IT hardware
-
27 సంస్థలకు ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీము
న్యూఢిల్లీ: దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీము కింద 27 సంస్థలు ఎంపికయ్యాయి. అనుమతి పొందిన వాటిలో డెల్, హెచ్‌పీ, ఫ్లెక్స్‌ట్రానిక్స్, ఫాక్స్‌కాన్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల్లో 95 శాతం కంపెనీలు (23) ఇప్పటికే తయారీకి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మిగతా నాలుగు కంపెనీలు వచ్చే 90 రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించగలవని ఆయన వివరించారు. ‘ఈ 27 దరఖాస్తులతో దాదాపు రూ. 3,000 కోట్ల మేర పెట్టుబడులు రాగలవు. అంతకన్నా ముఖ్యంగా విలువను జోడించే ఉత్పత్తుల తయారీ వ్యవస్థ భారత్ వైపు మళ్లగలదు‘ అని మంత్రి పేర్కొన్నారు. పీసీలు, సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు వంటి ఐటీ హార్డ్‌వేర్ తయారీలో భారత్ దిగ్గజంగా ఎదిగేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. అదనంగా రూ. 3.5 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తుల తయారీకి, ప్రత్యక్షంగా 50,000 మంది .. పరోక్షగా 1.5 లక్షల మంది ఉపాధి పొందడానికి స్కీము దోహదపడగలదని మంత్రి చెప్పారు. -
110 సంస్థలకు అనుమతులు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వంటి ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు 110 సంస్థలకు కేంద్రం అనుమతినిచి్చంది. యాపిల్, డెల్, లెనొవొ, హెచ్‌పీ ఇండియా సేల్స్, అసూస్ ఇండియా, ఐబీఎం ఇండియా, షావోమీ టెక్నాలజీ ఇండియా, శాంసంగ్ ఇండియా ఎల్రక్టానిక్స్ మొదలైనవి వీటిలో ఉన్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. అనుమతుల కోసం మొత్తం 111 దరఖాస్తులు వచి్చనట్లు వివరించారు. అయితే, ’నిరాకరణ జాబితా’లో ఉన్న ఒక హైదరాబాద్ సంస్థకు మాత్రం అనుమతి లభించలేదని పేర్కొన్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్దిష్ట ఐటీ హార్డ్‌వేర్ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా అనుమతులకు లోబడి దిగుమతి చేసుకునే వెసులుబాటు కలి్పంచింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆథరైజేషన్ విధానం 2024 సెపె్టంబర్ వరకు అమల్లో ఉంటుంది. అక్టోబర్ 31న పరిశ్రమ వర్గాలతో సమావేశమైన డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) అనుమతుల ప్రక్రియ గురించి వివరించారు. ’నిరాకరణ జాబితా’లో ఉన్న సంస్థలకు అనుమతులు లభించవు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ ఎగుమతి నిబంధనలను పాటించని సంస్థలు, డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) కేసులు ఎదుర్కొంటున్న కంపెనీలు ఈ జాబితాలో ఉంటాయి. ఐటీ హార్డ్‌వేర్ సంబంధ దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 8.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే ల్యాప్‌టాప్‌లు సహా పర్సనల్ కంప్యూటర్లు దిగుమతయ్యాయి. అత్యధికంగా చైనా (5.11 బిలియన్ డాలర్లు), సింగపూర్ (1.4 బిలియన్ డాలర్లు), హాంకాంగ్ (807 మిలియన్ డాలర్లు) నుంచి ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులు దిగుమతవుతున్నాయి. -
ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐకి 40 దరఖాస్తులు - లక్షల కోట్ల ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: ఐటీ హార్డ్‌వేర్ ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద రూ. 4.65 లక్షల కోట్ల విలువ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, సర్వర్లు మొదలైనవి తయారు చేసేందుకు 40 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. అవన్నీ ఎంపికైన పక్షంలో ప్రోత్సాహక మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించిన రూ. 17,000 కోట్లకు మించి రూ. 22,890 కోట్లకు పెంచాల్సి వస్తుందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ‘గడువు తేదీ ఆగస్టు 30 నాటికి 40 దరఖాస్తులు వచ్చాయి. రూ. 3.35 లక్షల కోట్ల తయారీ లక్ష్యాలకు మించి రూ. 4.65 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు చేశాయి‘ అని పేర్కొంది. డెల్, హెచ్‌పీ వంటి బడా ఐటీ హార్డ్‌వేర్ కంపెనీలు నేరుగా, హెచ్‌పీఈ, లెనొవొ, ఏసర్, అసూస్, థామ్సన్ వంటివి దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్లు ఉన్న కంపెనీల ద్వారా దరఖాస్తు చేసుకున్నాయి. మిగతా వాటిల్లో యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్, ప్యాడ్జెట్ (డిక్సన్), వీవీడీఎన్, నెట్వెబ్, ఆప్టీమస్, సహస్ర, సోజో (లావా) మొదలైనవి ఉన్నాయి. -
ఐటీ హార్డ్‌వేర్ కోసం పీఎల్ఐ స్కీము
హైదరాబాద్: మొబైల్ ఫోన్ల విభాగం తరహాలోనే ఐటీ సర్వర్, ఐటీ హార్డ్‌వేర్‌కు కూడా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. అలాగే ఐటీ పీఎల్ఐలో దేశీయంగా డిజైన్ చేసిన మేథో సంపత్తిని తమ ఉత్పత్తుల్లో వినియోగించే తయారీదారులకు అదనంగా ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. వీఎల్ఎస్ఐ డిజైన్ కాన్ఫరెన్స్ 2023లో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. కొత్త తరం యాప్స్‌ను తయారు చేసే దిశగా ఐపీ, సాధనాలు, డివైజ్‌లను రూపొందించే స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేసేందుకు 200 మిలియన్ డాలర్ల ఫ్యూచర్ డిజైన్ ప్రోగ్రామ్‌ను కేంద్రం ప్రకటించిందని మంత్రి వివరించారు. గ్లోబల్ డిజిటలైజేషన్లో కొత్త ఆవిష్కరణలకు సెమీకండక్టర్ల తోడ్పాటు అనే అంశంపై అయిదు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు! -
ల్యాప్‌టాప్, టాబ్లెట్, పీసీల వంతు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు (పీసీ), సర్వర్ల తయారీతోపాటు, ఫార్మా రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) అమలు చేసే ప్రతిపాదనలకు ప్రధాని అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలియజేసింది. అంతర్జాతీయంగా పేరొందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు భారత్‌లో తయారీ దిశగా ఆకర్షించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. టెలికం ఎక్విప్మెంట్ల తయారీకి పీఎల్ఐ పథకాన్ని వర్తింపజేస్తూ, 12,195 కోట్ల మేర రాయితీలు కల్పించేందుకు కేంద్రం గతవారం నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఐటీ హార్డ్‌వేర్ (ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్ ఇన్ వన్ పీసీలు, సర్వర్ల తయారీతో కూడిన) రంగానికి పీఎల్ఐ పథకం కింద రూ.7,350 కోట్ల రాయితీలు ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసినట్టు సమావేశం అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ మీడియాకు తెలిపారు. నాలుగు సంవత్సరాలపాటు భారత్‌లో ఈ ఉత్పత్తుల తయారీకి ఈ మేరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. ఈ పథకం భారత్‌ను తయారీ కేంద్రంగా మలచడంతోపాటు, ఎగుమతుల వృద్ధికి, ఉపాధి అవకాశాల విస్తృతికి తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ల తయారీకి పీఎల్ఐ పథకాన్ని గతేడాది కేంద్రం ప్రకటించడంతో శామ్సంగ్, యాపిల్ తదితర దిగ్గజ అంతర్జాతీయ, దేశీయ సంస్థలు రాయితీల కోసం దరఖాస్తులు చేసుకోవడం తెలిసిందే. ఇవే ప్రోత్సాహకాలు.. 2019–20 బేస్ సంవత్సరంగా పరిగణిస్తూ ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల విక్రయాల(పెరిగిన మేర)పై 4–1 శాతం వరకు ప్రోత్సాహకాలను ఈ పథకం కింద కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వనుంది. పెట్టుబడులు పెట్టడంతోపాటు, ఉపాధి కల్పన, నిర్దేశిత విక్రయ లక్ష్యాలను చేరుకున్న కంపెనీలకే ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఐదు అంతర్జాతీయ సంస్థలు, 10 దేశీ చాంపియన్ కంపెనీలు ప్రయోజనం పొందనున్నాయని మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. ఈ ఉత్పత్తుల కోసం దిగుమతులపై ఆధారపడి ఉన్నామని పేర్కొంటూ, వీటి విషయంలో స్వావలంబన అవసరమన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో అదనంగా రూ.2,700 కోట్ల పెట్టుబడులకు తాజా నిర్ణయం వీలు కల్పిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ల్యాప్‌టాప్, టాబ్లెట్ల డిమాండ్ ను పెద్ద మొత్తంలో దిగుమతుల రూపంలోనే తీర్చుకుంటున్నాము. రూ.29,470 కోట్ల మేర ల్యాప్‌టాప్‌లు, రూ.2,870 కోట్ల ట్యాబ్లెట్ల దిగుమతులు నమోదవుతున్నాయి. ‘‘గడిచిన 5 నెలల కాలం లో పీఎల్ఐ పథకం కింద రూ.35,000 కోట్ల ఉత్ప త్తుల తయారీ దేశీయంగా నమోదైంది. రూ.1,300 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కొత్తగా 22,000 మందికి ఉపాధి లభించింది’’ అని కేంద్రం తెలిపింది. ఫార్మాలోకి రూ.15,000 కోట్ల పెట్టుబడులు ఫార్మాస్యూటికల్స్‌కు సైతం పీఎల్ఐ కింద రూ.15,000 కోట్ల రాయితీల కల్పనకు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. దేశీయ తయారీ సంస్థలకు ఈ పథకం మేలు చేస్తుందని, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనతోపాటు ప్రజలకు మందులు అందుబాటు ధరలకు లభించేందుకు వీలు కల్పిస్తుందని కేంద్రం పేర్కొంది. పీఎల్ఐ పథకం వల్ల ఆరేళ్ల కాలంలో (2022–28 మధ్య) రూ.2.94 లక్షల కోట్ల మేర ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు, రూ.1.96 లక్షల కోట్ల ఫార్మా ఎగుమతులు నమోదవుతాయనేది ప్రభుత్వం అంచనా. ప్రోత్సాహకాలు..: అంతర్జాతీయ తయారీ ఆదాయాల (జీఎమ్ఆర్) ఆధారంగా ఫార్మా కంపెనీలను కేంద్రం మూడు కేటగిరీలుగా విభజించింది. గ్రూప్ ఎ కింద రూ.5,000 కోట్లు అంతకుమించి జీఎమ్ఆర్ కలిగిన కంపెనీలకు.. రూ.11,000 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. రూ.500–5,000 కోట్ల మధ్య జీఎమ్ఆర్ కలిగిన కంపెనీలకు గ్రూప్ బి రూ.2,250 కోట్లు, రూ.500 కోట్లలోపు జీఎమ్ఆర్ కలిగిన ఫార్మా కంపెనీలకు గ్రూప్ సి కింద రూ.1,750 కోట్ల మేర ప్రోత్సాహకాలను కేంద్రం నాలుగేళ్ల కాలంలో ఇవ్వనుంది. -
ఈ–వేస్ట్ విస్ఫోటనం!
