ఉత్సాహం రంకెలేస్తోంది! | central govt allowed to Jallikattu fest | Sakshi
Sakshi News home page

ఉత్సాహం రంకెలేస్తోంది!

Published Sat, Jan 9 2016 3:00 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

ఉత్సాహం రంకెలేస్తోంది!

ఉత్సాహం రంకెలేస్తోంది!

తమిళుల సంప్రదాయ , పారంపర్య క్రీడ జల్లికట్టుకు అనుమతి లభించింది.

♦ జల్లికట్టుకు అనుమతి   77 రకాల నిబంధనలు  
♦ కేంద్రం ఉత్తర్వులతో ఆనందోత్సాహాలు
♦ పీఆర్‌కు ప్రశంసల జల్లు
♦ పీఎంకు సీఎం కృతజ్ఞత  సర్వత్రా హర్షం  
   

 తమిళుల సంప్రదాయ , పారంపర్య క్రీడ జల్లికట్టుకు అనుమతి లభించింది. సంక్రాంతి సంబరాల్లో జల్లికట్టు ఉత్సాహం రంకెలు వేయనుంది. కేంద్రం ఉత్తర్వులతో రాష్ట్రంలో సంక్రాంతి ముందే వచ్చిందా..! అన్నట్టు  స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా మోతతో హోరెత్తించారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రానికి చెందిన కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్(పీఆర్)ను ప్రశంసలతో ముంచెత్తారు.  ఇక, సాహస క్రీడ కట్టుదిట్టమైన 77 రకాల నిబంధనలతో నిర్వహించున్నారు.
 
 సాక్షి, చెన్నై : తమిళుల సాహసం, వీరత్వానికి ప్రతీకగా, సంప్రదాయ క్రీడగా జల్లికట్టు ప్రసిద్ధి చెందింది. అయితే, ఎద్దులను జల్లికట్టు పేరుతో హింసిస్తున్నారనే నెపంతో దాఖలైన పిటిషన్‌కు గతంలో సుప్రీం కోర్టు తీవ్రంగానే స్పందించింది. జల్లికట్టుకు నిషేధం పడింది. దీంతో గత ఏడాది జల్లికట్టుకు దూరంగా సంక్రాంతిని జరుపుకోవాల్సిన పరిస్థితి.
 
 అయితే, ఈ ఏడాది ఎలాగైనా జల్లికట్టుకు అనుమతి సాధించాలన్న పట్టుదలతో నిర్వాహకులు, జల్లికట్టు అభిమానులు కదం తొక్కారు. ఇందుకు రాజకీయ పక్షాలు తోడయ్యాయి. ఎన్నికల వేళ జల్లికట్టు గళాన్ని అన్ని పార్టీలు అందుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం స్పందించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో పడింది. అయితే, వ్యవహారం కోర్టులో ఉన్న దృష్ట్యా ఆచితూచి అడుగులేసింది. రాష్ట్రానికి చెందిన కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ మాత్రం జల్లికట్టుకు అనుమతి వచ్చి తీరుతుందనే తొలినుంచీ నమ్మకంతో ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగారు.
 
    దీంతో జల్లికట్టుకు అనుమతి వస్తుందా..? రాదా..? అన్న ఉత్కంఠ పెరిగింది. మరోవైపు నిరసనలూ రాజుకున్నాయి.  చివరకు జల్లికట్టుకు అనుమతి ఉత్తర్వులు కేంద్రం జారీ చేసినా,  అనుమతి  సాధించామన్న విషయాన్ని తొలుత పొన్ రాధాకృష్ణన్  ప్రకటించడం గమనార్హం. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ నేతృత్వంలోని అధికార వర్గాలు కొన్ని రోజులుగా తీవ్రంగా శ్రమించి, ఎట్టకేలకు జల్లికట్టు అనుమతి విషయాన్ని కొలిక్కి తెచ్చారు.
 
 
 సుప్రీం కోర్టు సలహాలను పాటించారు. జంతు సంరక్షణ చట్టంలో పేర్కొన్న నిబంధనల్ని సడలించకుండా, ఆచితూచీ అడుగులు వేసి ‘పారంపర్యం’ అన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని అనుమతి జారీ చేసి ఉండటం గమనార్హం. పారంపర్యంగా జల్లికట్టును నిర్వహిస్తూ వస్తున్న ప్రాంతాల్లో  సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు వీలుగా, అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ అనుమతి జారీ చేస్తున్నామని ప్రకటించారు.
 
  ఈ ప్రకటనతో పాటుగా జల్లికట్టు నిర్వహణకు 77 రకాల నిబంధనల్ని విధించారు. జిల్లా కలెక్టర్లు,  జంతు సంరక్షణ సంస్థల పర్యవేక్షణలో జల్లికట్టు నిర్వహణ తప్పనిసరి. ప్రవేశ మార్గం(వాడివాసల్) నుంచి పదిహేను మీటర్లలోపే ఎద్దును పట్టుకోవాల్సి ఉంటుంది. ఎద్దుకు చిన్నహాని జరిగినా, మత్తు పదార్థాలు ఇచ్చినట్టు తేలినా తీవ్ర పరిణామాలు తప్పదన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. నిబంధనల మాట ఎలా ఉన్నా, తమ సంప్రదాయ క్రీడకు అనుమతి దక్కడంతో తమిళుల ఉత్సాహానికి అంతులేకుండా పోయింది.
 
 అంబరాన్నంటిన ఆనందోత్సాహాలు :  జల్లికట్టుకు పేరు గడించిన మదురై జిల్లా పీల మేడు,  అలంగానల్లూరుల నుంచి తొలి పోటీ ప్రారంభం కానుండటం విదితమే. దీంతో ఆ గ్రామాలు  పండుగ వాతావరణంలో మునిగాయి. ఎటు చూసినా బాణసంచాల హోరే. స్వీట్ల పంపిణీతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక, తిరుచ్చి, దిండుగల్ తదితర జిల్లాల్లో సంక్రాంతి ముందే వచ్చిందన్నట్టుగా ఆనందోత్సాహాలు ంబరాన్నంటాయి. తమ ఎద్దులతో ఊరేగింపు నిర్వహించారు. పీల మేడు, అలంగానల్లూరులో అయితే అనుమతి ప్రకటన తదుపరి ఏర్పాట్లను వేగవంతం చేశారు.
 
 సర్వత్రా హర్షం:  జల్లికట్టుకు అనుమతి రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాజకీయ పక్షాలు సైతం హర్షం వ్యక్తం చేశాయి. సీఎం జయలలిత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. అలాగే జల్లికట్టు నిర్వహణ, నిబంధనల అమలుపై జిల్లా కలెక్టర్లకు  ఆదేశాలు జారీ చేశారు. ఇక, ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ ఘనతను కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌కే దక్కుతుందని స్పందించడం విశేషం. డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ..జల్లికట్టు కోసం తొలుత గళం విప్పింది తామేనని గుర్తు చేశారు. ఈ అనుమతి రావడం వెనుక పొన్‌రాధాకృష్ణన్ శ్రమ ఎంతో ఉందని ప్రశంసించారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సైతం పొన్‌రాధాకృష్ణన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.
 
 జల్లికట్టుపై నేతల స్పందన
 పొన్‌రాధాకృష్ణన్ ప్రయత్నం వల్లే   ఈ అనుమతి వచ్చింది
                 -టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్
 

 తమిళుల సమస్యల మీద ఉదాసీనంగా వ్యవహరించే పాలకులు, ఈ సమస్య మీద స్పందించడం ఆనందంగా ఉంది. తమిళుల మనో భావాలకు అనుగుణంగా పాలకులు నడుచుకోవాలి.
               - ఎండీఎంకే నేత వైగో
 
 ఇది ఏ ఒక్కరి వ్యక్తిగత విజయం కాదు
 ఇది దక్షిణ తమిళనాడులోని ప్రతి పౌరుడి విజయం.
                 - సీపీఐ నేత ముత్తరసన్
 
 ఇది ప్రజా విజయం
             - సీపీఎం నేత రామకృష్ణన్  
 
 ఈ అనుమతి అన్ని పార్టీల సమష్టి విజయం.
            -తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్
 
 ఎన్నిక లను దృష్టిలో ఉంచుకుని ఈ అనుమతి ఇచ్చారు
               -కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బూ
 
 ఈ అనుమతి రావడానికి ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రి ప్రకాష్ జవదేకర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కృషి చేశారు. వారి వలనే ఇది సాధ్యమైంది.
                   పొన్ రాధాకృష్ణన్
 
 రాష్ట్రాల మనో భావాలకు అనుగుణంగా కేంద్రం
 వ్యవహరిస్తోంది. అందుకు నిదర్శనమే జల్లికట్టుకు
 అనుమతి సాధించడం.
                 - బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement