voluntary retirement
-
AP: ఐఏఎస్ ఇంతియాజ్ స్వచ్చంద పదవీ విరమణ
సాక్షి, విజయవాడ: ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సెర్ప్ సీఈవోగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ రాజకీయ ప్రవేశం చేసేందుకు పదవీ విరమణ చేసినట్లు సమాచారం. ఇంతియాజ్ అహ్మద్ వీఆర్ఎస్ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
TSRTC: స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు స్పందన కరువు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు స్పందన కరువైంది. చాలా కాలంగా వీఆర్ఎస్ కోసంఎదురు చూస్తున్న వేలాది మంది కార్మికులు సైతం సందిగ్ధంలో పడ్డారు. వీఆర్ఎస్ పథకంలో స్పష్టత లేకపోవడం, కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలపై విధివిధానాల్లో స్పష్టత లోపించడం వల్ల వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వయోభారం దృష్ట్యా ఉద్యోగ విరమణ చేయాలని భావిస్తున్నప్పటికీ పదవీ విరమణ ప్రయోజనాల్లో నష్టం వాటిల్లవచ్చుననే ఆందోళన వల్ల కార్మికులు ఈ పథకానికి దూరంగా ఉన్నట్లు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. గ్రేటర్‌లోని 29 డిపోల పరిధిలో ఇప్పటి వరకు సుమారు 300 మంది ఉద్యోగులు మాత్రమే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఈ పథకానికి అర్హులైన వారు సుమారు 7000 మంది ఉన్నారు. ఈ ఏడాది కనీసం 2000 మంది వీఆర్ఎస్ తీసుకోవచ్చునని అధికారులు అంచనా వేశారు. కానీ అనేక రకాల అనుమానాల దృష్ట్యా చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ప్రయోజనాలపై స్పష్టత లేదు... ‘వీఆర్ఎస్ తీసుకొని ఉన్నపళంగా రోడ్డున పడుతామేమో అనిపిస్తోంది. ఈ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు’ అని రాణిగంజ్ డిపోకు చెందిన సీనియర్ డ్రైవర్ ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. వీఆర్ఎస్ కోసం రెండేళ్లుగా ఎదురుచూశామని, చివరకు దాంట్లో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలియకపోవడం వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు పలువురు సీనియర్ మహిళా కండక్టర్లు అభిప్రాయపడ్డారు. కనీసం 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు లేదా 55 ఏళ్ల వయసు నిండిన వాళ్లు దీనికి అర్హులు. కానీ 2013 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వీఆర్ఎస్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 పీఆర్సీలు పెండింగ్ జాబితాలో ఉన్నాయి. వీటి కోసంఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అలాగే మరో 6 డీఏలు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఇప్పటికిప్పుడు వీఆర్ఎస్ తీసుకొంటే అటు పీఆర్సీకి నోచక, ఇటు డీఏలు దక్కక తీవ్రంగా నష్టపోవలసి ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. ‘ఉద్యోగ విరమణ అనంతరం వైద్య సదుపాయం ఉంటుందో లేదో కూడా స్పష్టత లేదు. 20 ఏళ్లు పూర్తి చేసిన వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా సాగనంపుతున్నట్లుగానే ఉంది’ అని బండ్లగూడ డిపోకు చెందిన సీనియర్ ఉద్యోగి ఒకరు చెప్పారు. వయోభారంతో ఎదురు చూపులు.. ► ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం 2019లో రెండేళ్లకు పెంచింది. దీంతో ఆ సంవత్సరం ఉద్యోగ విరమణ చేయవలసిన వాళ్లు 2021 వరకు విధులు నిర్వహించారు. కానీ చాలా మంది రెండేళ్ల పెంపును భారంగానే భావిస్తున్నారు. ముఖ్యంగా విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే డ్రైవర్లు, మహిళా కండక్టర్లు స్వచ్ఛంద పదవీ విరమణ వైపే మొగ్గు చూపుతున్నారు. వయోభారం కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులతో బాధపడేవాళ్లు విశ్రాంతిని కోరుకుంటున్నారు. (క్లిక్: బాసర ట్రిపుల్ ఐటీ.. సిబ్బంది గురించి వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు!) ► గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోలు, కార్యాలయాల్లో సుమారు 18 వేల మందికి పైగా పని చేస్తున్నారు. వీరిలో 55 ఏళ్లు నిండిన వాళ్లు లేదా, 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్లు కనీసం7 వేల మంది ఉన్నట్లు అంచనా. (క్లిక్: ప్రైవేటు డిస్కంలకు లైన్ క్లియర్!) -
ఆర్టీసీలో కనిష్టంగా రూ. వెయ్యి పెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ వ్యవహారంలో ఆర్టీసీ వేగాన్ని పెంచింది. ఇటీవలే దాదాపు 3100 మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే. వీఆర్ఎస్ తీసుకుంటే, వచ్చే ఆర్థిక ప్రయోజనాలను స్పష్టం చేస్తూ ఆర్టీసీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చెల్లింపులు ఇలా... ►వీఆర్ఎస్ తీసుకున్న రోజు వరకు అర్హత ఉన్న గ్రాట్యుటీ వడ్డీతో కలిపి చెల్లిస్తారు. ►పీఎఫ్‌కు సంబంధించి ఉద్యోగి వితరణ, యాజమాన్యం వితరణ మొత్తాలను వీఆర్ఎస్ తీసుకునే నాటికి లెక్కించి జత చేసి చెల్లిస్తారు. ►పదేళ్లకు పైగా సర్వీసు ఉన్న వారికి కనిష్టంగా రూ.వేయి చొప్పున పెన్షన్ చెల్లిస్తారు. ►స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం, స్టాఫ్ బెన్వెలెంట్ కమ్ థ్రిఫ్ట్ స్కీం కింద ఉద్యోగి అప్పటివరకు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో కలిపి అందిస్తారు. ►300 ఆర్జిత సెలవులకు రావాల్సిన మొత్తం లేదా వాస్తవంగా ఖాతాలో క్రెడిటైన అసలు ఈఎల్స్ మొత్తం రెంటిలో ఏది తక్కువో అది చెల్లిస్తారు. ►నోటీసు కాలానికి సంబంధించిన వేతనం చెల్లిస్తారు. వీఆర్ఎస్ తీసుకున్నాక మిగిలిపోయిన సర్వీసు కాలం ఐదేళ్లలోపు ఉంటే వేతనం + చివరిసారి పొందిన కరువు భత్యం ఇంటూ 15/26 ఇంటూ మిగిలిన సర్వీసు ఫార్ములాతో చెల్లిస్తారు. ఐదేళ్లకు పైబడి–పదేళ్లలోపు సర్వీసు ఉంటే పే + చివరిసారి పొందిన కరువుభత్యం ఇంటూ 20/26 ఇంటూ మిగిలిన సర్వీసు ఫార్ములా ప్రకారం చెల్లిస్తారు. పదేళ్లకుపైబడి సర్వీసు ఉంటే పే +చివరి డీఏ ఇంటూ 25/26 ఇంటూ పదేళ్ల మిగిలిన సర్వీసు ఫార్ములా ప్రకారం లెక్కించి చెల్లిస్తారు. ఇక నోషనల్ గ్రాట్యుటీకి సంబంధించి ఐదేళ్ల గరిష్ట మొత్తం లేదా మిగిలిన సర్వీసు కాలానికి లెక్కించిన మొత్తం.. వీటిలో ఏది తక్కువో అది చెల్లిస్తారు. ఉద్యోగి వాటా నోషనల్ పీఎఫ్‌కు.. ఐదేళ్ల గరిష్ట సర్వీసు లేదా మిగిలిన సర్వీసు.. ఏది తక్కువో అది లెక్కించి చెల్లిస్తారు. బస్‌పాస్: సిటీలో మెట్రో ఎక్స్ప్రెస్వరకు, జిల్లా సర్వీసుల్లో డీలక్స్ కేటగిరీ వరకు ఉచితంగా ప్రయాణించొచ్చు. సూపర్ లగ్జరీ ఆపై కేటగిరీల్లో 50 శాతం రాయితీతో ప్రయాణించొచ్చు. ఉద్యోగి మరణించాక ఇదే రాయితీ స్పౌజ్‌కు వర్తిస్తుంది. 2013 వేతన సవరణకు సంబంధించి బకాయి ఉన్న బాండ్స్ మొత్తాన్ని వడ్డీతోపాటు చెల్లిస్తారు. -
గ్రేటర్ ఆర్టీసీలో వీఆర్‘ఎస్’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు ఉద్యోగులు బారులు తీరుతున్నారు. వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెలాఖరు వరకు గడువు విధించడంతో నగరంలోని వివిధ డిపోలకు చెందిన సీనియర్ కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణకు ఆర్టీసీ యాజమాన్యం గతంలోనే ఒకసారి అవకాశం కల్పించింది. దాంతో అప్పట్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. పదవీ విరమణకు చేరువలో ఉన్న సుమారు 1500 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ పథకంపై అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచారు. అప్పటి నుంచి వీఆర్ఎస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లతో పాటు కొత్తగా మరికొందరికి అవకాశం కలి్పంచేందుకు తాజాగా మరోసారి దరఖాస్తులు ఆహా్వనించారు. ఈ నెలాఖరు వరకు గడువు విధించడంతో వివిధ డిపోలకు చెందిన సీనియర్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వయోభారమే కారణం.. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 2019లో రెండేళ్లకు పెంచింది. దీంతో ఆ సంవత్సరం ఉద్యోగ విరమణ చేయాల్సిన వాళ్లు 2021 వరకు విధులు నిర్వహించారు. కానీ.. చాలా మంది రెండేళ్ల పెంపును భారంగానే భావిస్తున్నారు. ముఖ్యంగా విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే డ్రైవర్లు, ఆ తర్వాత కండక్టర్లు స్వచ్ఛంద పదవీ విరమణ వైపే మొగ్గు చూపుతున్నారు. వయోభారం కారణంగా అధిక రక్తపో టు, మధుమేహం, గుండెజబ్బులతో బాధపడేవా ళ్లు విశ్రాంతిని కోరుకుంటున్నారు. అప్పట్లోనే సు మారు 1500 మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా తాజా ప్రకటనతో మరికొంత మంది అదనంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. తగ్గనున్న ఆర్థిక భారం.. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో వివిధ విభాగాల్లో సుమారు 18 వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పీకల్లోతు నష్టాల్లో నడుస్తున్న సంస్థలో ఇంధనం, విడిభాగాల కొనుగోళ్లు, బస్సుల నిర్వహణతో పాటు ఉద్యోగుల జీతభత్యాలు కూడా భారంగానే మారాయి. ఈ క్రమంలో అదనపు భారాన్ని తగ్గించుకొనేందుకే మరోసారి ఈ పథకాన్ని ముందుకు తెచ్చినట్లు సమాచారం. 2019లోనే వీఆర్ఎస్ ప్రస్తావన వచి్చనప్పటికీ అప్పట్లో ఉద్యోగ సంఘాలు గట్టిగా వ్యతిరేకించడంతో విరమించుకున్నారు. ఆ తర్వాత వీఆర్ఎస్ ప్రతిపాదన ముందుకు వచ్చింది. అప్పటికి విధానపరమైన అంశాల్లో కారి్మక సంఘాల జోక్యం లేకపోవడంతో వీఆర్ఎస్ను ప్రతిపాదించారు. దీంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు ఒక అవకాశంగా భావిస్తున్న అధికారులు తాజాగా వీఆర్ఎస్ను ప్రకటించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను డిపోల నుంచి సేకరించడం గమనార్హం. (చదవండి: నవీకరణ.. నవ్విపోదురు గాక!) -
ఐపీఎస్ కొలువుకు రాజీనామా.. శ్రీకృష్ణుడి సేవకు అంకితం
చండీగఢ్: పోలీసు ఉద్యోగానికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఐపీఎస్ కొలువు అంటే మాటలు కాదు. ఇక ఐపీఎస్ ఉద్యోగం సాధించడం కూడా అంత సులువు కాదు. మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ మంది ఏళ్ల తరబడి అహోరాత్రాలు శ్రమించి.. కష్టపడి చదువుతారు. అయినా కొందరికి ఉద్యోగం రాదు. అంతలా కష్టపడి సాధించిన ఉద్యోగాన్ని మధ్యలోనే వదులుకుంటారా.. అది కూడా దేవుని సేవ కోసం. చాలా కష్టం కదా. కానీ హరియాణాకు చెందిన ఓ మహిళా ఐపీఎస్ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. మిగతా జీవితాన్ని భగవంతుడి సేవకు అంకితం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆమె నిర్ణయం విన్నవారంతా షాకవుతున్నారు. ఆ వివరాలు.. ప్రస్తుతం హరియాణా అంబాలా రేంజ్లో ఇన్స్పెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా. ఈ క్రమంలో ఆమె తాను స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు భాతరి అరోరా రాష్ట్ర ప్రధాన సలహాదారుకు లేఖ రాశారు. దానిలో "50 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత, ఆల్ ఇండియా సర్వీసెస్ (డీసీఆర్బీ) నిబంధనలు, 1958 లోని రూల్ 16 (2) ప్రకారం, ఆగస్టు 1, 2021 నుంచి సర్వీసు నుంచి పదవీ విరమణ కోరుతూ.. నేను ఈ దరఖాస్తును స్వచ్ఛందంగా సమర్పించాను" అని తెలిపారు. “ఇప్పుడు నేను జీవితం అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. పవిత్ర సాధువులైన గురు నానక్ దేవ్, చైతన్య మహాప్రభు, కబీర్దాస్, తులసీదాస్, సుర్దాస్, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో జీవించాలనుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాంతం అంకితం చేయాలని నేను ఆరాటపడుతున్నాను’’ అని తెలిపారు భారతి అరోరా. ఇక దీనిపై ఫోన్ ద్వారా భారతి అరోరా పీటీఐతో మాట్లాడుతూ, ‘‘నా ఉద్యోగం అంటే నాకు ఎంతో గౌరవం, ఆసక్తి. ఇప్పటికే 23 ఏళ్లుగా విధులు నిర్వహించాను. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పయణించాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని భావిస్తున్నాను’’ అని తెలిపారు. ఐపీఎస్ అధికారిగా పని చేసిన భారతి అరోరా 2007 సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలు పేలుడు కేసును దర్యాప్తు చేశారు. అప్పుడు ఆమె పోలీసు సూపరింటెండెంట్‌గా (రైల్వే) విధులు నిర్వహించారు. పోలీసు పరిపాలనలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను ఏప్రిల్ 2021 లో కర్నాల్ నుంచి అంబాలా రేంజ్‌కు బదిలీ చేశారు. భారతి తన లేఖలో “నా సేవ పట్ల నేను ఎంతో గర్విస్తున్నాను. నాకు సేవ చేయడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి అవకాశం కల్పించినందుకు ఈ సేవకు నేను చాలా కృతజ్ఞతలు. నాకు సరైన మార్గాన్ని చూపించినందుకు హరియాణా రాష్ట్రానికి నా కృతజ్ఞతలు. నా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని ఆగస్టు 1 నుంచి స్వచ్ఛందంగా సేవ నుంచి విరమించుకునేందుకు నన్ను అనుమతించమని నేను కోరుతున్నాను” అన్నారు. -
ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. విధుల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఆయనను నియమించింది. సంచలనాలు, సంస్కరణలకు చిరునామా అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ– మెయిల్ ద్వారా సమాచారం అందించారు. సోమవారం ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రవీణ్‌కుమార్ కరీంనగర్, అనంతపూర్ జిల్లాలకు ఎస్పీగా, హైదరాబాద్‌లో డీసీపీ (క్రైమ్), జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్), తర్వాత గురుకుల సొసైటీకి కార్యదర్శిగా పనిచేశారు. కరీంనగర్ ఎస్పీ (2001 నుంచి 2004)గా పనిచేయడం ఆయనకు చాలా గుర్తింపు తెచ్చింది. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేస్తూనే, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్న గ్రామంలోనే ఉండాలంటూ ఆయన ఇచ్చిన నినాదం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రులను ఎంతగానో ప్రభావితం చేసింది. ‘గురువా మా ఊర్లోనే ఉండు..’అన్న నినాదం జిల్లావ్యాప్తంగా ఉద్యమంగా మారింది. భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. -
బీఎస్ఎన్ఎల్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు తగ్గించుకుంది. రూ. 7,441 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2019–20)లో దాదాపు రూ. 15,500 కోట్ల నికర నష్టం నమోదైంది. ప్రధానంగా ఉద్యోగుల వేతన వ్యయాలు క్షీణించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. 78,569 మంది ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ చేపట్టిన నేపథ్యంలో వేతన వ్యయాలు తగ్గినట్లు తెలియజేశారు. కాగా.. మొత్తం ఆదాయం మాత్రం దాదాపు 2 శాతం నీరసించి రూ. 18,595 కోట్లకు చేరింది. 2019–20లో రూ. 18,907 కోట్ల ఆదాయం సాధించింది. మార్చికల్లా కంపెనీ నెట్‌వర్త్ రూ. 59,140 కోట్ల నుంచి రూ. 51,687 కోట్లకు వెనకడుగు వేసింది. కంపెనీ నికర రుణ భారం రూ. 21,675 కోట్ల నుంచి రూ. 27,034 కోట్లకు పెరిగింది. -
నా బదిలీకి నిర్మలా పట్టుబట్టారు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి పని చేయడం కష్టమని ఆ శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ శనివారం బ్లాగ్‌లో పేర్కొన్నారు. తనను ఆర్థిక శాఖ నుంచి బదిలీ చేయాలంటూ ఆమె పట్టుబట్టారని తెలిపారు. స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) చేసిన ఏడాది తర్వాత అందుకు గల కారణాలను ఆయన బహిర్గతం చేశారు. తన బ్లాగ్ పోస్టులో పలు అంశాలను ప్రస్తావించారు. నిర్మలా సీతారామన్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టమని తాను భావించానని, అందుకే వీఆర్ఎస్ తీసుకున్నానని వివరించారు. ఆమెతో తనకు కలిసి రాలేదన్నారు. ఆమె తన బదిలీ కోరేకంటే ముందే తమ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కాకుండా మరో శాఖలో పనిచేయాలని తాను భావించలేదని పేర్కొన్నారు. దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పోలిస్తే నిర్మలది భిన్నమైన వ్యక్తిత్వమని, అరుణ్ జైట్లీతో పనిచేయడం తనకు వృత్తిపరంగా సంతృప్తినిచ్చిందన్నారు. -
ముందస్తు రిటైర్మెంట్లా ఉంది
లాక్డౌన్ లైఫ్ ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నట్టుగా అనిపిస్తోంది అంటున్నారు రెజీనా. కొన్ని నెలలుగా ఎటూ కదలకుండా తన అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు రెజీనా. ఈ లాక్డౌన్ గురించి రెజీనా మాట్లాడుతూ – ‘‘యాక్టర్‌గా బిజీ షెడ్యూల్ వల్ల పెట్ని పెంచుకోవాలనుకున్నా కుదర్లేదు. ఈ ఖాళీ సమయంలో ఓ కుక్కపిల్లను పెంచుకున్నాను. అలాగే మా అపార్ట్మెంట్ వాళ్లతో ఎక్కువ సమయం గడిపే వీలు దొరికింది. మా ఇంటి పక్కన ఉన్న చిన్న పిల్లలతో చాలా ఎక్కవ సమయం గడిపాను. చాలా గేమ్స్ ఆడుకున్నాం. మా ఆపార్ట్మెంట్ లోపలే కలసి డిన్నర్ చేస్తుంటాం. సినిమాలు చూస్తుంటాం. లేట్ నైట్ కార్డ్స్ ఆడేవాళ్లం. నా పెట్ బెల్లాతో సాయంత్రాలు వాకింగ్‌కి వెళుతున్నాను. ఇవన్నీ నా రిటైర్మెంట్ తర్వాత జరుగుతాయనుకున్నాను. కానీ ఈ లాక్డౌన్ చిన్న వయసులోనే ముందస్తు రిటైర్మెంట్ ఫీలింగ్‌ను తెచ్చింది’’ అన్నారు. -
అసమర్థ ఉద్యోగులను పంపేయండి
న్యూఢిల్లీ: ముప్పయ్యేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులందరి సర్వీసు రికార్డులను మదింపు చేయాలని, అసమర్థ, అవినీతి అధికారులకు ముందస్తు రిటైర్మెంటు ఇచ్చి ఇంటికి పంపేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1972 కింద 56 (జె), 56 (ఐ), 48 (1)(బి) నిబంధనల ప్రకారం... ఉద్యోగి పనితీరును పరిశీలించి ప్రజాప్రయోజనాల దృష్ట్యా అతనికి రిటైర్మెంట్ ఇచ్చి పంపే సంపూర్ణ హక్కు సంబంధిత పై అధికారికి ఉంటుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ముందస్తు రిటైర్మెంట్ ‘శిక్ష’కాదని వివరించింది. ఉద్యోగి 50 లేదా 55 ఏళ్లకు చేరుకున్నాక, 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నాక... ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఎప్పుడైనా సదరు ఉద్యోగిని ఇంటికి పంపించవచ్చని పేర్కొంది. ఉద్యోగుల సామర్థ్యాన్ని అంచనా వేసి వారిని సర్వీసులో కొనసాగించడంపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ అవుతుంటాయని, ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల విషయంలో మరింత స్పష్టత ఇవ్వడానికి, అమలులో ఏకరూపత తేవడానికి తాజా ఆదేశాలు జారీచేశామని సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. రిటైర్ చేయదలచుకున్న ఉద్యోగికి మూడు నెలల నోటీసు ఇవ్వాలని, అలాకాని పక్షంలో మూడునెలల వేతనం ఇచ్చి పంపాలని తెలిపింది. 50 లేదా 55 ఏళ్లకు చేరుకుంటున్న, 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకోబోతున్న ఉద్యోగులందరి వివరాలతో కూడిన రిజిస్టర్‌ను ప్రతిశాఖలో నిర్వహించాలని, ఏడాదికి నాలుగుసార్లు ఈ జాబితాను మదింపు చేయాలని ఆదేశించింది. డిజిటల్ లాకర్లోకి పెన్షన్ ఆర్డర్ రిటైరయ్యే ఉద్యోగులకు పెన్షన్‌కు సంబంధించిన పత్రాల కోసం నిరీక్షించే బాధ తప్పనుంది. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీవో)ను ఎలక్ట్రానిక్ రూపంలో ఇకపై నేరుగా ఉద్యోగుల డిజిటల్ లాకర్‌కు పంపనున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం వెల్లడించారు. పెన్షన్ ప్రక్రియలో ఇక ఆలస్యానికి తావుండదని, అలాగే పెన్షన్ ఆర్డర్ పత్రాలను పోగొట్టుకునే ప్రమాదం ఉండదని మంత్రి తెలిపారు. పౌరులు తమకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలన్నింటినీ ఎలక్ట్రానిక్ రూపంలో దాచుకోవడానికి డిజిటల్ లాకర్ ఉపకరిస్తుంది. -
92 వేలకు పైగా వీఆర్ఎస్ దరఖాస్తులు
న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) ఎంచుకున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగుల సంఖ్య ఇప్పటికి 92,000 దాటిందని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. రెండు సంస్థల ఉద్యోగుల నుంచీ ఈ పథకం పట్ల విశేష స్పందన కనిపిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. బీఎస్ఎన్ఎల్కు సంబంధించి నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో ప్రస్తుతం దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది ఈ పథక ప్రయోజనం పొందడానికి అర్హులు. 70,000 నుంచి 80,000 మంది ఈ పథకాన్ని ఎంచుకుంటారని, దీనివల్ల దాదాపు రూ.7,000 కోట్ల వేతన బిల్లు భారం తగ్గుతుందని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. కేంద్రం అందిస్తున్న పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం బీఎస్ఎన్ఎల్ తమ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్ఎల్ బీఎస్ఎన్ఎల్కు కొద్ది రోజుల ముందే తమ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. రెండు కంపెనీల రుణభారం రూ. 40,000 కోట్ల పైగా ఉంది. -
35 వేల మందికి వీఆర్ఎస్
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ పలు వ్యయ నియంత్రణ చర్యలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఎల్టీసీ తదితర ప్రయోజనాలను తాత్కాలికంగా నిలిపివేసింది. 35,000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) అమలు చేయాలని భావిస్తోంది. సంస్థ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ ఈ విషయాలు తెలియజేశారు. వ్యయ నియంత్రణ చర్యలతో గతేడాది దాదాపు రూ. 2,500 కోట్ల మేర ఆదా చేయగలిగామని, ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఆ స్థాయి కొనసాగించాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇందులో ఉద్యోగులకు ఎల్టీసీ మొదలైన వాటి రూపంలో ఇచ్చే ప్రయోజనాల విలువ సుమారు రూ. 625 కోట్ల మేర ఉంటుందన్నారు. సాధారణంగా ప్రైవేట్ రంగ టెల్కోల్లో 25,000– 30,000 మంది ఉద్యోగులు ఉంటుండగా, బీఎస్ఎన్ఎల్లో దానికి దాదాపు అయిదు రెట్లు అధికంగా 1.8 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరి వ్యయాలు వార్షికంగా రూ.15,000 కోట్ల స్థాయిలో ఉంటున్నాయి. ‘విద్యుత్, అడ్మినిస్ట్రేషన్ పరమైన వ్యయాలను తగ్గించుకుంటున్నాం. అలాగే ఉద్యోగులకిచ్చే ప్రయోజనాలను ఫ్రీజ్ చేస్తున్నాం. ప్రస్తుతానిౖMðతే ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) మొదలైన ప్రయోజనాలు అందించడం లేదు. అలాగే వైద్య చికిత్స వ్యయాలను కూడా నియంత్రిస్తున్నాం‘ అని శ్రీవాస్తవ తెలియజేశారు. పునర్వ్యవస్థీకరణపై నివేదిక.. కంపెనీ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఐఐఎం అహ్మదాబాద్ రూపొందించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు, త్వరలో తుది నివేదిక ఇవ్వనున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. రూ.13,000 కోట్ల వ్యయంతో సుమారు 35,000 మందికి వీఆర్ఎస్ ఆఫర్ చేసే ప్రతిపాదన కూడా ఈ సిఫార్సుల్లో ఉన్నట్లు ఆయన చెప్పారు. వీఆర్ఎస్ ప్యాకేజీకి కావాల్సిన నిధులను సమీకరించుకునే విధానంపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సాయం కోరడం లేదా తక్కువ వడ్డీకి రుణాల రూపంలో సమకూర్చుకోవడం వంటి అంశాలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. వ్యయ నియంత్రణ చర్యలపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. వాస్తవానికి అదృష్టవశాత్తూ కంపెనీని నిలబెట్టేందుకు సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ టెల్కోలతో పోటీపడలేక నానా తంటాలు పడుతున్న బీఎస్ఎన్ఎల్కు 2016లో రిలయన్స్ జియో రాకతో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
వివాదాస్పదంగా మారిన అశోక్ బాబు వీఆర్ఎస్
సాక్షి, విజయవాడ : ఏపీ ఎన్జీవో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) వివాదాస్సందంగా మారింది. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ల వ్యవహారంలో అశోక్ బాబుకు విచారణాధికారి క్లీన్ ఎక్విడిక్ట్ ఇవ్వడంపై ఎన్జీవో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లీన్ ఎక్విడిక్ట్ను అడ్డుపెట్టుకొని అశోక్‌బాబు వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు వీఆర్ఎస్ ఇవ్వడం నిబంధనలకు విరుద్దమని కమర్షియల్ టాక్స్ ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ మేరకు కమర్షియల్ టాక్స కమిషనర్‌కు ఎన్జీవో నేతలు ఫిర్యాదు చేశారు. అశోక్ బాబుపై పలు కేసులు పెడింగ్‌లో ఉన్నాయని డీసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెన్షన్ రూల్ 44 ప్రకారం అశోక్‌కు వీఆర్ఎస్ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. -
హోదాపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ
సాక్షి, గుంటూరు: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మహారాష్ట్ర మాజీ అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇందు కోసం తన ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేశారా? అన్న ఊహాగానాలకు ఫుల్స్టాప్ పడింది. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదని లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. అయితే అప్పటిలోగా తాను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకున్నాక, తన ప్రణాళికను వెల్లడిస్తానన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే సంజీవనిగా భావించే ప్రత్యేక హోదా రాష్ట్రానికి చాలా అవసరమని పేర్కొన్నారు. హోదా వస్తేనే కంపెనీలు ఇక్కడికి తరలివచ్చి రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఐపీఎస్ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. కర్లపాలెం మండలం యాజిలీలో అభయ ఫౌండేషన్ చైర్మన్ బాలచందర్, ఫార్మా ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ ఇక్కుర్తి లక్ష్మి నరసింహాలు సంయుక్తంగా ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. లాభసాటి వ్యవసాయంపై రైతులతో ముఖాముఖీలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల కోసం ఓ మంచి కార్యక్రమం యాజిలీలో ప్రారంభించడం అదృష్టం. రైతుల కోసం ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ ప్రయత్నం అభినందనీయం. యాజిలీ లాంటి జెడ్పీ హైస్కూల్‌ను నేనెక్కడా చూడలేదు. తనకు సున్నా మార్కులు వస్తున్నా.. ప్రజలకు వంద మార్కులు తెచ్చేందుకు రైతన్న ప్రయత్నం చేస్తాడు. ఎన్ఆర్డీఎస్ సంస్థలో పని చేస్తానని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదు. వాళ్లను వేడుకోవడం కంటే ఉద్యోగం మానేస్తే నాకు నచ్చిన చోట పనిచేయవచ్చునని వీఆర్ఎస్ తీసుకున్నా. నేను రేపు వ్యవసాయశాఖ మంత్రి అయితే రైతులకు ఏం చేయాలో ఆలోచిస్తాను. మంత్రిని కాకపోతే సామాజిక కార్యకర్తగా పనిచేస్తా. రైతులకు 200 మార్కులు వచ్చేలా మేం కృషి చేస్తాం. ముందు మేం ఉంటాం. మా వెంట మీరు నడవండంటూ లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. -
రాజకీయాల్లోకి ఐపీఎస్ లక్ష్మీనారాయణ!
సాక్షి, హైదరాబాద్: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మహారాష్ట్ర అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇందు కోసం తన ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేయనున్నారా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాలే వస్తున్నాయి. లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునేందుకు గురువారం మహారాష్ట్ర డీజీపీ నుంచి అనుమతి పొందినట్టు తెలిసింది. ఆయన పదవీ విరమణ లేఖను ఆ రాష్ట్ర సీఎస్‌కు అందజేసినట్టు లక్ష్మీనారాయణ సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో రాజకీయాల్లోకి వస్తారంటున్నారు. మహారాష్ట్ర కేడర్ నుంచి..: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన లక్ష్మీనారాయణ 1990లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఆయన ఆ రాష్ట్రంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎస్పీగా, సీబీఐ హైదరాబాద్ రేంజ్ జాయింట్ డైరెక్టర్‌గా, థానే జాయింట్ కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పదోన్నతి పొంది మహారాష్ట్ర పోలీసు శాఖ అదనపు డీజీపీగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ హోదాలో వీఆర్ఎస్ తీసుకుంటున్నారు. అటు మహారాష్ట్ర కేడర్‌తోపాటు ఇటు ఏపీ, తెలంగాణ క్యాడర్లలో ఉన్న ఐపీఎస్‌లలో జరుగుతున్న చర్చను బట్టి... లక్ష్మీనారాయణ బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లక్ష్మీనారాయణ స్నేహితులు కొందరు బీజేపీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు ఏపీలోని ఆయన చిన్ననాటి స్నేహితులు మాత్రం ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీ పెడతారని అంటున్నారు. గుంటూరుకు చెందిన లక్ష్మీనారాయణ స్నేహితుడొకరు మాత్రం ఆయన ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్‌తో జతకడతారని, త్వరలోనే జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మొత్తంగా లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారని చెబుతున్నారు. దీనిపై మీడియా వర్గాలు లక్ష్మీనారాయణను సంప్రదించగా... తాను వీఆర్ఎస్ తీసుకుంటున్నది నిజమేనని, తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో వెల్లడిస్తానన్నారు. -
బ్యూరోక్రాట్ల వీఆర్ఎస్ నిబంధనల్లో మార్పులు
న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు సంబంధించిన నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. వీఆర్ఎస్ కోసం బ్యూరోక్రాట్లు పెట్టుకున్న విజ్ఞప్తిని ఎక్కువ కాలం పెండింగ్‌లో పెట్టకుండా, నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా మార్పులు తెచ్చింది. ఒకవేళ నిర్దేశిత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించకపోతే.. అప్పట్నుంచే వారి స్వచ్ఛంద పదవీ విరమణ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలను డీఓపీటీ విడుదల చేసింది. -
సాక్షరభారత్ డిప్యూటీ డైరెక్టర్ స్వచ్ఛంద పదవీ విరమణ
సిబ్బంది వ్యవహారమే కారణం? అనంతపురం ఎడ్యుకేషన్ : సాక్షరభారత్ మిషన్ (వయోజన విద్య) ఉప సంచాలకులు భోజరాజు స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఈయనకు ఇంకా 20 నెలల సర్వీస్ ఉంది. అయినా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయడం చర్చనీయాంశమైంది. స్వచ్ఛందవిరమణకు అనుమతి ఇవ్వాలని గతంలో దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన భోజరాజు ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీఓ)గా జిల్లాకు వచ్చారు. గతంలో డీడీగా పని చేస్తున్న ఈశ్వరయ్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత డీడీ ఎఫ్ఏసీగా ఆయనకే బాధ్యతలు ఇచ్చారు. 2015 డిసెంబరులో డీడీగా రెగ్యులర్ అయింది. అప్పటి నుంచే ఆయనే కొనసాగుతున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడంతో పీఓగా పని చేస్తున్న సలీంకు ఎఫ్ఏసీగా బాధ్యతలు అప్పగించారు. ఇదిలాఉండగా వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నట్లు భోజరాజు చెబుతున్నా...అంతర్గతంగా మాత్రం తాను పని చేస్తున్న చోట పడుతున్న ఇబ్బందులు తాళలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిబ్బందిలో మార్పు రాకపోవడం... తనకు ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనన్న భయంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడేందుకు ‘సాక్షి’ ఫోన్ చేయగా...‘నేను నిజాయితీ కుటుంబం నుంచి వచ్చాను. ఉద్యోగ విరమణ చేయడం ద్వారా నాకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తాను. ఇంతకు మించి నన్నేమి అడగవద్దు’ అని సమాధానమిచ్చారు. -
సీఎం భార్య రిటైర్మెంట్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య, భారత రెవెన్యూ సర్వీస్ అధికారిణి సునీత స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేశారు. వీఆర్ఎస్ కోరుతూ ఈ ఏడాది మొదట్లో సునీత దరఖాస్తు చేయగా, సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఇందుకు అనుమతిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయపన్ను శాఖలో సునీత దాదాపు 22 ఏళ్ల పాటు పనిచేశారు. సునీత చివరిసారిగా ఢిల్లీలోని ఐటీఏటీలో ఐటీ కమిషనర్ హోదాలో విధులు నిర్వహించారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ కూడా గతంలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. కేజ్రీవాల్ ఉద్యోగానికి రాజీనామా చేసి తొలుత ప్రజాఉద్యమకర్త అన్నా హజారే బృందంతో కలసి ఉద్యమించారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. -
నాడు వీఆర్వో.. నేడు రియల్ ఎస్టేట్ వ్యాపారి!
ఇబ్రహీంపట్నం: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన మాజీ వీఆర్వో బెహరా సీతారామయ్య ఇంటిపై గురువారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 22 లక్షల రూపాయల నగదు, ప్రామిసరీ నోట్లు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, భారీ ఎత్తున బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీఆవ్వోగా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీతారామయ్య ప్రస్తుతం రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇబ్రహీంపట్నంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ డీసీపీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. -
నేను వెళ్లిపోతా.. ఓ జడ్జి ఆవేదన
తిరువనంతపురం: సోలార్ స్కాంపై కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆవేదన చెందిన విజిలెన్స్ కోర్టు జడ్జి జస్టిస్ వాసన్ వాలంటరీ రిటైర్మెంట్ (స్వచ్ఛంద పదవీ విరమణ) వైపు మొగ్గు చూపుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా విజిలెన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ హైకోర్టు రెండు నెలల స్టే విధించిన కొన్ని గంటల్లోనే వాసన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రి అరయదాన్ మహ్మద్‌పై సోలార్ స్కాంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విజిలెన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. విజిలెన్స్ కోర్టు తన అధికారాల విస్తృతి, కేసు తీరు గురించి తెలుసుకోకుండా మెకానికల్‌గా ప్రవర్తించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో కలత చెందడం వల్లే జడ్జి వాసన్ వాలంటరీ రిటైర్మెంట్ అంటున్నారని తెలుస్తోంది. ప్రైవేటు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతించేందుకు సీఎం ఊమెన్ చాందీకి తాము భారీ మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు సరితా నాయర్ తదితరులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే సీఎంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కేరళ విజిలెన్స్ కోర్టు ఆదేశించింది.