వాదోపవాదాల నడుమ ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదు బిల్లులను శాసనమండలి ఆమోదించింది.
సాక్షి, హైదరాబాద్: వాదోపవాదాల నడుమ ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదు బిల్లులను శాసనమండలి ఆమోదించింది. మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జీతభత్యాలు పెంపు బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు. ఈ రెండు బిల్లులకు అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. సుదీర్ఘ చర్చల అనంతరం ఆర్థిక మంత్రి ఈటల ప్రతిపాదించిన ద్రవ్య వినిమయ బిల్లు కూడా మండలి ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వారికిచ్చే జీత భ త్యాలను పెంచిందన్నారు.
మండలి నుంచి కాంగ్రెస్ వాకౌట్
యూనివర్సిటీ చట్టానికి సవరణ బిల్లులను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రతిపాదించగా, యూనివర్సిటీలకు చాన్సలర్‌గా గవర్నర్‌నే కొనసాగించాలని కాంగ్రెస్ సభ్యులు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆకుల లలిత పట్టుబట్టారు. గవర్నర్‌ను కించపరిచే ఉద్దేశం తమకు లేదని, వర్సిటీలను ప్రక్షాళన చేసేందుకే చట్టాన్ని సవరిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై ప్రభుత్వ వాదనకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులంతా వాకౌట్ చేశారు. అనంతరం రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సవరణ బిల్లులు మూజువాణీ ఓటుతో ఆమోదం పొందినట్లు చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు.