పేటీఎం చెల్లింపుల బ్యాంక్‌కు ఆర్‌బీఐ తుది ఆమోదం
వచ్చే నెలలో కార్యకలాపాలు
న్యూఢిల్లీ: పేటీఎం సంస్థ.. ఆర్‌బీఐ నుంచి చెల్లింపుల బ్యాంక్‌కు తుది ఆమోదం పొందింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ నుంచి తుది ఆమోదం పొందామని పేటీఎం తెలిపింది. వచ్చే నెల నుంచి చెల్లింపు బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ఈ బ్యాంక్‌కు పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించడానికి ఇష్ఠపడతానని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో కొత్త వ్యాపార విధానాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని వివరించారు. బ్యాంకింగ్ సేవలు అందని కోట్లాది భారతీయులకు ఆర్థిక సేవలందించడంపై దృష్టి సారిస్తామన్నారు.
తొలి బ్రాంచ్ నోయిడాలో..
కాగా వచ్చే నెల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పేటీఎం ప్రతినిధి ఒకరు చెప్పారు. తొలి బ్రాంచ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆరంభిస్తామని వివరించారు. చెల్లింపుల బ్యాంక్‌లు వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థల నుంచి రూ. లక్ష వరకూ డిపాజిట్లను అంగీకరిస్తాయి.