
న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్) ఎంచుకున్న బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ ఉద్యోగుల సంఖ్య ఇప్పటికి 92,000 దాటిందని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. రెండు సంస్థల ఉద్యోగుల నుంచీ ఈ పథకం పట్ల విశేష స్పందన కనిపిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో ప్రస్తుతం దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది ఈ పథక ప్రయోజనం పొందడానికి అర్హులు.
70,000 నుంచి 80,000 మంది ఈ పథకాన్ని ఎంచుకుంటారని, దీనివల్ల దాదాపు రూ.7,000 కోట్ల వేతన బిల్లు భారం తగ్గుతుందని బీఎస్‌ఎన్‌ఎల్ భావిస్తోంది. కేంద్రం అందిస్తున్న పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్ తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ప్రకటించింది. నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్‌ఎల్ బీఎస్‌ఎన్‌ఎల్‌కు కొద్ది రోజుల ముందే తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ప్రకటించింది. రెండు కంపెనీల రుణభారం రూ. 40,000 కోట్ల పైగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment