సాంకేతిక విప్లవంలో భారత్ మరికొద్ది రోజుల్లో కీలక ముందడుగు వేయబోతోంది. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే 5జీ టెక్నాలజీలోకి ఇప్పటికే అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఇతర సేవలందించేలా స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ మే 20న ప్రారంభం కాబోతోంది.
ఈ ప్రక్రియ పూర్తయిన కొన్ని నెలల్లోనే దేశంలో అత్యంత వేగవంతమైన టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాంకేతికంగా దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు సంభవించబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 2జీ, 3జీ, 4జీ, 5జీ సాంకేతికల్లో తేడాలెందుకో ఈ కథనంలో తెలుసుకుందాం.
మొదట్లో సెల్‌ఫోన్ బరువు కేజీ ఉండేది. తర్వాత కీ ప్యాడ్ ఫోన్ వచ్చింది. తర్వాత మడత పెట్టే ఫోన్లూ వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో ఫోన్లు స్మార్ట్‌గా మారిపోయాయి. ఒకప్పుడు ఫోన్లు కేవలం కాల్స్ మాట్లాడడానికి మాత్రమే.. కానీ ఇప్పటి స్మార్ట్‌ఫోన్లతో దాదాపు అన్ని రకాల పనులూ చక్కెబెట్టేయొచ్చు. అలాగే టెలికాం కమ్యూనికేషన్ రంగంలోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. అలా తొలి తరం నెట్‌వర్క్‌ను 1జీ అనే వారు. ఇక్కడ G అంటే జనరేషన్ అని అర్థం. ఈ నెట్‌వర్క్‌లో కేవలం ఫోన్లు మాట్లాడడానికి మాత్రమే పరిమితం. ఆ తర్వాత తరాన్ని బట్టి ఇంటర్నెట్ అందించే వేగంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం 4జీ, 5జీ విస్తృత వినియోగంలో ఉన్నాయి.
ఏ తరం దేనికి?
1G: 1970ల్లో జపాన్‌లో తొలి తరం మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. ఈ తరంలో కేవలం ఫోన్లు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉండేది. సౌండ్ క్వాలిటీ కూడా అంతంత మాత్రమే.
2G: టెలికాం రంగంలో చెప్పుకోదగ్గ మార్పు ఉన్న నెట్‌వర్క్ 2జీ. 1991లో ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. తొలిసారి ఎస్సెమ్మెస్, ఎంఎంఎస్ అనేవి ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. డేటా వేగం గరిష్ఠంగా 50 కేబీపీఎస్ మాత్రమే.
3G: 2001లో ఈ సాంకేతికత పరిచయం అయ్యింది. మనం ఇప్పుడు వాడుతున్న చాలా సదుపాయాలు ఈ సాంకేతిక నుంచి మొదలైనవే. వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్, వీడియో కాలింగ్, వెబ్ బ్రౌజింగ్ వంటి సదుపాయాలు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యాయి.
4G: దేశంలో చాలా వరకు వాడుకలో ఉన్న నెట్‌వర్క్ ఇదే. వేగవంతమైన డేటా, వీడియో స్ట్రీమింగ్, వీడియో కాలింగ్ వంటి సదుపాయాలు ఈ నెట్ వర్క్ సొంతం. ముఖ్యంగా జియో రాకతో చాలా వరకు 2జీ, 3జీ దాదాపు కనుమరుగైనప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఈ నెట్‌వర్క్ వాడుతున్నారు.
5G: ఇప్పటికే ఈ టెక్నాలజీ కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నా పూర్తిస్థాయిలో ఇంకా దాన్ని వినియోగించట్లేదు. 4జీ కంటే కొన్ని రెట్ల వేగంతో ఇంటర్నెట్ పనిచేస్తుంది. 4జీలో ఒక సినిమా డౌన్‌లోడ్ కావాలంటే కొన్ని నిమిషాలు పడితే.. ఇందులో రెప్పపాటులోనే అల్ట్రా హెచ్‌డీ సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: రూ.96వేల కోట్ల స్పెక్ట్రమ్ వేలానికి తేదీ ఖరారు.. అసలు స్పెక్ట్రమ్ అంటే..
ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే వీఆర్, ఏఆర్ సాంకేతికతలో వేగం పెరగనుంది. భద్రతతో కూడిన రవాణా వ్యవస్థ, రిమోట్ ప్రాంతాలకు ఆరోగ్యసేవలు, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, సరకు రవాణాలో డిజిటల్ సేవలు వంటి ఎన్నో అంశాల్లో 5జీ కీలకం కానుంది. రిమోట్ ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment