ఆరు టెల్కోలకు షాక్!
♦ త్వరలో డాట్ రూ.12,500 కోట్ల డిమాండ్ నోటీస్!
♦ 2006-10 మధ్య ఆదాయాలు
♦ తక్కువగా చూపాయన్న కాగ్ నివేదిక
న్యూఢిల్లీ: టెలికం శాఖ (డీఓటీ-డాట్) త్వరలో ఆరు టెలికం ఆపరేటర్స్‌కు రూ.12,500 కోట్ల డిమాండ్ నోటీస్ జారీ చేయనుంది. 2006-2010 మధ్య దాదాపు రూ.46,000 కోట్ల మేర తక్కువ ఆదాయం చూపించాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) పేర్కొన్న ఆరు కంపెనీలకు ఈ మేరకు నోటీసులు జరీ చేయనున్నట్లు టెలికం మంత్రిత్వశాఖలో ఒక అధికారి తెలిపారు. వీటిలో ఆర్‌కామ్, టాటా టెలీ, ఒడాఫోన్, ఎయిర్‌టెల్, ఐడియా, ఎయిర్‌సెల్‌లు ఉన్నాయి. మార్చిలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఆయా కంపెనీలు దాదాపు రూ.46,045.75 కోట్ల తమ ఆదాయాలను దాచిపెట్టినట్లు ఈ నివేదిక పేర్కొంది. కాగ్ పత్రాలు జూన్‌లో టెలికం శాఖకు అందడంతో కంపెనీలకు నోటీసుల జారీకి రంగం సిద్ధమవుతున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఆదాయాన్ని వదులుకునే ప్రశ్నేలేదని కూడా ఆయన పేర్కొన్నారు.
వడ్డీ, జరిమానాలు కూడా...
తక్కువ చూపించిన ఆదాయం రూ.12,488.93 కోట్లుకాగా దీనికి టెలికం శాఖ వడ్డీ, జరిమానాలు కూడా జత చేయనున్నట్లు సమాచారం. అయితే కాగ్ నివేదికపై టెలికం ఆపరేటర్లు ఒక సంయుక్త ప్రకటనలో అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఆదాయాల లెక్కింపు జరిగిందని వివరించాయి. నివేదిక వల్ల ఏదైనా అదనపు భారం పరిస్థితి ఎదురయితే... ఈ సమస్యను పరస్పర చర్చల ద్వారా కానీ లేక, కోర్టుల ద్వారా కానీ పరిష్కరించుకుంటామని కూడా పేర్కొన్నాయి. కాగ్ పేర్కొన్నట్లు అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ తక్కువ లెక్కలను కంపెనీల వారీగా చూసి నోటీసుల భారాన్ని పరిశీలిస్తే- రూ.3,728.54 కోట్లతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ వరుసలో మొదట ఉంది. తరువాత వరుసలో టాటా టెలిసర్వీసెస్ (రూ.3,215.39 కోట్లు), ఎయిర్‌టెల్ (రూ.2,651.89 కోట్లు), ఒడాఫోన్ (రూ.1,665.39 కోట్లు), ఐడియా (రూ.964.89 కోట్లు), ఎయిర్‌సెల్ (రూ.262.83 కోట్లు) ఉన్నాయి.