సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ కొత్త టెలికాం విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. జాతీయ టెలి కమ్యూనికేషన్ పాలసీ 2018ని బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ(ఎన్‌డీసీపీ) 2018 త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది. 40 లక్షల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని రూపొందించామని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. సెకనుకు 50 మెగా బిట్స్(ఎంబీపీఎస్) వేగం, అందరికీ సె బ్రాడ్ బాండ్ సేవలను అందించేలా ఈ కొత్త విధానాన్ని డిజైన్ చేసినట్టు చెప్పారు.
కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వవ్యాప్తి, స్థితిస్థాపకంగా, సురక్షితమైన, సరసమైన డిజిటల్ కమ్యూనికేషన్ సేవలను అందించాలనేది తమ లక్ష్యమని కేంద్ర సమాచార మంత్రి తెలిపారు. అంతేకాదు టెలికాంరంగంలో పెట్టుబడులను పెంచడంతో పాటు 5జీ టెక్నాలజీ సాయంతో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను మెరుగుపర్చడం, అందుబాటు ధరల్లో సేవలను తీసుకురావడమే లక్ష్యమన్నారు.
2020నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక మెగా బిట్స్(ఎంబీపీఎస్)వేగంతో, 2022నాటికి 10మెగా బిట్స్ వేగంతో బ్రాడ్‌బాండ్ సేవలను విస్తరించనున్నామన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించనున్నట్టు సిన్హా వెల్లడించారు. తద్వారా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో భారత్‌ను టాప్ 50దేశాల్లో ఒకటిగా నిలపాలని యోచిస్తున్నట్లు సిన్హా పేర్కొన్నారు. 2017లో 134 దేశాలతో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ ఆవిర్భవించింది.
Comments
Please login to add a commentAdd a comment