ఫలితంగా రైతులపై ప్రతికూల ప్రభావం
వ్యవసాయంలో అనుమతుల ప్రక్రియను ఆధునీకరించాలి
న్యూఢిల్లీ: బ్యూరోక్రసీ విధానాల కారణంగా భారత సాగురంగంలో వినూత్న ఉత్పత్తులకు అనుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని అగ్రోకెమికల్స్ దిగ్గజం సింజెంటా గ్రూప్ సీఈవో జెఫ్ రోవ్ వ్యాఖ్యానించారు. దీంతో రైతులపై ప్రభావం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత పర్యటన సందర్భంగా ఆయన తెలిపారు.
దేశీయంగా సులభతరంగా వ్యాపారాల నిర్వహణ అంశంపై స్పందిస్తూ ‘భారత్‌లో ప్రోడక్టుల అనుమతులకు సంబంధించి పాలసీ అంతా బ్యూరోక్రసీమయంగా ఉంటుంది. దీంతో అనుమతులకు చాలా సమయం పట్టేస్తుంది. ఆ ప్రభావం రైతులపై పడుతుంది‘ అని జెఫ్ పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణల కోసం రైతులు ఎంత ఎక్కువగా నిరీక్షించాల్సి వస్తే అంత ఎక్కువగా రిస్కులు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన చెప్పారు.
వినియోగదారుల వ్యవస్థను డిజిటలీకరించడంలో భారత ప్రభుత్వ కృషిని ప్రశంసించిన జెఫ్.. వ్యవసాయ రంగంలోనూ అదే తరహాలో అనుమతుల ప్రక్రియను ఆధునీకరించాలని కోరారు. వాతావరణ మార్పులతో రిస్కులే కాకుండా అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
వచ్చే 3 ఏళ్లలో 40 ఉత్పత్తులు..
రాబోయే 2–3 సంవత్సరాల్లో కొత్తగా 40 పంట సంరక్షణ ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు జెఫ్ చెప్పారు. పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలపై తమ సంస్థ అంతర్జాతీయంగా ఏటా 2 బిలియన్ డాలర్లు వెచ్చిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో తమ వ్యాపారం ఈ ఏడాది ద్వితీయార్థంలో కాస్త మెరుగుపడగలదని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఆహార అవసరాలు పెరుగుతున్న తరుణంలో సేంద్రియ వ్యవసాయాన్ని భారీ స్థాయిలో విస్తరించడానికి అవకాశాలు తక్కువని జెఫ్ తెలిపారు. సంప్రదాయ సాగుతో పోలిస్తే సేంద్రియ వ్యవసాయ సామరŠాధ్యలు 20–30 శాతం మేర తక్కువగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. ప్రత్యేకమైన భారత వ్యవసాయ రంగ సవాళ్లను పరిష్కరించడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించగలదని జెఫ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment