చింతన్ శిబిర్‌లో హోం మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్
సూరజ్‌కుండ్ (హరియాణా): పోలీసులకు దేశవ్యాప్తంగా ఒకే యూనిఫాం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. ‘ఒక దేశం, ఒకే యూనిఫాం’ భావనపై ఆలోచించాలని రాష్ట్రాలకు సూచించారు. అయితే వాటిపై దీన్ని రుద్దబోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. పోలీసు బలగాలకు ఇది ఉమ్మడి గుర్తింపునిస్తుందన్నదే నా ఉద్దేశం. కావాలంటే యూనిఫాంపై రాష్ట్రాలవారీగా ప్రత్యేక గుర్తింపు చిహ్నాలు ఉండవచ్చు.
ఇది వీలైతే ఇప్పుడు, లేదంటే ఐదేళ్లు, పదేళ్లు, వందేళ్లకు ఎప్పటికైనా సాధ్యపడొచ్చు’’ అని సూచించారు. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న రాష్ట్ర హోం మంత్రుల చింతన్ శిబిర్‌ను ఉద్దేశించి మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘గన్నులు, పెన్నులు... ఇలా నక్సలిజం ఏ రూపంలో ఉన్నా కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాల్సిందే. యువత మనసులను విషపూరితం చేసి వారిని తీవ్రవాదంవైపు మళ్లించకుండా నిరోధించాల్సిందే. అందుకోసం ఈ తీవ్రవాద శక్తుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి’’ అంటూ పిలుపునిచ్చారు.
దేశ క్షేమం దృష్ట్యా ఈ శక్తులు విజృంభించకుండా చూడాల్సిన అవసరముందన్నారు. ‘‘పాత చట్టాలను సమీక్షించుకోండి. కాలం చెల్లిన వాటిని వదిలించుకోండి. మిగతా వాటిని ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మెరుగు పరుచుకోండి’’ అని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ‘‘శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమే అయినా సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో కూడిన ఉమ్మడి కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాలి. పౌరుల పరిరక్షణే అంతిమ లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు అన్ని అంశాల్లోనూ పరస్పరం సహకరించుకోవాలి’’ అని సూచించారు. నేరాల స్వభావం
అంతర్రాష్ట్రీయ, అంతర్జాతీయ తరహాను సంతరించుకుంటున్నందున ఇది తప్పనిసరన్నారు. సైబర్ క్రైం, ఆయుధాలు, డ్రగ్స్ సరఫరాల్లో నేరగాళ్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నందున ఈ ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా వారికంటే ముందే ఉండాలన్నారు.
ఫేక్ న్యూస్‌కు తెర పడాలి
కొంతకాలంగా ఫేక్ న్యూస్ పెద్ద బెడదగా మారిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి తప్పుడు సమాచార వ్యాప్తిని తక్షణం అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. ఇది దేశానికే ముప్పుగా పరిణమించగలదన్నారు. ‘‘ఏ సమాచారాన్నయినా ఫార్వర్డ్ చేసే ముందు ప్రజలు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అందులోని నిజానిజాలను నిర్ధారించుకోవాలి. అందుకు వీలు కల్పించే వ్యవస్థలను వారికి చేరువ చేయడంలో టెక్నాలజీది కీలక పాత్ర’’ అని చెప్పారు. టెక్నాలజీపై వెచ్చించే మొత్తాన్ని మెరుగైన భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా చూడాలని అన్నారు. పర్యాటకం ప్రధాన ఆదాయ వనరుగా మారుతున్న నేపథ్యంలో పర్యాటక పోలిసింగ్‌పైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కోరారు.
అవినీతిపరులను వదిలేది లేదు
న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడితే వ్యక్తులనైనా, సంస్థలనైనా వదిలే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. అక్టోబర్ 31న మొదలవుతున్న విజిలెన్స్ వారోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన జాతికి సందేశమిచ్చారు. అవినీతి సామాన్యుల హక్కులను హరించడమే గాక దేశ ప్రగతిని కూడా కుంటుబరుస్తుందన్నారు. అవినీతిపై ఉమ్మడిగా పోరాడాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ కూడా పిలుపునిచ్చారు.
మన ఉక్కు పరిశ్రమ శక్తికి ఐఎన్‌ఎస్ విక్రాంతే తార్కాణం
సూరత్: భారత ఉక్కు పరిశ్రమ శక్తిసామర్థ్యాలకు, పనితనానికి తొలి దేశీయ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ చక్కని ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. ఎనిమిదేళ్ల సమష్టి కృషి ఫలితంగా భారత ఉక్కు పరిశ్రమ ప్రపంచంలో రెండో స్థానానికి ఎగబాకిందన్నారు. గుజరాత్‌లోని సూరత్ జిల్లా హజీరాలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా విస్తరణ ప్లాంటు భూమి పూజలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఉచితాలతో ఓటర్లను ఆధారపడేలా చేయొద్దు!
Comments
Please login to add a commentAdd a comment