
కేంద్ర మాజీమంత్రిని ప్రశ్నించిన సీబీఐ
టెలికం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ను సీబీఐ బుధవారం ప్రశ్నించింది. చెన్నైలోని తన ఇంట్లోనే ఏకంగా 300 హై డేటా కెపాసిటీ ఉన్న బీఎస్ఎన్ఎల్ టెలికం లైన్లతో ఓ భారీ ఎక్స్ఛేంజి పెట్టుకున్న కేసులో ఆయనను సీబీఐ విచారించింది. బుధవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయన హాజరయ్యారు. సీబీఐ స్పెషల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది మారన్ను విచారించారు. వాస్తవానికి సోమవారమే మారన్ రావాల్సి ఉన్నా, ఆయన రాలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి.
ఆయన మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ఆ బెయిల్ మంగళవారం వచ్చింది. ఇంతకుముందు ఇదే కేసులో సీబీఐ అరెస్టుచేసిన ముగ్గురు సన్ టీవీ అధికారులకు కూడా మద్రాస్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ పేరుతో ఏకంగా 323 రెసిడెన్షియల్ లైన్లను మారన్ టెలికం మంత్రిగా ఉన్న సమయంలో తన ఇంట్లో పెట్టుకుని, వాటిని సన్ టీవీ కోసం వాడుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. ఇవన్నీ కూడా ఐఎస్డీఎన్ లైన్లని.. అంటే టీవీ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయడానికి కావల్సిన సామర్థ్యం వాటికి ఉంటుందని తెలిపింది.