ముంబై: వేగవంతమైన టెలికం నెట్‌వర్క్‌ను సమర్ధంగా వినియోగించుకోగలిగే సర్వీసులు లేకపోవడం వల్లే 5జీ నెట్‌వర్క్ ప్రయోజనాలు దేశీయంగా పూర్తి స్థాయిలో లభించడం లేదని ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. ఫలితంగా స్ప్రెడ్‌షీట్ లేదా వర్డ్ డాక్యుమెంటును ఉపయోగించే యూజర్లకు 4జీ, 5జీ సర్వీసుల మధ్య వ్యత్యాసం తెలియకుండా పోతోందని వ్యాఖ్యానించారు. 5జీ లాంటి ఆధునిక టెక్నాలజీ నుంచి అపరిమిత ప్రయోజనాలు పొందడానికి అవకాశమున్నా తిరోగమన నియంత్రణ విధానాల వల్ల పరిమిత స్థాయిలోనే లభ్యమవుతున్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఫ్రేమ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విఠల్ చెప్పారు.
ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 1.5 లక్షల పైచిలుకు గ్రామాలు, 7,000 పట్టణాలకు తమ 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. కానీ 5జీ నెట్‌వర్క్ విస్తరిస్తున్న స్థాయిలో దాన్ని ఉపయోగించుకునే సర్వీసులు అందుబాటులో ఉండటం లేదని పేర్కొన్నారు. ఇందుకోసం 5జీ టెక్నాలజీని ఉపయోగించుకునే వ్యవస్థ అంతా సమిష్టిగా పని చేయాల్సి ఉంటుందని విఠల్ వివరించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ పాఠశాల విద్యార్థులకు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపై నడుస్తున్న అనుభూతిని అందించడం, ఓ సర్జన్‌కు సంక్లిష్టమైన శస్త్రచికిత్సలో తోడ్పాటు అందించడం వంటి మార్గాల్లో 5జీతో ఒనగూరే ప్రయోజనాలను సోదాహరణంగా తాము చూపించామని ఆయన చెప్పారు. కానీ క్షేత్ర స్థాయిలో మార్పులు జరుగుతున్నంత వేగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసులు, వినోద రంగాలు ముందుకు పరుగెత్తడం లేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment