4జీ, 5జీపై రూ. 30,000 కోట్ల వ్యయం
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజాగా భారీ కాంట్రాక్టులకు తెరతీసింది. 4జీ, 5జీ నెట్‌వర్క్ పరికరాల కొనుగోలు కోసం రూ. 30,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చింది. మూడేళ్లలో వీటిని సరఫరా చేసేందుకు దిగ్గజాలు నోకియా, ఎరిక్‌సన్, శామ్‌సంగ్‌లను ఎంపిక చేసుకుంది. వెరసి ఈ ఏడాది భారీ ఆర్డర్లను ఇచ్చిన టెలికం ఆపరేటర్‌గా వొడాఫోన్ ఐడియా నిలిచింది.
మూడేళ్ల కాలంలో 6.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 55,000 కోట్లు) పెట్టుబడులు వెచి్చంచేందుకు కంపెనీ ప్రణాళికలు వేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా తొలి దశ కింద తాజా కాంట్రాక్టులకు తెరతీసింది. మూడేళ్లలో 4జీ, 5జీ కవరేజీకి వీలుగా నోకియా, ఎరిక్‌సన్, శామ్‌సంగ్‌లు పరికరాలు సరఫరా చేయవలసి ఉంటుందని వొడాఫోన్ ఐడియా ప్రకటన పేర్కొంది.
సరఫరాలు డిసెంబర్ క్వార్టర్ నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. తద్వారా 4జీ కవరేజీని 1.03 బిలియన్ నుంచి 1.2 బిలియన్ల జనాభాకు పెంచడం, కీలక మార్కెట్లలో 5జీ సేవలను ప్రవేశపెట్టడం, డేటా వినియోగానికి అనుగుణంగా సామర్థ్యాన్ని విస్తరించడం చేపట్టనున్నట్లు తెలియజేసింది. తొలుత 4జీ కవరేజీని 120 కోట్ల మందికి చేరువ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది.
వీఐఎల్ 2.0కు శ్రీకారం...
వీఐఎల్ 2.0 పేరుతో పెట్టుబడుల ప్రక్రియను ప్రారంభించినట్లు వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా తెలియజేశారు. నోకియా, ఎరిక్‌సన్ కంపెనీ ప్రారంభం నుంచి భాగస్వాములుకాగా.. తాజాగా శామ్‌సంగ్‌తో ప్రయా ణం ప్రారంభించడం ప్రోత్సాహకర అంశమని వ్యాఖ్యానించారు.
2018లో ఐడియా సెల్యులర్‌తో విలీనం అనంతరం వొడాఫోన్ ఐడియాగా ఏర్పాటైనప్పుడు 40.8 కోట్లమంది కస్టమర్లతో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా అవతరించింది. అయితే ఆపై జియో, ఎయిర్‌టెల్‌తో ఎదురైన తీవ్ర పోటీలో వెనకబడటంతో ప్రతీ నెలా కస్టమర్ల సంఖ్య తగ్గుతూ వచి్చంది. ప్రస్తుతం వీఐఎల్ వినియోగదారుల సంఖ్య 21.5 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment