హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ నూతన అధ్యాయానికి సిద్ధం అవుతోంది. 5జీ సేవలను ఆగస్ట్‌లోనే ప్రారంభిస్తున్న ఈ సంస్థ.. 2024 మార్చి నాటికి అన్ని పట్టణాలు, ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సర్వీసులను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ మంగళవారం ప్రకటించారు. ‘5,000 పట్టణాల్లో 5జీ సేవలు అందించేందుకు కావాల్సిన నెట్‌వర్క్ విస్తరణ ప్రణాళిక పూర్తిగా అమలులో ఉంది. ఇది సంస్థ చరిత్రలో అతిపెద్ద రోల్‌అవుట్‌లలో ఒకటి.
మొబైల్ సేవల చార్జీలు భారత్‌లో అతి తక్కువ. టారిఫ్‌లు మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. ఒక్కో యూజర్ నుంచి కంపెనీకి ఆదాయం రూ.183 వస్తోంది. ఇది త్వరలో రూ.200లకు చేరుతుంది. టారిఫ్‌ల సవరణతో ఈ ఆదాయం రూ.300లు తాకుతుంది’ అని తెలిపారు. 900 మెగాహెట్జ్, 1,800, 2,100, 3,300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ బ్యాండ్స్‌లో 19,867.8 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను కంపెనీ దక్కించుకుంది. స్పెక్ట్రమ్ కొనుగోలుకై ఎయిర్‌టెల్ రూ.43,084 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. టెలికం పరికరాల తయారీ కంపెనీలైన ఎరిక్సన్, నోకియా, శామ్‌సంగ్‌తో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది.
900 మెగాహెట్జ్ ద్వారా..
‘భారీ మిడ్ బ్యాండ్ 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ పోటీ సంస్థకు లేదు. ఇది మాకు లేనట్టయితే ఖరీదైన 700 మెగాహెట్జ్ కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఈ బ్యాండ్‌లో భారీ రేడియో ఉపకరణాలను ఉపయోగించాలి. ఇవి ఖర్చుతో కూడుకున్నవే కాదు, కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తాయి. 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌తో పోలిస్తే 700 మెగాహెట్జ్ అదనపు కవరేజ్ ఏమీ ఇవ్వదు. స్టాండలోన్ 5జీ నెట్‌వర్క్స్ కంటే నాన్–స్టాండలోన్ (ఎన్‌ఎస్‌ఏ) 5జీ నెట్‌వర్క్స్ ప్రయోజనాలు అధికం. అదనపు ఖర్చు లేకుండానే ప్రస్తుతం ఉన్న 4జీ టెక్నాలజీని ఉపయోగించి నూతన సాంకేతికత అందించవచ్చు. అలాగే వేగంగా కాల్ కనెక్ట్ అవుతుంది’ అని వివరించారు. జూన్ త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్ కన్సాలిడేటెడ్ నికరలాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అయిదురెట్లకుపైగా పెరిగి రూ.283 కోట్ల నుంచి రూ.1,607 కోట్లకు చేరడం తెలిసిందే. టారిఫ్‌లు పెరగడమే ఈ స్థాయి వృద్ధికి కారణం.
రిలయన్స్ జియో సైతం..
టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో సైతం 5జీలో సత్తా చాటేందుకు రెడీ అయింది. 1,000 ప్రధాన నగరాలు, పట్టణాల్లో నూతన సాంకేతికత పరిచయం చేసేందుకు ప్రణాళిక పూర్తి చేసినట్టు ప్రకటించింది. ఇందుకు కావాల్సిన పరీక్షలు సైతం జరిపినట్టు వెల్లడించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన టెలికం గేర్స్‌ను కంపెనీ వాడుతోంది. ఖరీదైన 700 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను జియో మాత్రమే కొనుగోలు చేసింది. ఈ బ్యాండ్‌లో కవరేజ్ మెరుగ్గా ఉంటుందని జియో ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. యూజర్ భవనం లోపల ఉన్నా కవరేజ్ ఏమాత్రం తగ్గదు అని ఆయన చెప్పారు. ఇతర బ్యాండ్స్‌తో పోలిస్తే 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో కస్టమర్‌కు మరింత మెరుగైన సేవలు లభిస్తాయని వివరించారు.
5000 పట్టణాల్లో ఎయిర్‌టెల్ 5జీ!
Published Wed, Aug 10 2022 3:06 AM | Last Updated on Wed, Aug 10 2022 3:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment