న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌పై ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. తాజా బిల్లు ప్రకారం భర్త అకస్మాత్తుగా ట్రిపుల్ తలాక్ చెప్పేసి, భార్యకు విడాకులు ఇవ్వటం చెల్లదు. అలా చేసిన పక్షంలో సదరు భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడేందుకు వీలుంటుంది. ముందస్తు సమాచారం లేకుండా ట్రిపుల్ తలాక్ చెప్పే ‘తలాక్– ఇ–బిద్దత్’కు ఇది వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లోనే బాధితు రాలు కోర్టును ఆశ్రయించి తనతోపాటు, మైనర్లయిన పిల్లలకు అవసరమైన సాయం కోరే హక్కు కల్పిస్తుంది. హోంమంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ ముసాయిదాను తయారు చేసింది.
ఈ ఉప సంఘంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రి జైట్లీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్, సహాయ మంత్రి పీపీ చౌదరి ఉన్నారు. ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం రూపొందించిన బిల్లు సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉంటేనే మద్దతిస్తామని, లేకుంటే తిరస్కరిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లు రూపొందించటానికి ముందే కేంద్రం ప్రభుత్వం ముస్లిం సంఘాలు, నిపుణులతో చర్చించాల్సి ఉందని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్‌బీ) తెలిపింది. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలను ప్రజలపై బలవంతంగా రుద్దటం తగదని పేర్కొంది. ఆలిండియా ముస్లిం మహిళా పర్సనల్ లా బోర్డ్, ముస్లిం ఉమెన్ లీగ్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి.
ఎండీఆర్ చార్జీల భారం లేదు...
► రూ.రెండు వేలలోపు డెబిట్ కార్డులు, భీమ్, ఆధార్ అనుసంధాన లావాదేవీల చార్జీలను ప్రభుత్వం భరించనుంది. మర్చంట్ డిస్కౌంట్‌రేట్(ఎండీఆర్) మొత్తాన్ని లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ విధానం వచ్చే ఏడాది జనవరి నుంచి రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
►మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు ఆమోదం.
►తోళ్లు, పాదరక్షల విభాగానికి రూ.2,600 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ. దీంతో మూడేళ్లలో దాదాపు 3లక్షల ఉద్యోగాల కల్పన అవకాశం.
►జాతీయ ఆయుష్ మిషన్(ఎన్‌ఏఎం) అమలును 2020 వరకు పొడిగిస్తూ రూ.2,400 కోట్లు కేటాయించింది.
►చెక్ బౌన్స్ కేసులు ట్రయల్ కోర్టులో విచారణలో ఉండగానే కొంత మొత్తాన్ని బాధితుడికి చెల్లించేలా ‘నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్’ చట్టంలో సవరణకు ఓకే.
►జీఎస్టీ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టేందుకు నిర్ణయం. జీఎస్టీ చట్టం–2017 ప్రకారం.. వస్తు సేవా పన్ను అమలుతో రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయానికి తగు పరిహారాన్ని కేంద్రం అందజేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment