా రు. అనంతరం ఉత్తమ రైతులను సన్మానించారు. అరెస్టులకు భయపడేది లేదు గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ నయా నిజాం తరహాలో ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఇటీవల చోటుచేసుసుకున్న ఘటనలో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ నేత మనోహర్ యాదవ్, బీఆర్ఎస్ కౌన్సిలర్ గంగిశెట్టి చందన భర్త రవీందర్లను ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి గురువారం పరామర్శించారు. కేసులకు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కాగా పరామర్శ సందర్భంలో కిషన్‌రెడ్డి.. రవీందర్‌పై కాషాయ కండువా కప్పడానికి ప్రయతి్నంచగా ఆయన సున్నితంగా వారించారు. -
ఒకే దేశం, ఒకే చట్టం... సాధ్యమయ్యేనా?
ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్–యూసీసీ) మరోసారి తెరపైకి వచ్చింది. ఒకే దేశం ఒకే చట్టం ఎజెండాతో గతంలో ఉత్తరాఖండ్ ఎన్నికలప్పుడు యూసీసీ అమలుకు బీజేపీ సర్కారు కమిటీ వేయడం తెలిసిందే. తాజాగా గుజరాత్ కూడా అదే బాట పట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇలా వరసగా యూసీసీ అమలుకు సై అంటూ ఉండడంపై చర్చ మొదలైంది. విభిన్న పరిస్థితులున్న దేశంలో ఒకే చట్టం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి... కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలు లేకుండా దేశ పౌరులందరికీ ఒకే విధమైన చట్టాలను అమలు చేయడమే ఉమ్మడి పౌరస్మృతి. ఇది అమల్లోకి వస్తే పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వ హక్కులు, జనన మరణాలు, దత్తత ప్రక్రియకు సంబంధించి పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. పౌరులందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని, అప్పుడే సమానత్వ హోదా దక్కుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా చెబుతోంది. హిందూత్వ ఎజెండాతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఉమ్మడి పౌరస్మృతిని ఎన్నడో తన మేనిఫెస్టోలో చేర్చింది. తన రాజకీయ ఎజెండాలో ఆగ్రభాగాన ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టింది. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను రద్దు చేసింది. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయకుండా ముందు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి మొదలు పెట్టే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీజేపీ పాలిత యూపీ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అనుమానాలూ లేకపోలేదు... అయితే యూసీసీపై హిందువుల్లోనే కాస్త వ్యతిరేకత వచ్చే ఆస్కారముందా అన్న అనుమానాలూ లేకపోలేదు. ‘‘భిన్న మతాలకు చెందిన వారికి వేర్వేరు లా బోర్డులున్నాయి. హిందూ మతానికి చెందినవారు కూడా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు ఆచారాలు పాటిస్తున్నారు. వాటన్నింటికీ ఏకరూపత ఎలా సాధ్యం?’’ అన్నది ఒక వాదన. కేవలం మెజార్టీ ఓటు బ్యాంకును ఏకమొత్తంగా కొల్లగొట్టేందుకేనని ఒక వర్గం ఆరోపిస్తోంది. ఇది బీజేపీ ఎన్నికల స్టంటని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలు అంటున్నారు. అందరికీ ఒకే చట్టాల్లేవా...? ప్రస్తుతం దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలకు వారి మత సంప్రదాయాలకు అనుగుణంగా వ్యక్తిగత చట్టాలున్నాయి. ముస్లింలకు షరియా చట్టాలకు అనుగుణంగా ముస్లిం పర్సనల్ లా అమలవుతోంది. దాని ప్రకారం ముస్లిం పురుషులకు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి ఉంది. వేరే మతస్తులకు మాత్రం చట్టప్రకారం ఒక్క భార్యే ఉండాలి. సివిల్ అంశాల్లో కాంట్రాక్ట్ చట్టం, సివిల్ ప్రొసీజర్ కోడ్ వంటి అనేకానేక ఉమ్మడి చట్టాలనూ పలు రాష్ట్రాల్లో భారీగా సవరించారు. గోవాలో 1867 నాటి కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉన్నా అక్కడా కేథలిక్కులకు, ఇతర మతాలకు భిన్నమైన నియమాలు పాటిస్తున్నారు. నాగాలాండ్, మిజోర, మేఘాలయాల్లోనైతే హిందూ చట్టాల్లో కూడా భిన్నత్వం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పోలీసులకు ఒకే యూనిఫాం
సూరజ్‌కుండ్ (హరియాణా): పోలీసులకు దేశవ్యాప్తంగా ఒకే యూనిఫాం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. ‘ఒక దేశం, ఒకే యూనిఫాం’ భావనపై ఆలోచించాలని రాష్ట్రాలకు సూచించారు. అయితే వాటిపై దీన్ని రుద్దబోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. పోలీసు బలగాలకు ఇది ఉమ్మడి గుర్తింపునిస్తుందన్నదే నా ఉద్దేశం. కావాలంటే యూనిఫాంపై రాష్ట్రాలవారీగా ప్రత్యేక గుర్తింపు చిహ్నాలు ఉండవచ్చు. ఇది వీలైతే ఇప్పుడు, లేదంటే ఐదేళ్లు, పదేళ్లు, వందేళ్లకు ఎప్పటికైనా సాధ్యపడొచ్చు’’ అని సూచించారు. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న రాష్ట్ర హోం మంత్రుల చింతన్ శిబిర్‌ను ఉద్దేశించి మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘గన్నులు, పెన్నులు... ఇలా నక్సలిజం ఏ రూపంలో ఉన్నా కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాల్సిందే. యువత మనసులను విషపూరితం చేసి వారిని తీవ్రవాదంవైపు మళ్లించకుండా నిరోధించాల్సిందే. అందుకోసం ఈ తీవ్రవాద శక్తుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి’’ అంటూ పిలుపునిచ్చారు. దేశ క్షేమం దృష్ట్యా ఈ శక్తులు విజృంభించకుండా చూడాల్సిన అవసరముందన్నారు. ‘‘పాత చట్టాలను సమీక్షించుకోండి. కాలం చెల్లిన వాటిని వదిలించుకోండి. మిగతా వాటిని ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మెరుగు పరుచుకోండి’’ అని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ‘‘శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమే అయినా సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో కూడిన ఉమ్మడి కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాలి. పౌరుల పరిరక్షణే అంతిమ లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు అన్ని అంశాల్లోనూ పరస్పరం సహకరించుకోవాలి’’ అని సూచించారు. నేరాల స్వభావం అంతర్రాష్ట్రీయ, అంతర్జాతీయ తరహాను సంతరించుకుంటున్నందున ఇది తప్పనిసరన్నారు. సైబర్ క్రైం, ఆయుధాలు, డ్రగ్స్ సరఫరాల్లో నేరగాళ్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నందున ఈ ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా వారికంటే ముందే ఉండాలన్నారు. ఫేక్ న్యూస్‌కు తెర పడాలి కొంతకాలంగా ఫేక్ న్యూస్ పెద్ద బెడదగా మారిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి తప్పుడు సమాచార వ్యాప్తిని తక్షణం అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. ఇది దేశానికే ముప్పుగా పరిణమించగలదన్నారు. ‘‘ఏ సమాచారాన్నయినా ఫార్వర్డ్ చేసే ముందు ప్రజలు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అందులోని నిజానిజాలను నిర్ధారించుకోవాలి. అందుకు వీలు కల్పించే వ్యవస్థలను వారికి చేరువ చేయడంలో టెక్నాలజీది కీలక పాత్ర’’ అని చెప్పారు. టెక్నాలజీపై వెచ్చించే మొత్తాన్ని మెరుగైన భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా చూడాలని అన్నారు. పర్యాటకం ప్రధాన ఆదాయ వనరుగా మారుతున్న నేపథ్యంలో పర్యాటక పోలిసింగ్పైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కోరారు. అవినీతిపరులను వదిలేది లేదు న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడితే వ్యక్తులనైనా, సంస్థలనైనా వదిలే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. అక్టోబర్ 31న మొదలవుతున్న విజిలెన్స్ వారోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన జాతికి సందేశమిచ్చారు. అవినీతి సామాన్యుల హక్కులను హరించడమే గాక దేశ ప్రగతిని కూడా కుంటుబరుస్తుందన్నారు. అవినీతిపై ఉమ్మడిగా పోరాడాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ కూడా పిలుపునిచ్చారు. మన ఉక్కు పరిశ్రమ శక్తికి ఐఎన్ఎస్ విక్రాంతే తార్కాణం సూరత్: భారత ఉక్కు పరిశ్రమ శక్తిసామర్థ్యాలకు, పనితనానికి తొలి దేశీయ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ చక్కని ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. ఎనిమిదేళ్ల సమష్టి కృషి ఫలితంగా భారత ఉక్కు పరిశ్రమ ప్రపంచంలో రెండో స్థానానికి ఎగబాకిందన్నారు. గుజరాత్‌లోని సూరత్ జిల్లా హజీరాలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా విస్తరణ ప్లాంటు భూమి పూజలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఉచితాలతో ఓటర్లను ఆధారపడేలా చేయొద్దు! -
జూలై 4 నుంచి రేషన్ డీలర్ల నిరసనబాట
సాక్షి, న్యూఢిల్లీ : రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్లు జాతీయ రేషన్ డీలర్ల ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్–వన్ కమీషన్’ విధానంలో ప్రతి క్వింటాల్‌కు కమీషన్‌ను రూ.250 నుంచి రూ.300కు పెంచాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం జూలై 4న మండల కేంద్రాల్లో, జూలై 11న జిల్లా కేంద్రాల్లో, జూలై 18న రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానుల్లో ఆందోళనలు నిర్వహించాలని తీర్మానించారు. ఆగస్ట్ 2న దేశవ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల మంది డీలర్లతో ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నట్లు రాజు పేర్కొన్నారు. (క్లిక్: జూన్ 26న జాతీయ లోక్ అదాలత్) -
కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఏకరీతిగా భూ రిజిస్ట్రేషన్..!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ 2022లో నూతన భూ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఒకే దేశం - ఒకే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 'ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్' సాఫ్ట్‌వేర్‌తో నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(NGDRS)తో ఏకీకరణను అమలులోకి తీసుకోవడం, డీడ్స్, డాక్యుమెంట్లను ఎక్కడైనా ఏకరీతిగా నమోదు చేయడానికి ప్రోత్సహించబడుతుంది. "మెరుగైన జీవన సౌలభ్యం కోసం, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి వీలుగా వన్ నేషన్ - వన్ రిజిస్ట్రేషన్ విధానం ఏర్పాటు చేయనున్నట్లు" సీతారామన్ తెలిపారు. అలాగే, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి 25,000 ఒప్పందాలు తొలగించామని, 1,486 యూనియన్ చట్టాలను కూడా రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. చెల్లింపులలో జాప్యాన్ని తగ్గించడానికి ఆన్ లైన్ బిల్లు చెల్లింపు వ్యవస్థ గురించి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలతో మాట్లాడినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, ఎంటర్ప్రైజ్, హబ్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొని రావాలని ఆమె తన బడ్జెట్ 2022 ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కొత్త చట్టం ఇప్పటికే ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను కవర్ చేస్తుందని, ఎగుమతులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది అని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. 'ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్' సాఫ్ట్‌వేర్‌తో నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌తో ఏకీకరణను అమలులోకి తీసుకోవడం, డీడ్స్, డాక్యుమెంట్లను ఎక్కడైనా ఏకరీతిగా నమోదు చేయడానికి ప్రోత్సహించబడుతుంది. - కేంద్రమంత్రి @nsitharaman #Budget2022 #AatmaNirbharBharatKaBudget pic.twitter.com/VbvRmJ8t71 — PIB in Telangana 🇮🇳#AmritMahotsav (@PIBHyderabad) February 1, 2022 (చదవండి: బడ్జెట్ 2022: పెరిగేవి..తగ్గేవి ఇవే..!) -
వలస కార్మికులకు భద్రత ఏది?
లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల దుఃస్థితిపై సంవత్సరం పైగా విచారించిన సుప్రీంకోర్టు జూన్ 28న తన తీర్పును వెలువరించింది. జాతీయ ఆహార పథకం కింద దేశంలో ఎక్కడినుంచైనా రేషన్ పొందడానికి వలసకార్మికులకు అనుమతించాలని, దీనికోసం ‘ఒకే దేశం, ఒకే రేషన్’ కార్డు పథకాన్ని అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. కానీ 2021 మే 6 నాటికి ఈ పథకం కింద 50 వేలమంది మాత్రమే లబ్ధి పొందారని వార్తలు. పైగా వలస కార్మికులకు రేషన్ ఇవ్వడానికి చాలా చోట్ల తిరస్కరించారని కూడా తేలింది. ప్రభుత్వాలు ప్రకటిస్తున్న కార్మిక సంక్షేమ పథకాలన్నీ...అసంఘటిత కార్మికులకు మేలు చేయడంలో విఫలమవుతున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం తన శక్తిని మొత్తంగా దీనిపై కేంద్రీకరిస్తే యావద్దేశం దానిగురించి ఘనంగా చెప్పుకుంటుంది. వలస కార్మికులకు ముష్టి అవసరం లేదు. వారు కోరుకుంటున్నదల్లా... సంఘటిత కార్మికుల్లాగే క్రమబద్ధమైన పని వాతావరణం, కాస్త ప్రాథమిక భద్రత మాత్రమే. వలస కార్మికుల కేసుగా అందరికీ తెలిసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తన తీర్పును తాజాగా వెలువరించింది. గతేడాది లాక్డౌన్ కాలంలో భారీవలసల సందర్భంగా వలస కార్మికుల దుఃస్థితిని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేసింది. సెకండ్ వేవ్ సమయంలోనూ దీనిపై విచారణ కొనసాగింది. జూన్ 28న ఉన్నత న్యాయస్థానం 7 పాయింట్లతో 80 పేజీల తీర్పును ప్రకటించింది. వీటిలో అయిదు అంశాలు–వలస కార్మికుల ఆహార భద్రతకు హామీ ఇవ్వడానికి సంబంధించినవి. వలస కార్మికులకు ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ఉదారంగా వ్యవహరించి రేషన్ కార్డు లేని వారికి కూడా ఆహారం అందించాలని, సబ్సిడీ ధాన్యం కేటాయింపును పెంచాలని కోర్టు తీర్పు ఆదేశించింది. జాతీయ ఆహార పథకం కింద దేశంలో ఎక్కడినుంచైనా రేషన్ పొందడానికి వలసకార్మికులకు అనుమతించాలని, దీనికోసం ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు పథకాన్ని అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. వీటిలో చివరి అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది సుదీర్ఘకాలంగా చేస్తూవస్తున్న డిమాండే. న్యాయస్థానం తన తీర్పును ప్రభుత్వ యంత్రాంగం ఎలా అమలుచేస్తుందనే అంశంపై నిశితంగా పర్యవేక్షించాలని ఎవరైనా కోరుకుంటారు. కాగా వన్ నేషన్, వన్ రేషన్ కార్డు అనే పథకాన్ని అమలు చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి న్యాయస్థానం హామీ తీసుకున్నట్లు కనిపిస్తోంది. గత సంవత్సరం కోవిడ్–19 ఫస్ట్ వేవ్ తర్వాత ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. 2020 జూన్ 6న తన ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే గత సంవత్సర కాలంలో ఈ పథకం కింద చాలా కొద్ది మాత్రమే లబ్ధి పొందారని ప్రభుత్వ డేటానే చూపిస్తోంది. 2021 మే 6 నాటికి ఈ పథకంలో భాగంగా 50 వేలమంది మాత్రమే లబ్ధి పొందారని ఇంటెగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నివేదించింది. ఈ పథకం కింద వలస కార్మికులకు రేషన్ ఇవ్వడానికి దేశంలో పలుచోట్ల తిరస్కరించిన ఉదంతాలెన్నో ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. లబ్ధిదారులకు ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. వలస కార్మికుల నమోదు వీటన్నింటిని పక్కనబెట్టి చూస్తే, వలస కార్మికులకు ఆహార భద్రతపై హామీ ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగినది. పైగా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు వలస కార్మికులు కాస్త ఎక్కువగానే కడుపు నింపుకుని సాధారణ పనులను నిర్వహించవచ్చు. ఇక తీర్పులోని చివరి రెండు అంశాలను ప్రాథమికంగా విమర్శించాల్సి ఉంది. ఈ రెండూ వలస కార్మికుల నమోదుకు సంబంధించినవి. ఇదే చాలా ముఖ్యమైనది.ఎలాంటి లక్ష్య బృందానికైనా ఈ పథకం లబ్ధి్ద కలిగించాలని ఎవరైనా భావిస్తే, ముందుగా ఈ లక్ష్య బృందంలోని అందరినీ గుర్తించాల్సి ఉంది. వలస కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఏయే ప్రాంతాల్లో ఉన్నారు అనే అంశంపై ప్రభుత్వానికి ఎలాంటి అవగాహన లేనందునే ఫస్ట్ వేవ్ కాలంలో వలస కార్మికులు భారీ స్థాయిలో వలస పోయారు. అందుకే వలస కార్మికుల నమోదు అంశంపై న్యాయస్థానం తీర్పు అధికంగా దృష్టి సారించింది. న్యాయస్థానం తన తీర్పును ఎలా ప్రకటించినప్పటికీ, ప్రభుత్వాలూ, పౌర సమాజ సంస్థలూ, సంబంధిత పిటిషన్‌తో పాక్షికంగా సంబంధంలో ఉండి కోర్టుకు సహకరించిన న్యాయవాదులూ మొత్తంగా క్షేత్ర వాస్తవికతను పూర్తిగా పట్టించుకోలేదనే చెప్పాలి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. తన తొలి తీర్పులో అసంఘటిత కార్మికుల గణన ప్రక్రియను ప్రారంభించడంలో కేంద్ర కార్మిక శాఖ విఫలమైందని దుయ్యబట్టింది. పైగా అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్(ఎన్‌డీయూడబ్ల్యూ)ని ఏర్పాటు చేయడానికి తుది గడువును కూడా నిర్ణయించింది. తర్వాత అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం (ఐఎస్ఎమ్డబ్ల్యూ యాక్ట్)ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేసినట్లయితే, అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ రూపంలో ప్రత్యేక నమోదు ప్రక్రియ అవసరమే ఉండదు. అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియకు సంబంధించిన గత చరిత్రను న్యాయస్థానం ఎత్తి చూపలేదు. ప్రస్తుత అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తన తొలి అయిదేళ్ల పాలనలో శ్రమయేవ జయతే పేరిట అసంఘటిత కార్మికులను భారీ స్థాయిలో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అసంఘటిత కార్మికులందరి సంఖ్యను గుర్తించి వారికి స్మార్ట్ కార్డులు జారీ చేయడమే దీని లక్ష్యం. అయితే ఈ పథకం వెనుకపట్టు పట్టడానికి ముందు కొంతమందికి కార్డులు జారీ చేశారు. కార్మికుల నమోదు నత్తనడకన సాగుతున్న నిర్మాణ కార్మికుల బోర్డుల నమోదు చరిత్రను కోర్టు పరిశీలించాల్సి ఉంది. అన్ని కార్మిక చట్టాలు ఆయా పనిస్థలాల్లో కార్మికుల పేర్లు నమోదు చేయాలని కోరుతున్నాయి. అయినప్పటికీ ఈ చట్టాల పరిధిలోనే పనికోసం ఒక చోటి నుంచి మరో చోటికి తరలి వెళ్లిపోయే వలస కార్మికులను నమోదు చేయడం జరగలేదు. సంక్షేమ పథకాల అమలు లోపం 1948 ఫ్యాక్టరీల చట్టం ద్వారా నిర్వహిస్తున్న పరిశ్రమలలో అనేకమంది వలస కార్మికులను గణనీయంగా నియమించుకున్నారు. ఈ శక్తిమంతమైన చట్టాన్ని పారిశ్రామిక భద్రత, ఆరోగ్య డైరెక్టరేట్ అమలు చేస్తోంది. కానీ వాస్తవానికి ఈ చట్టం కింద చాలా కొద్దిమంది కార్మికుల పేర్లను మాత్రమే నమోదు చేసింది. గుజరాత్‌లోని సూరత్ నగరం వేలాది మరమగ్గాలతో కూడిన అతిపెద్ద వస్త్రపరిశ్రమ కేంద్రాల్లో ఒకటి. ఇక్కడి పనిచేసేవారిలో మెజారిటీ ఒడిశా నుంచి వచ్చిన వలస కార్మికులే. కానీ ఈ నగరంలో ఉన్న పరిశ్రమ యూనిట్ల సంఖ్య ఎంత అని ఎవరైనా డైరెక్టరేట్‌ని అడిగితే సమాధానం శూన్యమే. నగరంలో ఎన్ని మరమగ్గాలు ఉన్నాయి అని తెలిపే కనీస డేటా కూడా దీనివద్ద లేదు. కోర్టు ఈ మొత్తం వ్యవహారంపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలను కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఈ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందుకోవడానికి అనేకమంది కార్మికులు వేచి చూస్తున్నారని తీర్పులోని 70వ పేజీలో న్యాయస్థానం పేర్కొంది. కానీ, ఇవన్నీ కూడా గుర్తింపులేని అసంఘటిత కార్మికులకు మేలు చేయడంలో విఫలమవుతున్నాయి. అందుకే వివిధ రాష్ట్రాల్లో ఉనికిలో ఉన్న అసంఖ్యాక కార్మిక సంక్షేమ పథకాల సంఖ్యను కుదించి ఒక నమూనా స్కీమ్‌ను రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.వాస్తవానికి గుజరాత్ ప్రభుత్వం ప్రకటించినట్లుగా అసంఘటిత రంగ కార్మికులకు 20 పథకాలు అవసరం లేదు. వారికి ప్రాథమిక భద్రత, పీఎఫ్, ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ వంటివి అవసరం. వీటిని పక్కనబెట్టి వివిధ బోర్డులలో కార్మికుల పేర్లను నమోదు చేసి వివిధ పథకాలను కేటాయించినా అవన్నీ ఆచరణలో విఫలమవుతాయి. దేశంలోని వలస కార్మికులకు ముష్టి అవసరం లేదు. వారు కోరుకుంటున్నదల్లా.. కార్మిక చట్టాలు అందించే క్రమబద్ధమైన పని వాతావరణం, ప్రాథమిక భద్రత మాత్రమే. సుప్రీంకోర్ట్ తన శక్తిని దీనిపై కేంద్రీకరిస్తే దేశం దేశమే దానిగురించి ఘనంగా చెప్పుకుంటుంది. సుధీర్ కటియార్ ‘సెంటర్ ఫర్ లేబర్ రీసెర్చ్ అండ్ యాక్షన్’ సభ్యులు. (‘ది వైర్’ సౌజన్యంతో) -
ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీకు 50 వేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకునే అవకాశం అందిస్తుంది. 50 వేల రూపాయలను గెలుచుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక పోటీని నిర్వహిస్తుంది. దీనిలో గెలచిన వారికి మొదటి బహుమతి కింద రూ.50 వేల అందజేస్తారు. ఇందులో పాల్గొనడానికి మీరు ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఇంటి నుంచే ఇందులో పాల్గొనవచ్చు. ఈ పోటీలో భాగంగా మీరు వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్ పథకం లోగోను తయారు చేయాలి. మీరు డిజైనింగ్‌లో నిపుణులైతే, లాక్డౌన్లో ఇది మీకు మంచి ఆదాయ వనరుగా మారుతుంది. దీనికి సంబంధించిన సమాచారం మై గోవ్ ఇండియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఇవ్వబడింది. ఇందుకోసం, మొదట మీరు భారత ప్రభుత్వ ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన లోగో డిజైన్ పోటీలో భాగం కావాలి. మీరు 31 మే 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోటీలో గెలిచిన మొదటి వ్యక్తికి 50 వేల రూపాయల నగదుతో పాటు ఈ-సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఇక మిగత ముగ్గురికి ఈ-సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. Put on your creative cap! Design a logo for the One Nation One Ration Card plan and stand a chance to win a cash prize of Rs.50,000. Visit: https://t.co/puosLH2Bqx today! @fooddeptgoi @UNWFP_India pic.twitter.com/RFbk0pW1ge — MyGovIndia (@mygovindia) April 29, 2021 ఈ పోటీలో పాల్గొనడానికి, మీరు మొదట myGov.in పోర్టల్‌కు వెళ్లాలి. ఇక్కడ మీరు పోటీకి వెళ్లి లాగిన్ టు పార్టిసిపేట్ టాబ్ పై క్లిక్ చేయాలి. దీని తరువాత, రిజిస్ట్రేషన్ వివరాలను నింపాలి. రిజిస్ట్రేషన్ తరువాత, మీరు మీ ఎంట్రీని సమర్పించాలి. లోగో డిజైన్ పోటీలో ఏ వయసు వారు అయినా పాల్గొనవచ్చు. పాల్గొనేవారు గరిష్టంగా మూడు ఎంట్రీలను నమోదు చేయవచ్చు. లోగో ఫార్మాట్ JPEG, BMP లేదా TIFFలో అధిక రిజల్యూషన్ (600 dpi) చిత్రంగా ఉండాలి. లోగో గురించి 100 పదాలలో సమాచారం కలిగి ఉండటం చాలా ముఖ్యం. చదవండి: మరో కీలక ప్రాజెక్టుకు రిలయన్స్ జియో శ్రీకారం -
వాక్సిన్‌కి వన్ నేషన్ రెండు ధరలా?: కేటీఆర్
-
రేషన్ కోసం ప్రత్యేక యాప్ లాంచ్ చేసిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం రేషన్ వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక యాప్‌ను "మేరా రేషన్" అనే పేరుతో లాంచ్ చేసింది. దేశంలో ‘వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్’ పథకం కోసం ఈ యాప్‌ను లాంచ్ చేశారు. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. రేషన్ కార్డు గలవారు కొత్త ఇంటికి మారిన లేదా ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నప్పుడు దగ్గరలోని రేషన్ కేంద్రాలను ఈ యాప్ సహాయంతో గుర్తించవచ్చు. మొత్తం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పోర్టబులిటీని ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లిన అక్కడ కూడా రేషన్ పొందవచ్చు. ఈ యాప్ ద్వారా దగ్గరలోని రేషన్ కేంద్రాలలో రేషన్ తీసుకోవడానికి తమకు అర్హత ఉందా లేదా అనే విషయంతో పాటు, ఇప్పటిదాకా తీసుకున్న రేషన్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. దీన్ని జాతీయ సమాచార కేంద్రం(ఎన్ఐసీ) రూపొందించింది. ప్రస్తుతానికి ఈ యాప్ ఇంగ్లిష్, హిందీల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో దీన్ని 14 వేర్వేరు భాషల్లో అందించనున్నారు. వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పథకానికి మీరు అర్హులో కాదో తెలుసుకోవడానికి కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది. దాని కోసం Eligibility Criteriaను ఎంచుకుని కావాల్సిన సమాచారాన్ని ఇవ్వాలి. ఒక్కసారి రిజిస్టర్ చేసుకున్నాక మీరు అర్హులైతే మీకు ఆహారధాన్యాలను కేటాయిస్తారు. మీకు మంజూరైన ఆహార ధాన్యాలు, గత ఆరు నెలల్లో తీసుకున్న ఆహారధాన్యాల వివరాలు ఈ యాప్‌లో కనిపిస్తాయి. దీంతో రేషన్ కార్డు దారులు తమకు ఎంత ఆహారధాన్యాలు వచ్చాయో షాప్‌కి వెళ్లి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, యాప్‌లోనే చూసుకోవచ్చు. చదవండి: సామాన్యుల కోసం ఎల్ఐసీ సరికొత్త భీమా పాలసీ ఏప్రిల్ 1 నుంచి ఐటీలో ఐదు కొత్త నిబంధనలు -
ఇక ఎక్కడికెళ్లినా రేషన్ తిప్పలు ఉండవు!
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని అమలు చేసే ప్రణాళికలో మరో అడుగు ముందుకు పడింది. శుక్రవారం కేంద్రప్రభుత్వం మేరా రేషన్ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ యాప్ ఇంగ్లి్లష్, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. జీవనోపాధి కోసం కొత్త ప్రాంతాలకు వెళ్ళే రేషన్ కార్డ్ హోల్డర్లకు మేరా రేషన్ మొబైల్ యాప్ ప్రయోజనం చేకూరుస్తుందని ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ప్రకటించారు. ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో భాగస్వామ్యం అయ్యాయని ఆయన తెలిపారు. మిగిలిన నాలుగు రాష్ట్రాలైన అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అనుసంధానం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తవుతుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య మొత్తం 15.4 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు వన్ నేషన్ వన్ రేషన్ కింద జరిగాయని వివరించారు. 2019 ఆగస్టులో 4 రాష్ట్రాల్లో ప్రారంభించిన ఈ వ్యవస్థను 2020 డిసెంబర్ నాటికి తక్కువ వ్యవధిలో వేగంగా విస్తరించగలిగామని అన్నారు. ప్రస్తుతం వన్ నేషన్ వన్ రేషన్ వ్యవస్థలో దేశంలోని దాదాపు 69 కోట్ల ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రతీ నెల సగటున 1.5 –1.6 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు నమోదు అవుతున్నాయని పాండే తెలిపారు. -
ఒకే రేషన్ విధానం సక్సెస్.. కేంద్రం బహుమతి
సాక్షి, న్యూఢిల్లీ : వన్ నేషన్ వన్ రేషన్ కార్డు వ్యవస్థ అమలుచేస్తున్న తెలుగు రాష్ట్రాలు సంస్కరణలను విజయవంతంగా పూర్తి చేయడంతో అదనపు రుణాలు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సంస్కరణల కోసం నిర్దేశించిన షరతులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌లు నెరవేర్చాయని వివరించింది. ఈ నేపథ్యంలో ఈ 9 రాష్ట్రాలకు రూ.23,523 కోట్లు అదనపు రుణాలు ఇవ్వడానికి అనుమతించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,525 కోట్లు, తెలంగాణకు రూ.2,508 కోట్లు అదనంగా రుణాలు అందనున్నాయి. -
ఒకే దేశం.. ఒకే మార్కెట్
న్యూఢిల్లీ: రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అధీకృత వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా.. దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పించే ‘ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్, 2020’కి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్(వన్ నేషన్..వన్ అగ్రి మార్కెట్)’ దిశగా వేసిన ముందడుగుగా ఈ నిర్ణయాన్ని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. మార్కెట్లకు వెలుపల తమ దిగుబడులను అమ్మితే రైతులపై రాష్ట్రాలు ఎలాంటి పన్ను విధించవద్దు. రైతులు తాము కోరుకున్న ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ విషయంలో తలెత్తిన వివాదాలను సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, కలెక్టర్ నెల రోజుల్లోగా పరిష్కరించాలి. ఈ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి రావు. ప్రస్తుతం రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ– ఏపీఎంసీ)ల్లోనే తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఈ మార్కెట్లకు వెలుపల అమ్మాలనుకుంటే వారిపై పలు ఆంక్షలు ఉంటాయి. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడిస్తూ.. ఏపీఎంసీలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రాల ఏపీఎంసీ చట్టాలు కూడా కొనసాగుతాయన్నారు. మండీలకు వెలుపల కూడా రైతులు తమ ఉత్పత్తులను అమ్మే అవకాశం కల్పించి, వారికి అదనపు ఆదాయం అందించాలన్నదే ఈ ఆర్డినెన్స్ ఉద్దేశమన్నారు. ‘ఈ ఆర్డినెన్స్ ద్వారా రైతులు నేరుగా తమ ఇళ్ల నుంచే ఆహార సంస్థలకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, రైతు సహకార సంస్థలకు తాము కోరుకున్న ధరకు తమ పంటలను అమ్మవచ్చు’ అని వివరించారు. దీనిపై ఎలాంటి నియంత్రణలు ఉండబోవన్నారు. ‘ఈ – ట్రేడింగ్’కు కూడా అవకాశం ఉందన్నారు. వీటిపై నియంత్రణ ఉండదు 65 ఏళ్ల నాటి నిత్యావసర వస్తువుల(ఎసెన్షియల్ కమాడిటీస్– ఈసీ) చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ చట్ట నియంత్రణ పరిధిలో నుంచి నిత్యావసరాలైన పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, వంట నూనెలు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలను తప్పించేందుకు ఆ సవరణను ప్రతిపాదించారు. ప్రతిపాదిత చట్ట సవరణ ప్రకారం.. యుద్ధం, జాతీయ విపత్తు, కరువు, ధరల్లో అనూహ్య పెరుగుదల వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆయా ఆహార పదార్థాలు ఈసీ చట్ట నియంత్రణలో ఉంటాయి. మిగతా సమయాల్లో వాటి ఉత్పత్తి, నిల్వ, సరఫరాలపై ఎలాంటి నియంత్రణ ఉండదు. అలాగే, ప్రాసెసింగ్ చేసేవారు, సరఫరా వ్యవస్థలో ఉన్నవారిపై ఆయా ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి నిల్వ పరిమితి ఉండదు. రైతుల ఆదాయ పెంపు నిర్ణయాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆహార ఉత్పత్తులను దిగుబడి చేసుకునే, నిలువ చేసుకునే, పంపిణీ చేసుకునే హక్కు లభించడంతో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రైవేట్ సంస్థలకు ఆసక్తి పెరిగే అవకాశముందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా వస్తాయని పేర్కొంది. కోల్‌కతా పోర్ట్ ఇక శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయం కోల్‌కతా నౌకాశ్రయం పేరును శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలో కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. కోల్‌కతా నౌకాశ్రయానికి జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ పేరు పెడ్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఫిబ్రవరి 25న భేటీ అయి పేరు మార్పును ప్రతిపాదిస్తూ ఒక తీర్మనాన్ని ఆమోదించారు. కోల్‌కతా పోర్ట్ భారత్‌లోని ఏకైక నదీముఖ నౌకాశ్రయం. 1870 నుంచి కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. రైతులకు మేలు: మోదీ వ్యవసాయ సంస్కరణలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు గ్రామీణ భారతం, ముఖ్యంగా రైతులపై గణనీయ సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ఆంక్షలను తొలగించాలని రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారని, ఆ డిమాండ్‌ను తాము నెరవేర్చామని తెలిపారు. -
కొత్త రేషన్ కార్డుల దిశగా కేంద్రం అడుగు
న్యూఢిల్లీ: ‘వన్ నేషన్–వన్ రేషన్ కార్డు’దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశమంతటా ఒకే రేషన్ కార్డు ఉండేలా కార్డులకు ఒక ప్రామాణిక ఆకృతిని నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే సమయంలో వీటిని ప్రామాణికంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రేషన్ కార్డులపై రెండు భాషలు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. ఒకటి ప్రాంతీయ భాష కాగా.. మరొకటి హిందీ లేదా ఇంగ్లిష్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. -
జూన్ నుంచి ఒకే దేశం–ఒకే రేషన్
న్యూఢిల్లీ: వలస కార్మికులకు, దినసరి కూలీలకు ప్రయోజనకర పథకంగా భావిస్తున్న ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ పథకం వచ్చే జూన్ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం, అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ రేషన్ కార్డు ద్వారా దేశంలోని ఏదైనా చౌక ధరల దుకాణం(ఎఫ్‌పీఎస్) నుంచి తమ కోటా ఆహార ధాన్యాలను పొందగలుగుతారు. బయోమెట్రిక్ లేదా ఆధార్ ధ్రువీకరణ తర్వాత ఇది అందుబాటులోకి వస్తుందని ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. ‘ఉపాధి కోసం లేదా దేశవ్యాప్తంగా తమ నివాస చిరునామా మార్చుకునే వలస కార్మిక లబ్ధిదారులు, దినసరి కూలీలు, ఇతర రంగాల కార్మికులకు ఈ వ్యవస్థ ప్రయోజనం చేకూరుస్తుంది’అని ఆయన చెప్పారు. లబ్ధిదారుల ధ్రువీకరణను సమన్వయం చేయడానికి ప్రభుత్వం ‘వన్ నేషన్ వన్ స్టాండర్డ్’పై కృషి చేస్తోందని చెప్పారు. -
50 శాతం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది
సాక్షి, న్యూఢిల్లీ : టోల్ ప్లాజాల వద్ద ప్రయాణీకుల సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేసేందుకు వన్ నేషన్ వన్ టాగ్ ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగపడుతుందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీలోని కేంద్ర రోడ్డు రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్ నేషన్ వన్ టాగ్ ఫాస్ట్ టాగ్ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వన్ నేషన్ వన్ టాగ్ ఫాస్ట్ టాగ్ కార్యక్రమ అమలుకు తమ ప్రభుత్వం తెలిపిన ఆమోదాన్ని కేంద్రానికి వెల్లడించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెండింగులో ఉన్న జాతీయ రహదారులు, రోడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తులపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణకు అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్రానికి వివరించినట్లు మంత్రి వేముల పేర్కొన్నారు. -
కన్నడ విషయంలో రాజీపడబోం
బెంగళూరు/ చెన్నై: భారత్‌కు ఒకే జాతీయ భాష ఉండాలనీ, ఆ లోటును హిందీ భర్తీ చేయగలదన్న హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం, బీజేపీ నేత యడియూరప్ప స్పందించారు. తమ రాష్ట్రంలో కన్నడే ప్రధాన భాష అని, కన్నడ ప్రాధాన్యత విషయంలో తాము రాజీపడబోమని స్పష్టం చేశారు. ‘మన దేశంలోని అన్ని అధికార భాషలు సమానమే. ఇక కన్నడ విషయానికొస్తే అది రాష్ట్ర ప్రధాన భాష. కన్నడ భాషను ప్రోత్సహించడంతో పాటు రాష్ట్ర సంస్కృతి విషయంలో మేం రాజీ పడబోం’ అని తెలిపారు. షా, సుల్తాన్లు మార్చలేరు: కమల్ హాసన్ హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ప్రకటించారు. ‘భారత్ గణతంత్ర దేశంగా అవతరించగానే మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కొనసాగుతుందని హామీ లభించింది. దీన్ని ఏ షా(అమిత్ షా), సుల్తాన్, సామ్రాట్లు కూడా మార్చలేరు. మేం అన్ని భాషలను గౌరవిస్తాం. కానీ మా మాతృభాష మాత్రం ఎప్పటికీ తమిళమే’ అని అన్నారు. -
ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం- ఒక రేషన్ కార్డు విధానాన్ని రూపొందించడానికి 2020 జూన్ 30 వరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమయం ఇచ్చింది. ఇది అమల్లోకి వస్తే లబ్ధిదారులు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా రేషన్ షాపుల నుంచి సబ్సిడీతో ఆహార ధాన్యాలను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే 10 రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర) ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) పోర్టబిలిటీ ద్వారా రేషన్ అందిస్తున్నాయని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. జూన్ 30, 2020 నాటికి ఒక దేశం- ఒక రేషన్ కార్డు దేశం మొత్తం అమలవుతుందన్నారు. ఈ వ్యవస్థ అమలును వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశామని పాశ్వాన్ విలేకరులతో అన్నారు. వ్యక్తి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస వెళ్లినా పేదలు రేషన్ ఎక్కడైనా పొందవచ్చని కొత్త విధానం తెలియజేస్తోంది. నకిలీ రేషన్ కార్డుదారులను కూడా సులభంగా తొలగించడానికి ఈ వ్యవస్థ సహాయపడుతందని తెలిపారు. రేషన్ షాపుల్లో పాయింట్ ఆఫ్ సేల్ (పోస్) యంత్రాలను ఏర్పాటు చేసినందున పీడీఎస్ పోర్టబిలిటీని సులభంగా అమలు చేయగలమని పాశ్వాన్ పేర్కొన్నారు. అక్టోబర్-నవంబర్ నుంచి 15 రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో పైలట్ ప్రాతిపదికన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్నట్లు పాశ్వాన్ ప్రకటించారు. అలాగే నిల్వ నష్టాలను తగ్గించడానికి రాష్ట్రాలు తమ ఆహార ధాన్యం డిపోల కార్యకలాపాలను ఆటోమేట్ చేయడానికి ఆరు నెలల గడువు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. -
ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు
న్యూఢిల్లీ: ప్రజలు దేశంలో ఎక్కడ్నుంచి అయినా రేషన్ సరుకులు తీసుకునేందుకు వీలుగా ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు(వన్ నేషన్–వన్ రేషన్ కార్డ్) విధానాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఇందుకు 2020, జూన్ 30 వరకూ గడువిస్తున్నట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హరియాణా, కేరళ, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర, రాజస్తాన్ రాష్ట్రాల్లో రేషన్ సరుకులు ఎక్కడి నుంచైనా తీసుకునే సదుపాయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయని వెల్లడించారు. ‘2020, జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుకావాలి. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మేం ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాశాం. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసవెళ్లే నిరుపేదలు రేషన్ సరుకులు పొందలేక ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట పడుతుంది. మా ప్రభుత్వం తొలి 100 రోజులు ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చాం’ అని పాశ్వాన్ పేర్కొన్నారు. రేషన్ కోసం ఆధార్ చూపాల్సిందే.. ఈ నూతన విధానంలో ఓ రాష్ట్రంలోని ప్రజలు మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు రేషన్ సరుకుల కోసం ఆధార్‌కార్డును చూపాల్సి ఉంటుందని పాశ్వాన్ తెలిపారు. తమ పేర్లు రిజస్టరైన రేషన్‌షాపుల్లో అయితే కేవలం రేషన్ కార్డు చూపిస్తే సరిపోతుందని వెల్లడించారు. ఓ రాష్ట్రంలో ఆహారపదార్థాలను ఉచితంగా అందుకునే వ్యక్తి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు మాత్రం రూ.1 నుంచి రూ.3 వరకు కనీసధరను చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.. ‘రేషన్‌కార్డుదారుల్లో 89 శాతం మంది ఆధార్‌తో అనుసంధానమయ్యారు. దేశవ్యాప్తంగా 77 శాతం రేషన్ షాపుల్లో పాయింట్ ఆఫ్ సేల్స్(పీవోఎస్) యంత్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 22 రాష్ట్రాల్లోని రేషన్ షాపుల్లో 100 శాతం పీవోఎస్ యంత్రాలను అమర్చారు. కాబట్టి కొత్త విధానాన్ని అమలు చేయడానికి ఎలాంటి ఇబ్బందిలేదు’ అని పేర్కొన్నారు. ఈ పథకం దుర్వినియోగం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని పాశ్వాన్ చెప్పారు. కుటుంబంలో ఒకరు మరో రాష్ట్రానికి వలసవెళ్లి మొత్తం రేషన్ సరుకులు అక్కడే కొనేయకుండా 50 శాతం గరిష్ట పరిమితి విధిస్తున్నామని తెలిపారు. ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని పాశ్వాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి జాతీయ ఆహార భద్రత చట్టం కింద 80 కోట్ల మందికి రేషన్‌షాపుల్లో తక్కువ ధరలకే ఆహారపదార్థాలను అందజేస్తోంది. -
'ఒకే దేశం.. ఒకే గ్రిడ్.. ఒకే ధర'
న్యూఢిల్లీ: విద్యుత్ వెలుగులు లేక అంధకారంలో ఉంటున్న గ్రామాలకు కరెంట్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 'ఒకే దేశం.. ఒకే గ్రిడ్.. ఒకే ధర' అనే దూరదృష్టితో ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు. దేశమంతటా ఒకే రకమైన విద్యుత్ ఛార్జీలు ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇందుకోసం ఒక యూనిట్ కు రూ.4.40 వసూలు చేస్తామని చెప్పారు. విద్యుత్ కు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకునే వారికోసం 'విద్యుత్ ప్రవాహ్' అనే అప్లికేషన్ ను ప్రభుత్వం రూపొందించిందన్నారు. అందుబాటులోని ధరలతో నాణ్యమైన విద్యుత్‌ను, అన్ని గ్రామాలకు ప్రతిరోజూ అందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని గోయల్ తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి చదువు విద్యుత్ అందుబాటులో లేక ఆగిపోకూడదని గోయల్ పేర్కొన్నారు.