దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2022-23లో ప్రైవేట్ సంస్థల ద్వారా 5జీ సాంకేతికతను దేశంలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ 5జీ టెక్నాలజీ వల్ల కేంద్రానికి ఈ ఏడాది భారీగా ఆదాయం రానున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో నిర్వహించిన 4జీ స్పెక్ట్రమ్ వేలం వల్ల ప్రభుత్వానికి రూ.77,800 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ సంవత్సరంలో నిర్వహించే 5జీ స్పెక్ట్రమ్ వేలం వల్ల కేంద్రానికి ఎంత ఆదాయం రావచ్చు అనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.
5జీ టెక్నాలజీ మీద డెలాయిట్ ఇండియా భాగస్వామి & టెలికామ్ సెక్టార్ లీడర్ పీయూష్ వైష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 5జీ రోల్ అవుట్ అనేది ఇతర మునుపటి తరం టెక్నాలజీల కంటే చాలా వేగంగా జరుగుతుందని అన్నారు. "ఆర్థిక మంత్రి 2025 నాటికి అన్నీ గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్ చేరవేస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ తెలిపారు. డిజిటల్ విశ్వవిద్యాలయాలతో సహా డిజిటల్ విద్యపై కేంద్రం దృష్టి సారించడం వల్ల దేశవ్యాప్తంగా హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ అవసరాన్ని మరింత పెరుగుతుంది" అని ఆయన అన్నారు.
ఈ ఏడాది 5జీ స్పెక్ట్రమ్ వేలం వల్ల ఆదాయం రూ.1.25 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని లేదా గతంతో పోలిస్తే(4జీ స్పెక్ట్రమ్ వేలం) 60 శాతానికి పైగా జంప్ కావచ్చని చోక్సీ సెక్యూరిటీస్ ఎండి దేవన్ చోక్సీ చెప్పారు. ఈ స్పెక్ట్రమ్ వేలానికి కేవలం సెల్యులార్ ఆపరేటర్ల నుంచి మాత్రమే కాకుండా ఇతరుల నుంచి కూడా పోటీ ఉండనున్నట్లు దేవన్ చోక్సీ తెలిపారు. ఈ స్పెక్ట్రమ్ వేలం కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులను 10 ఏళ్ల వరకు చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ కాలంలో స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిన యజమానికి ఆ పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి తగినంత సమయం ఉండవచ్చు అని ఆశిస్తున్నారు. "ప్రస్తుత ఆపరేటర్ దానిని కొనుగోలు చేసి, అవసరమైన వారికి లీజుకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ సారి 5జీ వేలం గతంతో పోలిస్తే భిన్నంగా ఉండనుంది" అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment