న్యూఢిల్లీ: విద్యుత్ వెలుగులు లేక అంధకారంలో ఉంటున్న గ్రామాలకు కరెంట్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 'ఒకే దేశం.. ఒకే గ్రిడ్.. ఒకే ధర' అనే దూరదృష్టితో ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు. దేశమంతటా ఒకే రకమైన విద్యుత్ ఛార్జీలు ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
ఇందుకోసం ఒక యూనిట్ కు రూ.4.40 వసూలు చేస్తామని చెప్పారు. విద్యుత్ కు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకునే వారికోసం 'విద్యుత్ ప్రవాహ్' అనే అప్లికేషన్ ను ప్రభుత్వం రూపొందించిందన్నారు. అందుబాటులోని ధరలతో నాణ్యమైన విద్యుత్‌ను, అన్ని గ్రామాలకు ప్రతిరోజూ అందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని గోయల్ తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి చదువు విద్యుత్ అందుబాటులో లేక ఆగిపోకూడదని గోయల్ పేర్కొన్నారు.