
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం రంగంలో తయారీ వ్యవస్థకు దన్నునిచ్చేందుకు టెలికం శాఖ(డాట్) సన్నాహాలు ప్రారంభించింది. ఈ అంశంలో ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై అవసరమైన సిఫారసులను సిద్ధం చేసేందుకు నాలుగు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. తద్వారా టెలికం తయారీ వ్యవస్థ(ఎకోసిస్టమ్)కున్న అవరోధాలను తొలగించి బలపడేందుకు ప్రోత్సాహాన్నివ్వనుంది. ఈ విషయాలను అధికారిక మెమొరాండం పేర్కొంది. ఈ నెల మొదట్లో టెలికం గేర్ల తయారీ కంపెనీలకు చెందిన 42 మంది చీఫ్‌లతో కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఇందుకు బీజం వేసింది. ఈ సమావేశంలో కంపెనీ చీఫ్‌లు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు అవసరమున్నట్లు మంత్రి భావించారు.
గేర్ తయారీకి బూస్ట్
టాస్క్‌ఫోర్సుల్లో ఒకదాని ద్వారా టెలికం గేర్ తయారీకి దశలవారీ ప్రోత్సాహక కార్యక్రమాన్ని డాట్ సిఫారసు చేస్తోంది. తద్వారా దేశీ సరఫరా చైన్ ఎకోసిస్టమ్‌కు బూస్ట్‌నివ్వాలని యోచిస్తోంది. దీంతో ప్రపంచ సంస్థలను ఆకట్టుకునే ప్రణాళికల్లో ఉంది. తాజా మెమొరాండం ప్రకారం ఈ టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వ రంగ రీసెర్చ్ సంస్థ సీడాట్ సీఈవో ఆర్‌కే ఉపాధ్యాయ్‌ను సహచైర్మన్‌గా ఏర్పాటు చేయనుంది. 2016లో దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు దశలవారీ కార్యక్రమాన్ని నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. తేజాస్ నెట్‌వర్క్స్ సీఈవో సంజయ్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటుకానున్న టాస్క్‌ఫోర్స్ ప్రస్తుత ఎకోసిస్టమ్‌ను అధ్యయనం చేస్తుంది. తదుపరి టెలి కం టెక్నాలజీ అభివృద్ధి నిధి, సెమికాన్ పాలసీ అండ్ పాలసీ ఇంటర్వెన్షన్ వంటి పథకాల ద్వారా 4–5 చిప్ డెవలప్‌మెంట్స్‌కు అవకాశాలను సూచిస్తుంది. తద్వా రా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించనుంది.
కస్టమ్ క్లియరెన్స్‌లపై దృష్టి
మూడో టాస్క్‌ఫోర్స్ కస్టమ్ క్లియరెన్స్, ఎయిర్ కార్గో రవాణా, మౌలికసదుపాయాల అందుబాటుపై పరిశీలన చేపడుతుంది. తద్వారా లీడ్ సమయాన్ని మెరుగుపరచడం, ఉత్పత్తి, అమ్మకాలలో ఇన్వెంటరీని తగ్గించడం, కీలక విమానాశ్రయాలలో ఫ్రీ ట్రేడ్ వేర్‌హౌసింగ్ జోన్ల ఏర్పాటు తదితరాల ద్వారా లాజిస్టిక్స్ సవాళ్లకు చెక్ పెడుతుంది. టెలికం గేర్ తయారీదారుల సమాఖ్య వీవోఐసీఈ(వాయిస్) డైరెక్టర్ జనరల్ ఆర్‌కే భట్నాగర్ అధ్యక్షతన మరో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ టాస్క్‌ఫోర్స్ డిజిటల్ ఇండియా, డేటా సెంటర్లు, రైల్వే ఆధునీకరణ తదితరాలకు అవసరమైన 5జీ ప్రొడక్టుల అభివృద్ధి, తయారీకి దేశీయంగా కొత్త అవకాశాలను గుర్తించనుంది. ఈ టాస్క్‌ఫోర్స్‌లన్నీ 45 రోజుల్లోగా నివేదికలను దాఖలు చేయవలసి ఉంటుందని అధికారిక మెమొరాండం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment