సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు ప్రభుత్వ ట్రెజరీ నుంచి జీతాలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుదిరితే ఈ నెల నుంచే ప్రభుత్వ జీతాలు అందేలా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. దీనికి గవర్నర్ ఆమోదముద్ర పడగానే చట్టబద్ధత రానుంది.
ఈ క్రమంలో అటు గవర్నర్ ఆమోద ముద్ర కోసం ఎదురుచూస్తూనే.. ఇదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ నుంచి కాకుండా నేరుగా ప్రభుత్వం నుంచే జీతాలు విడుదలయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని కోరింది. దీంతో.. ఉద్యోగి పేరు, హోదా (డెజిగ్నేషన్), పనిచేస్తున్న విభాగం, ఆధార్‌కార్డు, ప్రస్తుతం అందుకుంటున్న జీతం వివరాలను ఆధార సహితంగా జాబితా రూపంలో ఆర్టీసీ సిద్ధం చేస్తోంది.
ఈ నెల 16 తర్వాత బదిలీలు వద్దు
ఉద్యోగులు, జీతాల జాబితాలను ఆయా విభాగాదిపతులు సిద్ధం చేసి బస్‌భవన్‌కు పంపితే, అక్కడి నుంచి ఆర్థిక శాఖకు చేరనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సిబ్బంది ఎక్కడివారు అక్కడే ఉంటే జాబితాలో అయోమయం లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో.. ఆర్టీసీలో ఈనెల 16వ తేదీ తర్వాత బదిలీలు, పదోన్నతులకు వీలు లేకుండా ఆదేశాలు వెలువడ్డాయి. పదోన్నతులు, బదిలీల వంటివి ఆలోగానే పూర్తి చేయాల్సి ఉంటుంది.
16వ తేదీ తర్వాత ఉద్యోగుల వివరాలను సిద్ధం చేసి, ఆర్థిక శాఖకు పంపనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ జీతాల పద్దును సిద్ధంచేసి ట్రెజరీకి పంపుతుంది. ఆలోగా ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం వస్తే.. ప్రస్తుత నెల జీతాలను ట్రెజరీ నుంచి విడుదల చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ జాప్యం జరిగితే.. ఈ నెలకు ఆర్టీసీ నుంచే జీతాలిచ్చి, వచ్చే నెల నుంచి ట్రెజరీ ద్వారా విడుదల చేసే అవకాశం ఉంటుంది.
కొంతకాలం ప్రస్తుత వేతనాలే..!
ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైనా కొంతకాలం ప్రస్తుతమున్న వేతనాలే అందనున్నాయి. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోని వివిధ హోదాలు, కేడర్లకు సమానంగా నిర్ధారించాల్సి ఉంటుంది. అప్పుడు ఆయా కేడర్లను బట్టి వేతనాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. త్వరలో ప్రభుత్వం నియమించనున్న అధికారుల సబ్ కమిటీ దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించాల్సి ఉంటుంది.
సదరు కమిటీ ఏర్పాటై, వివరాలు కోరగానే అందజేసేందుకు వీలుగా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఏపీలో ఇంతకుముందే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంచేసిన నేపథ్యంలో.. అక్కడ అనుసరించిన పద్ధతులు, ఎదురైన ఇబ్బందులు, వాటి పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలించేందుకు ఇటీవలే టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు విజయవాడ వెళ్లి వచ్చారు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కూడా విజయవాడ వెళ్లి అధ్యయనం చేసి వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment