పాలెం వాగు మధ్యతరహా ప్రాజెక్టు సవరించిన అంచనాలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
సాక్షి, హైదరాబాద్: పాలెం వాగు మధ్యతరహా ప్రాజెక్టు సవరించిన అంచనాలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.102.30 కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్టు అంచనాను రూ.221.47 కోట్లకు సవరించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం మల్లాపురం వద్ద పాలెం వాగు ప్రాజెక్టును చేపట్టారు. ఇక్కడ 132 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో రిజర్వాయర్ నిర్మాణం చేస్తుండగా, 1,540 క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యంతో గేటెడ్ స్పిల్‌వే నిర్మించాల్సి ఉంది.
దీనికితోడు రేడియల్ గేట్లు, గేట్ల నిర్వహణ పరికరాలు అమర్చడం వంటి పనులు చేయాలి. ఈ పనులు పూర్తయితే ప్రాజెక్టు పరిధిలోని 10,132 ఎకరాల్లోని ఆయకట్టుకు ఖరీఫ్‌లో ఆరుతడి పంటలకు నీరిచ్చే అవకాశం ఉంది. రబీలో వర్షాధార పంటలకు 3,089 ఎకరాలకు నీరివ్వవచ్చు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పరిధిలోని పనులకు మొత్తంగా రూ.230.13 కోట్లు అవసరం ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపగా, రూ.221.47 కోట్లకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.