సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. విధుల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఆయనను నియమించింది.
సంచలనాలు, సంస్కరణలకు చిరునామా అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ– మెయిల్ ద్వారా సమాచారం అందించారు. సోమవారం ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రవీణ్‌కుమార్ కరీంనగర్, అనంతపూర్ జిల్లాలకు ఎస్పీగా, హైదరాబాద్‌లో డీసీపీ (క్రైమ్), జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్), తర్వాత గురుకుల సొసైటీకి కార్యదర్శిగా పనిచేశారు.
కరీంనగర్ ఎస్పీ (2001 నుంచి 2004)గా పనిచేయడం ఆయనకు చాలా గుర్తింపు తెచ్చింది. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేస్తూనే, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్న గ్రామంలోనే ఉండాలంటూ ఆయన ఇచ్చిన నినాదం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రులను ఎంతగానో ప్రభావితం చేసింది. ‘గురువా మా ఊర్లోనే ఉండు..’అన్న నినాదం జిల్లావ్యాప్తంగా ఉద్యమంగా మారింది. భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment