టెలికంకు 'టాటా'?
భారతీ ఎయిర్‌టెల్‌తో విలీనానికి సన్నాహాలు!
♦ టాటా టెలీ, టాటా కమ్యూనికేషన్స్‌తో పాటు
డీటీహెచ్ వ్యాపారాన్ని కూడా కలిపేసే అవకాశం
♦ చర్చలు జరుపుతున్న ఇరు గ్రూప్‌లు...
♦ విలీనం ఇరు సంస్థలకు లాభమేనంటున్న విశ్లేషకులు
♦ ఇదే జరిగితే ఇక మిగిలేవి నాలుగైదు టెలికం సంస్థలే!
(సాక్షి, బిజినెస్ విభాగం)
దేశీ టెలికం రంగంలో మరో మెగా విలీన పర్వానికి తెరలేచింది. భారత కార్పొరేట్ ప్రపంచంలో పేరొందిన టాటా గ్రూప్, భారతీ గ్రూప్‌ల మధ్య భాగస్వామ్యానికి రంగం సిద్ధమవుతున్నట్లు తాజా సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. టాటా గ్రూప్‌లోని టెలికం కంపెనీలన్నింటినీ భారతీ ఎయిర్ టెల్‌లో విలీనం చేయొచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ భారీ విలీనానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు, ఇతరత్రా అంశాలపై ఇరు వర్గాలు ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం.
ఇది సాకారమైతే టెలికం వ్యాపారంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న టాటాలు.. ఈ రంగం నుంచి పూర్తిగా వైదొలగడానికి ఇది మంచి అవకాశమేనన్నది విశ్లేషకుల మాట. మరోపక్క, రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో మార్కెట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న భారతీ ఎయిర్‌టెల్‌కు కూడా ఈ డీల్ కలిసొస్తుందనేది వారి అభిప్రాయం. ఈ వార్తల నేపథ్యంలో టాటా టెలీ షేరు దూసుకుపోయింది. శుక్రవారం బీఎస్‌ఈలో దాదాపు 19 శాతం ఎగబాకింది. చివరకు 17 శాతం లాభంతో రూ.8.56 వద్ద ముగిసింది. ఇక భారతీ ఎయిర్‌టెల్ షేరు 1 శాతం మేర లాభపడి రూ.385 వద్ద స్థిరపడింది.
‘టాటా’ ఎందుకు...
ప్రస్తుతం టాటా గ్రూప్ టెలికం వ్యాపారంలో టాటా టెలీసర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్ ప్రధాన కంపెనీలుగా ఉన్నాయి. టాటా టెలీ సర్వీసెస్ (టీటీఎస్‌ఎల్), టాటా టెలీ (మహారాష్ట్ర) లిమిటెడ్ (టీటీఎస్‌ఎంఎల్)æలు అనేవి టెలికం వ్యాపారాన్ని నిర్వహిస్తుండగా.. టాటా కమ్యూనికేషన్స్ సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ, టెలికంలో ఎంటర్‌ప్రైజ్ సేవలను అందిస్తోంది. టాటా స్కై పేరిట డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) వ్యాపారాన్ని కూడా టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. బ్రిటిష్ టెలికం సంస్థ ‘స్కై’ భాగస్వామ్యంతో టాటాలు దీన్ని ఏర్పాటు చేశారు. ఇక సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎంటర్‌ప్రైజెస్‌కు కూడా భారత్‌లో అతిపెద్ద టెల్కో భారతీ ఎయిర్‌టెల్‌తో పాటు ఎయిర్‌టెల్ డీ2హెచ్ పేరుతో డీటీహెచ్ కంపెనీ ఉంది. ఇరు గ్రూప్‌లకూ టెలికంలో దాదాపు ఒకే విధమైన సేవల విభాగాలు ఉండటంతో ప్రతిపాదిత విలీనం కలిసొస్తుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరోపక్క, గత కొన్నేళ్లుగా టాటా టెలీ యూజర్ల సంఖ్య ఘోరంగా పడిపోతూ వస్తోంది. ట్రాయ్ గణంకాల ప్రకారం గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్యలో ఈ రెండు టాటా టెల్కోలకు చెందిన కోటి మందికిపైగా యూజర్లు ఇతర టెల్కోలకు మారిపోయినట్లు లెక్కతేలుతోంది. మరోపక్క, జపాన్ కంపెనీ డొకోమో భాగస్వామ్యంతో టాటా డొకోమో పేరిట దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న టాటాలకు ఆ కంపెనీతో తలెత్తిన విభేదాలు సద్దుమణిగాయి. టాటా డొకోమో జేవీ నుంచి వైదొలగడానికి డొకోమో చేస్తున్న న్యాయ పోరాటం కొలిక్కివచ్చింది. దీంతో డొకోమో ఇక భారత్‌కు గుడ్‌బై చెప్పేయనుంది. ఈ నేపథ్యంలో తమకు అంతగా కలిసిరాని టెలికం వ్యాపారాన్ని వదిలించుకోడంపై టాటాలు దృష్టిపెట్టినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఇక టాటా టెలీ ఆదాయం వార్షికంగా రూ.9,500 కోట్లు కాగా, రూ.30 వేల కోట్ల మేర రుణ భారం ఉంది. ఏటా రూ.2,500 కోట్లను వడ్డీగా చెల్లించాల్సివస్తోంది.
ఎయిర్‌టెల్‌కు కలిసొస్తుందా?
ప్రస్తుతం భారత్‌లో దాదాపు 30 కోట్ల మంది టెలికం యూజర్లతో భారతీ ఎయిర్‌టెల్ అతిపెద్ద నెట్‌వర్క్‌గా కొనసాగుతోంది. అయితే, తాజాగా రిలయన్స్ జియో అరంగేట్రం, అది ప్రవేశపెట్టిన చౌక టారిఫ్‌లు, ఉచిత వాయిస్ కాలింగ్‌తో ఇతర టెల్కోల మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో టారిఫ్‌లను తగ్గించుకోవాల్సి వచ్చింది. కంపెనీ మార్జిన్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అంశమిది. దీనికితోడు ఐడియా సెల్యులార్‌తో బ్రిటిష్ దిగ్గజం వొడాఫోన్ ఇండియా విలీనం కారణంగా దేశంలో నంబర్ వన్ టెలికం ఆపరేటర్ స్థానాన్ని కూడా కోల్పోయేందుకు దారితీస్తుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎయిర్‌టెల్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి తరుణంలో టాటా టెలికం వ్యాపారాన్ని విలీనం చేసుకోవడం ఎయిర్‌టెల్‌కు వ్యూహాత్మకంగా సానుకూలాంశమని భావిస్తున్నారు.
ప్రధానంగా టాటా కమ్యూనికేషన్స్‌కు ఉన్న విదేశీ కేబుల్ బిజినెస్, ఎంటర్‌ప్రైజ్ సేవలు ఆసరాతో ఎయిర్‌టెల్ తన ఎంటర్‌ప్రైజ్ విభాగాన్ని అత్యంత పటిష్టం చేసుకోవడానికి వీలవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద సబ్‌మెరైన్ (సముద్రగర్భ) ఫైబర్‌ఆప్టిక్ నెట్‌వర్క్ టాటా కమ్యూనికేషన్స్ సొంతం. ప్రపంచంలోని మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లలో 70 శాతం దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇదేకాకుండా డీటీహెచ్ విభాగంలో దేశంలో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించేందుకు టాటా స్కై, ఎయిర్‌టెల్ డీ2హెచ్ విలీనం వీలుకల్పిస్తుంది. వీడియోకాన్ డీ2హెచ్‌ను విలీనం చేసుకున్న డిష్ టీవీ ప్రస్తుతం 45 శాతం మేర వాటాతో దేశంలో నంబర్‌వన్ స్థానంలో ఉంది. అంతేకాకుండా టాటా స్కైలో విదేశీ ఇన్వెస్టర్లయిన ట్వంటీఫస్ట్ సెంచురీ ఫాక్స్, టెమాసెక్ హోల్డింగ్స్ కూడా ఈ విలీనంద్వారా అవసరమైతే తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది.
ఇదీ టెలికం ముఖచిత్రం...
⇔ ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌కు దాదాపు 27 కోట్ల మంది టెలికం యూజర్లు ఉన్నారు. ఆదాయం, సబ్‌స్క్రయిబర్ల ప రంగా 33 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది.
⇔ వొడాఫోన్ ఇండియా మార్కెట్ వాటా 18.5 శాతంగా అంచనా. కస్టమర్ల సంఖ్య దాదాపు 20.5 కోట్లు. దేశంలో నంబర్–2 టెలికం కంపెనీగా కొనసాగుతోంది.
⇔ ఐడియా సెల్యులార్ 17% మార్కెట్ వాటా, 19 కోట్లకుపైగా యూజర్లతో మూడో అతిపెద్ద టెల్కోగా నిలుస్తోంది.
⇔ అయితే, ప్రతిపాదిత ఐడియా–వొడాఫోన్ విలీనం ద్వారా ఆవిర్భవించే కంపెనీ... 40 కోట్ల మేర యూజర్లతో ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టి నంబర్ వన్‌గా ఆవిర్భవిస్తుంది. అంతేకాకుండా ఈ విలీన సంస్థ రూ.80 వేల కోట్ల ఆదాయంతో 43% మార్కెట్ వాటాను దక్కించుకుంటుందని అంచనా.
⇔ ఆదాయపరంగా మార్కెట్ వాటాను కోల్పోకూడదనే ఎయిర్‌టెల్.. టాటా టెలీ విలీనానికి ముందుకొస్తోంది.
⇔ టాటా టెలీ, ఎయిర్‌టెల్ విలీనంతో పాటు రిలయన్స్ జియోతో ఆర్‌కామ్ కూడా విలీనమైతే ప్రైవేటు రంగంలో మూడు, ప్రభుత్వ రంగంలో ఒక (బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్) టెల్కోయే మిగిలే అవకాశం ఉందని లండన్‌కు చెందిన సీసీఎస్ అనే సంస్థ తాజా నివేదికలో పేర్కొంది.
⇔ అప్పటికి మూడు ప్రైవేటు టెలికం కంపెనీలు ఒక్కొక్కటి 30 కోట్లకుపైగా యూజర్లను కలిగి ఉంటాయని, ఇక ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్–ఎంటీఎన్‌లకు 10 కోట్ల మేర యూజర్లు ఉంటారని లెక్కగట్టింది.
మిగిలేవి నాలుగైదే...
⇔ దేశీ టెలికంలో విలీనాలు–కొనుగోళ్లకు ప్రధానంగా ఆజ్యం పోసింది రిలయన్స్ జియో రంగప్రవేశమే. ఇక భారత్‌లో నియంత్రణపరమైన ఇబ్బందులు, కోర్టు కేసులు (స్పెక్ట్రం కుంభకోణం ఇతరత్రా) కారణంగా విదేశీ కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా గుడ్‌బై చెబుతూ వస్తున్నాయి.
⇔ తొలుత అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) రష్యాకు చెందిన సిస్టెమా శ్యామ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత దేశీ సంస్థ ఎయిర్‌సెల్‌తో తన టెలికం వ్యాపారాన్ని విలీనం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
⇔ వొడాఫోన్ కూడా పన్ను సంబంధ కేసుల నేపథ్యంలో భారత్ నుంచి వైదొలగాలని ఎప్పటినుంచో భావిస్తోంది. ఐడియాతో విలీనాన్ని ప్రకటించడం ద్వారా వొడాఫోన్ ఎగ్జిట్ రూట్‌ను ఆశ్రయించింది.
⇔ ఇదిలా ఉండగా... భారతీ ఎయిర్‌టెల్ కూడా ఈ రేసులో తానూ ఉన్నానని రంగంలోకి దూకింది. నార్వేకు చెందిన టెలినార్ భారత్ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ద్వారా టెలినార్ భారత్ నుంచి వైదొలగుతోంది.
⇔ టాటాడొకోమో నుంచి జపాన్ కంపెనీ ఎన్‌టీటీ డొకోమో కూడా బయటికి వెళ్లిపోయేందుకు తాజాగా న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. టాటాలతో విభేధాలకు తెరపడటంతో డొకోమో భారత్‌కు గుడ్‌బై చెప్పనుంది.
⇔ మొత్తంమీద.. ఇక భారత్‌లో విదేశీ టెలికం కంపెనీలన్నీ ప్రత్యక్ష కార్యకలాపాల నుంచి తప్పుకున్నట్టే లెక్క.
⇔ భారత్‌కు నాలుగైదు పెద్ద టెలికం కంపెనీలు ఉంటే చాలని అటు కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్న నేపథ్యంలో ఈ విలీనాలు–కొనుగోళ్లు వేగం పుంజుకోవడం విశేషం.
⇔ తాజా పరిణామాలు కొలిక్కివస్తే.. దేశంలో రానున్న రెండుమూడేళ్లలో నిజంగానే టెలికం కంపెనీలు నాలుగైదుకే (ఐడియా, రిలయన్స్ జియో, ఆర్‌కామ్–ఎయిర్‌సెల్, భారతీ ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్) పరిమితం అయిపోయేందుకు దారితీస్తుంది.