
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం జనవరి 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్రం శుక్రవారం ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మత వివక్ష ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, సిఖ్, జైన్, పార్శీ, క్రిస్టియన్, బౌద్ధ మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు డిసెంబర్ 11న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ చట్టంలో ముస్లింల పట్ల వివక్ష ఉందని పేర్కొంటూ ఆందోళనలు జరుగుతున్నాయి.