న్యూఢిల్లీ: దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) స్కీము కింద 27 సంస్థలు ఎంపికయ్యాయి. అనుమతి పొందిన వాటిలో డెల్, హెచ్‌పీ, ఫ్లెక్స్‌ట్రానిక్స్, ఫాక్స్‌కాన్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల్లో 95 శాతం కంపెనీలు (23) ఇప్పటికే తయారీకి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మిగతా నాలుగు కంపెనీలు వచ్చే 90 రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించగలవని ఆయన వివరించారు.
‘ఈ 27 దరఖాస్తులతో దాదాపు రూ. 3,000 కోట్ల మేర పెట్టుబడులు రాగలవు. అంతకన్నా ముఖ్యంగా విలువను జోడించే ఉత్పత్తుల తయారీ వ్యవస్థ భారత్ వైపు మళ్లగలదు‘ అని మంత్రి పేర్కొన్నారు. పీసీలు, సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు వంటి ఐటీ హార్డ్‌వేర్ తయారీలో భారత్ దిగ్గజంగా ఎదిగేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. అదనంగా రూ. 3.5 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తుల తయారీకి, ప్రత్యక్షంగా 50,000 మంది .. పరోక్షగా 1.5 లక్షల మంది ఉపాధి పొందడానికి స్కీము దోహదపడగలదని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment