బీఎస్ఈ ఐపీఓకు వాటాదారులు ఓకే
♦ కనీసం 30% వాటా విక్రయం !
♦ ఓఎఫ్‌ఎస్ విధానంలో ఐపీఓ
ముంబై: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు వాటాదారుల ఆమోదం లభించింది. గత వారంలో జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో బీఎస్‌ఈ ఐపీఓకు వాటాదారులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని బీఎస్‌ఈ వెల్లడించింది. ఈ ఐపీఓ ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో ఉండొచ్చని, వాటాదారులు కూడా దానికే ఓటు వేశారని సమాచారం. బీఎస్‌ఈలో గరిష్టంగా 30 శాతం ఈక్విటీని ఓఎఫ్‌ఎస్ విధానంలో విక్రయించనున్నారు.
ఇప్పటివరకూ బీఎస్‌ఈలో బ్రోకర్లు, వివిధ సంస్థలతో కలసి మొత్తం 9,283 మంది వాటాదారులున్నారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి బీఎస్‌ఈకి ఈ ఏడాది మొదట్లోనే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. త్వరలోనే ఐపీఓ ముసాయిదా పత్రాలను సెబీకి బీఎస్‌ఈ సమర్పించనున్నది. ఈ ఐపీఓకు లీడ్ మర్చంట్ బ్యాంకర్‌గా ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను , న్యాయ సలహాదారులుగా ఏజెడ్‌బీ అండ్ పార్ట్‌నర్స్, నిశిత్ దేశాయ్ అసోసియేట్స్‌ను బీఎస్‌ఈ నియమించింది. మరో స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్‌ఎస్‌ఈ... దేశీయంగానూ, విదేశాల్లోనూ లిస్టింగ్‌కు ప్రయత్నాలు చేయనున్నామని ఇటీవలనే వెల్లడించింది.