సాక్షి, సిటీబ్యూరో: పెరుగుతోన్న ఆధునిక ఐటీ–హార్డ్‌వేర్ ఆధారిత పరిశ్రమలు, కంప్యూటర్, గృహోపకరణాలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు గ్రేటర్ నగరాన్ని ఈ–వేస్ట్‌కు అడ్డాగా మారుస్తున్నాయి. మహానగరం పరిధిలో కంప్యూటర్లు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు విరివిగా వినియోగిస్తున్న ఒక్కో ఇంటి నుంచి ఏటా సగటున 5 కిలోల ఈ–వ్యర్థాలు ఉత్పన్నమౌతున్నట్లు ఈపీటీఆర్ఐ సర్వే అంచనా వేసింది. ఈ వ్యర్థాల ఉత్పత్తిలో దేశంలో ముంబై తొలిస్థానంలో నిలవగా ఆ తర్వాత ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలు నిలిచాయి. మన గ్రేటర్ నగరం ఈ మెట్రో నగరాల తర్వాత ఐదోస్థానంలో నిలవడం గమనార్హం. మొత్తంగా దేశవ్యాప్తంగా ఏటా సుమారు 12.5 లక్షల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగు పడుతుండగా..మన మహానగరంలో ఏటా సుమారు 40 వేల టన్నుల ఈ–వేస్ట్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కాగా 2009లో నగరంలో కేవలం 3262 మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాలే ఉత్పన్నమయ్యేవి. కానీ ప్రస్తుతం నగరంలో సుమారు 40 వేల మెట్రిక్ టన్నులు పోగవుతున్నాయి. ఇందులో సుమారు 75 శాతం వరకు గృహాల నుంచే వెలువడుతున్నట్లు తేలింది. మరో ఐదేళ్లలో నగరంలో ఈ–వ్యర్థాలు లక్ష టన్నుల మార్కును చేరుకుంటాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పర్యావరణానికి హాని కలిగించే రీతిలో సాధారణ చెత్తతో పాటే పడవేస్తుండడంతో ఇవి పర్యావరణంలో కలిసి అనర్థాలు తలెత్తుతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రేటర్లో ఏటా 40 వేల టన్నుల ఈ–వ్యర్థాలు గ్రేటర్లో ఈ–వేస్ట్ వ్యర్థాలపై గచ్చిబౌలిలోని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ)గతంలో నిర్వహించిన సర్వేలో ఆందోళన కలిగించే వాస్తవాలు బయటపడ్డాయి. ఏటా టెలివిజన్స్, కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ప్రింటర్లకు సంబంధించి ఏడాదికి 12 వేల టన్నుల వ్యర్ధాలు విడుదలవున్నట్లుగా తేలింది. ఇక టెలిఫోన్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీలు, కూలర్లు...ఇలాంటి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వ్యర్థాలను కలుపుకుంటే ఏడాదికి మొత్తంగా సుమారు 28 వేల టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా వేసింది. రాబోయే ఐదేళ్లలో ఈ–వ్యర్థాలు లక్ష టన్నులకు చేరుకునే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నాయి. పనిచేయని సేకరణ కేంద్రాలు..? ఈ–వ్యర్థాల శుద్ధికి ప్రపంచ బ్యాంకు సౌజన్యంతో మన దేశవ్యాప్తంగా క్లీన్ ఈ–ఇన్షియేటివ్ అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద గ్రేటర్ నగరంలో గైడ్ ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్, అట్టెరో ఎలక్ట్రానిక్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని కూకట్పల్లి, ఖైరతాబాద్, హఫీజ్‌పేట్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పేరుకే ఈ–వేస్ట్ సేకరణ కేంద్రాలను స్థాపించారు. అయితే ఈ కేంద్రాలకు ఎలా వ్యర్థాలను తరలించాలన్న అంశంపై వినియోగదారుల్లో అవగాహన కల్పించే విషయంలో పీసీబీ విఫలమౌతోంది. ఈ కేంద్రాల పనితీరు సైతం ప్రశ్నార్థకమౌతోంది. ఈ–వేస్ట్‌ను పునఃశుద్ధి(రీసైక్లింగ్) చేయని కారణంగా తలెత్తే సమస్యలివీ.. ♦ క్యాథోడ్రేట్యూబ్లు:టీవీల్లో వినియోగించే ఈ ట్యూబుల్లో లెడ్, బేరియం ఇతర భారలోహాలు, నీటిని విషయంగా మార్చే సల్ఫర్ భూగర్భజలాల్లోకి చేరుతున్నాయి. ♦ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు: వీటిని వృథాగా పడవేయడంతో బ్రోమిన్, బెరీలియం, క్యాడ్మియం, మెర్క్యూరీ వంటి పదార్థాలు భూగర్భజలాల్లోకి చేరుతున్నాయి. అంతేకాదు వీటి తయారీలో విరివిగా వినియోగించే బంగారం, రాగి, వెండి, ప్లాటినం, పెల్లాడియం, జింక్, నికెల్, ఇనుము వంటి లోహాలను తిరిగి సంగ్రహించకుండా(రీసైకిల్ లేకుండా)వదిలివేయడంతో ఆయా సహజ వనరులపై వత్తిడి పెరుగుతోంది. ♦ ఈ–చిప్స్, బంగారు పూత విడిభాగాలు: హైడ్రోకార్భన్లు, భారలోహాలు జలాశయాల్లోకి చేరి అందులోని చేపలు, ఇతర వక్షఫ్లవకాలను నాశనం చేస్తున్నాయి. భూగర్భజలాలు సైతం విషతుల్యమౌతున్నాయి. ♦ ప్రింటర్లు, కీబోర్డులు: హైడ్రోకార్భన్లు, భారలోహాలు భూమి, నీరు, భూగర్భజలాలను కలుషితం చేస్తున్నాయి. ♦ కంప్యూటర్ వైర్లు: వీటిని మండించడం వల్ల పాలీ ఆరోమాటిక్ హైడ్రోకార్భన్లు పర్యావరణంలోకి వెలువడి భూమి,నీరు,గాలిని విషతుల్యంగా మారుస్తున్నాయి. ♦ కంప్యూటర్ విడిభాగాలు,రబ్బరు,ప్లాస్టిక్ వస్తువులు: పాలీ ఆరోమాటిక్ హైడ్రో కార్భన్లు వెలువడి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ♦ టోనర్ కాట్రిడ్జులు: వీటిని దహనం చేయడం వల్ల పీల్చే గాలి కలుషితమౌతోంది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ విడిభాగాలనుంచి వెలువడే ఉండే ముఖ్య మూలకాలు–వాటి వల్ల తలెత్తే సమస్యలివే.. క్యాథోడ్ రే ట్యూబ్‌లు: లెడ్: నాడీ, రక్తప్రసరణ వ్యవస్థలు దెబ్బతింటాయి. ఎల్సీడీలు: మెర్క్యూరీ: మెదడు, రక్తనాళాలు దెబ్బతింటాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కంప్యూటర్లు: కాపర్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్,లెడ్, ఆర్సినిక్, క్యాడ్మియంలు: ఆమ్ల వర్షాలకు కారణమౌతాయి. పీల్చే గాలి విషతుల్యమౌతుంది. సెమీకండక్టర్లు: రసాయనాలు, మూలకాలు: శ్వాసక్రియ, రక్తప్రసరణ వ్యవస్థ, కాలేయం, వినాళ గ్రంథులు దెబ్బతింటాయి. -
ఓఆర్ఆర్ బయటకూ విస్తరించిన రియల్ బూమ్
ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 80 లక్షలకు పైమాటే. 2041 నాటికి ఈ సంఖ్య 2.50 కోట్లు దాటుతుందని అంచనా. ఈ నేపథ్యంలో నగరంపై పడే ఒత్తిడిని తట్టుకోవాలంటే శివార్లలో చిన్న నగరాల నిర్మాణం అవసరమంటున్నారు నిపుణులు. త్వరలోనే దాదాపు 160 కి.మీ. పొడవునా నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఓఆర్ఆర్ చుట్టూ ఒక్కో నగరం 3,813 చ.కి.మీ. విస్తీర్ణంలో మొత్తం 13 మినీ నగరాలను నిర్మించేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శంషాబాద్ లో మెడికల్ సిటీ, కీసరలో నాలెడ్జ్ సిటీ, ఘట్కేసర్లో ఐటీ సాఫ్ట్వేర్ సిటీ, గుండ్లపోచంపల్లిలో బయో, ఫార్మా సిటీ, బొంగ్లూరులో ఐటీ హార్డ్‌వేర్ , ఎలక్ట్రానిక్స్ సిటీ, శామీర్‌పేటలో రిక్రియేషన్ సిటీ, కోకాపేట్లో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సిటీ, పటాన్చెరులో మీడియా సిటీ/ మార్కెట్ సెంటర్, ఆదిభట్ల, తక్కుగూడలో ఎయిరోస్పేస్ సిటీ, మేడ్చల్, తెల్లాపూర్-నాగులపల్లిలో ఇన్‌ల్యాండ్ కాంటినెంటల్ డిపోలు రానున్నాయి. దీంతో ఇప్పటివరకు ఓఆర్ఆర్ లోపల ఉన్న రియల్ బూమ్ కాస్త ఓఆర్ఆర్ వెలుపలి ప్రాంతాలకూ విస్తరించిందని కాడోల్ ప్రాపర్టీస్ పార్టనర్ విక్రమ్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఐటీ హబ్‌కు నేరుగా రవాణా వ్యవస్థ ఉన్న తెల్లాపూర్, కొల్లూరుల్లో అభివృద్ధి మరింత శరవేగంగా సాగుతోందన్నారు. డెరైక్ట్ కనెక్టివిటీ: ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే మెరుగైన రవాణా వ్యవస్థ, ధరలు అందుబాటులో ఉంటేనే సాధ్యం. ఈ విషయంలో కొల్లూర్ మాత్రం ముందు వరుసలోనే ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 15 నిమిషాల్లో, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు, మెహదీపట్నానికి 25 నిమిషాల్లో, ఓఆర్ఆర్ (ఎగ్జిట్ నం:2) 5 నిమిషాల ప్రయాణ వ్యవధిలోనే ఉందీ ప్రాంతం. గచ్చిబౌలి, కోకాపేట్ పరిసరాల్లో స్థిరాస్తి ధరలు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులు సుదూర ప్రాంతాల నుంచి గంటల కొద్దీ ప్రయాణం చేస్తూ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల్లోని కార్యాలయాలకు చేరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు స్థిరాస్తి రంగంలో కొత్త పెట్టుబడి ప్రాంతంగా అవతరించింది కొల్లూరు. కొల్లూరే బెటర్ చాయిస్: బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, హైటెక్ సిటీల్లో సొంతిల్లున్న వాళ్లు రెండో ఆస్తిగా బెంగళూరు, చెన్నై వంటి ఇతర నగరాలకు వెళ్లే వాళ్లు. కానీ, ప్రస్తుతం వారి రెండో ఆస్తిని కూడా తెల్లాపూర్, కొల్లూర్ ప్రాంతాల్లో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. దీంతో ఇవి ఉన్నత శ్రేణి వర్గాలుండే ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో లక్షకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ ప్రీమియం ఇళ్లను, షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్ వంటి వసతులను కల్పించేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ధరలూ అందుబాటులో ఉండటం, మెరుగైన రవాణా వ్యవస్థ ఉండటంతో పెట్టుబడిదారుల దృష్టంతా ఇప్పుడు కొల్లూర్ పైనే. ఇప్పటికే కడోల్ ప్రాపర్టీస్, 9ఎం డెవలపర్స్, గోల్డెన్ గేట్ ప్రాపర్టీస్ వంటి నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి.